Women Empowerment: స్వేచ్ఛ బ్యూరో: మహిళలను సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా రాష్ట్ర అభివృద్ధికి చోదకశక్తులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మహిళా వారోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మే 25 నుంచి 31 వరకు నిర్వహించిన ఈ వారోత్సవాలు మహిళల ఆర్థిక, సామాజిక, విద్యా, ఆరోగ్య, రాజకీయ సాధికారతకు కొత్త ఊపునిచ్చాయి.
గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం సహాయక సంఘాల బలోపేతం, బాలికల్లో నాయకత్వ లక్షణాల పెంపు, మహిళల భద్రత, పారిశ్రామిక ప్రోత్సాహం, అక్షరాస్యత, బాల్య వివాహాల నిర్మూలన, చిన్నారుల సంక్షేమం వంటి విభిన్న అంశాలపై వారంరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వేలాది కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, సెర్ప్, మెప్మా, అంగన్‌వాడీ వ్యవస్థ, వివిధ ప్రభుత్వ శాఖలు, స్వయం సహాయక సంఘాలు సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమాలు మహిళా సాధికారతను ప్రజా ఉద్యమంగా మార్చాయి.
వారోత్సవాల ప్రారంభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 వేల ఇందిరా మహిళా శక్తి భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. గ్రామీణ మహిళల సమావేశాలు, శిక్షణలు, జీవనోపాధి కార్యకలాపాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలకు ఈ భవనాలు కేంద్రాలుగా మారనున్నాయి. మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యూనిఫాం చీరలను కూడా ఆవిష్కరించారు.
Also read: Rainwater: మణికొండలో అపార్ట్‌మెంట్ వాసుల అద్భుతం.. జలమండలి ప్రశంసల జల్లు..!
మహిళలను ఉద్యోగాలు కోరుకునే స్థాయి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్ కార్యక్రమాలు, రుణమేళాలు, జీవనోపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలు, మార్కెటింగ్ అవకాశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా మధిరలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి సౌర విద్యుత్ కేంద్రం ప్రారంభం మహిళల సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది.
మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ హైదరాబాద్‌లో ఉద్యోగినుల కోసం సఖి నివాస్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, సఖి వన్ స్టాప్ సెంటర్‌ను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా POSH చట్టంపై అవగాహన కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు నిర్వహించారు. “బాల్య వివాహం – బతుకు ఆగం” నినాదంతో గ్రామసభలు, ర్యాలీలు, కళాజాతాలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించి బాల్య వివాహాల నిర్మూలనపై విస్తృత చైతన్యం కల్పించారు.
చిన్నారుల ఆరోగ్యం, పోషణకు ప్రాధాన్యతనిస్తూ “బలమైన బాల్యానికి 1000 మెట్లు” కార్యక్రమం నిర్వహించగా, అంగన్‌వాడీ వ్యవస్థ బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా 50 కొత్త అంగన్‌వాడీ భవనాలను ప్రారంభించి, మరో 27 భవనాలకు శంకుస్థాపనలు చేపట్టారు. “అమ్మ మాట – అంగన్‌వాడీ బాట” కార్యక్రమం ద్వారా చిన్నారులకు యూనిఫారాలు, విద్యారంభ ధృవపత్రాలు అందజేయడంతో పాటు “అమ్మకు అక్షరమాల” కార్యక్రమం ద్వారా అక్షరాస్యత సాధించిన మహిళలను సన్మానించారు.
Also read: GHMC Vehicles: జీహెచ్ఎంసీలో బిగ్ స్కామ్.. బైక్ నెంబర్లతో కారు బిల్లులు క్లెయిమ్..!
కిశోర బాలికల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు స్నేహ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మాక్ పార్లమెంట్‌లు, మాక్ అసెంబ్లీలు నిర్వహించారు. జిల్లా స్థాయిల్లో ప్రతిభ కనబరిచిన బాలికలతో హైదరాబాద్ జూబ్లీహాల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలను తలపించింది. ప్రజా సమస్యలపై చర్చలు, విధానాలపై అభిప్రాయాల వ్యక్తీకరణ, ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన ద్వారా బాలికలకు భవిష్యత్ నాయకత్వానికి అవసరమైన పునాది ఏర్పడింది.
వారోత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మహిళా శక్తి మహాసభ మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచింది. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు తమ ఐక్యత, సంకల్పాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు కేటాయించిన 553 ఆర్టీసీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు ప్రయాణికులుగా మాత్రమే కాకుండా బస్సుల యజమానులుగా ఎదిగేలా తీసుకొచ్చిన ఈ కార్యక్రమం మహిళా ఆర్థిక సాధికారతలో కీలక మైలురాయిగా నిలిచింది.
అదే సభలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ.500 కోట్ల ప్రోత్సాహకాన్ని విడుదల చేయడంతో పాటు, బస్సుల అద్దె చార్జీల కింద మండల మహిళా సమాఖ్యలకు రూ.20.34 కోట్ల చెక్కులను అందజేశారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం ద్వారా కుటుంబాలకు కలిగిన ఆర్థిక ప్రయోజనాలను ప్రతిబింబించేలా రూ.10,700 కోట్ల ఆదా వివరాలను వెల్లడించారు. మహిళా సంఘాల విజయగాథలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు “మహిళా ప్రగతి” మాసపత్రికను కూడా ఆవిష్కరించారు.
మహిళలు వ్యవసాయం, సూక్ష్మ వ్యాపారాలు, సేవారంగం, పారిశ్రామిక రంగం, పునరుత్పాదక ఇంధన రంగం, ప్రజా నాయకత్వం వంటి అన్ని రంగాల్లో రాణించగలరని ఈ వారోత్సవాలు నిరూపించాయని మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. మహిళలు బలపడితే కుటుంబం బలపడుతుందని, కుటుంబం బలపడితే సమాజం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని ఆమె అన్నారు.
మహిళా సాధికారతను ఒక కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా మార్చాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి మహిళా వారోత్సవాలు బలమైన పునాది వేశాయని మంత్రి సీతక్క తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడుతుందని, తెలంగాణ మహిళలను దేశానికి ఆదర్శంగా నిలబెట్టే దిశగా కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మహిళా వారోత్సవాల విజయానికి కృషి చేసిన స్వయం సహాయక సంఘాల సభ్యులు, స్నేహ సంఘాల బాలికలు, అంగన్‌వాడీ సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువత మరియు ప్రజలందరికీ మంత్రి సీతక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహిళా సాధికారతను పరిపూర్ణం చేసేందుకు ఇదే ఒరవడితో పనిచేయాలని పిలుపునిచ్చారు.
Also Read: Free Breakfast: రూ. 180 కోట్ల భారీ బడ్జెట్‌తో సరికొత్త స్కీమ్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!