Telangana Tourism: స్వేచ్చ బ్యూరో: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ రంగాల్లో సాధించిన ప్రధాన విజయాలను మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. శనివారం మీడియా ప్రకటన విడుదల చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను ప్రపంచస్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడం, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, కళాకారుల సంక్షేమాన్ని ప్రోత్సహించడం, పర్యాటక మౌలిక సదుపాయాలను విస్తరించడం, పెట్టుబడులను ఆకర్షించడం, స్థానిక ఉపాధి అవకాశాలను పెంపొందించడం వంటి లక్ష్యాలతో సమగ్ర కార్యాచరణ చేపట్టిందని మంత్రి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారిగా తెలంగాణ టూరిజం పాలసీ 2025–2030ను అమలు చేశామని మంత్రి తెలిపారు. ఈ విధానం ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పీపీపీ విధానంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సుస్థిర పర్యాటకం, డిజిటల్ ప్రచారం, అంతర్జాతీయ బ్రాండింగ్, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
టూరిజం కాన్‌క్లేవ్-2025 ద్వారా 24 మంది పెట్టుబడిదారుల నుంచి రూ.15,285 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు లభించాయని మంత్రి తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో 18 మంది పెట్టుబడిదారులతో రూ.8,456 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. వీటి ద్వారా 10 వేల ప్రత్యక్ష, 30 వేల పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడనున్నాయని పేర్కొన్నారు.
Also read; భద్రాద్రి కొత్తగూడెంలో అర్ధరాత్రి భూప్రకంపనలు, రోడ్ల మీదకు ప్రజలు పరుగులు, వాతావరణంలో మార్పులు
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.181 కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరయ్యాయని తెలిపారు. బుద్ధవనం, రామప్ప, సోమశిల, నిజాంసాగర్, బల్కంపేట ఆలయం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.289 కోట్ల వ్యయంతో 71 పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని చెప్పారు.
రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. 2023లో 5.84 కోట్లుగా ఉన్న దేశీయ పర్యాటకుల సంఖ్య 2024లో రికార్డు స్థాయిలో 8.82 కోట్లకు చేరిందన్నారు. 2025లో 8.48 కోట్ల మంది తెలంగాణను సందర్శించారని చెప్పారు. విదేశీ పర్యాటకుల సంఖ్య 2024తో పోలిస్తే 2025లో 10 శాతానికి పైగా పెరిగిందన్నారు.
99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ‘100 వీకెండ్ గేట్‌వే డెస్టినేషన్స్’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశామని మంత్రి తెలిపారు. పరిశుభ్రత, సౌకర్యాలు, స్థానిక ఉపాధి, వీకెండ్ టూరిజం సర్క్యూట్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు.
Also read: ఎట్టకేలకు యుద్ధం ముగిసింది.. ఇరాన్-అమెరికా మధ్య డీల్, ట్రంప్ కీలక ప్రకటన, జలసంధి ఓపెన్
తెలంగాణ చరిత్రలో తొలిసారిగా భువనగిరి కోట, ఖమ్మం కోటల వద్ద రోప్‌వే ప్రాజెక్టులు ప్రారంభించామని మంత్రి తెలిపారు. సోమశిల, హుస్సేన్ సాగర్, కోటిపల్లిలో అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ ప్రారంభించామని చెప్పారు.
హుస్సేన్ సాగర్‌లో ‘ముచుకుంద’ లగ్జరీ డబుల్ డెక్ క్రూయిజ్ సేవలను ప్రారంభించామని మంత్రి తెలిపారు. లక్నాపూర్, నిజాంసాగర్, వరదవెల్లి ప్రాంతాల్లో బోటింగ్ సౌకర్యాలను విస్తరించామని పేర్కొన్నారు.
72వ మిస్ వరల్డ్-2025 పోటీలను తెలంగాణ విజయవంతంగా నిర్వహించడం రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వం, కళలు, హస్తకళలు, పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేసే అరుదైన అవకాశం ఈ కార్యక్రమం ద్వారా లభించిందన్నారు.
ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ దేశ విదేశాల సందర్శకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. 2026 ఉత్సవాల్లో 18 దేశాల ప్రతినిధులు, 37 అంతర్జాతీయ, 55 మంది దేశీయ కైట్ ఫ్లయర్లు పాల్గొన్నారని తెలిపారు. హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, డ్రోన్ ఫెస్టివల్‌ల ద్వారా తెలంగాణ పర్యాటక రంగానికి కొత్త ఆకర్షణలు జోడించామని చెప్పారు.
బతుకమ్మ ఉత్సవాలు-2025 సందర్భంగా తెలంగాణ రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి తెలిపారు. అతిపెద్ద బతుకమ్మ పూల అలంకరణతో పాటు 1,354 మంది మహిళలతో నిర్వహించిన సమన్వయ బతుకమ్మ నృత్య ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుందని చెప్పారు.
హైదరాబాద్‌లో క్రమం తప్పకుండా హెరిటేజ్ వాక్‌లు నిర్వహిస్తున్నామని, హెరిటేజ్ రన్‌లో వేలాది మంది పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణ చారిత్రక వారసత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
సోమశిల ‘బెస్ట్ టూరిజం విలేజ్ ఆఫ్ ఇండియా–2024’, నిర్మల్ ‘బెస్ట్ టూరిజం విలేజ్ ఆఫ్ ఇండియా–2024’ అవార్డులు అందుకున్నాయని మంత్రి తెలిపారు. హైదరాబాద్‌కు బెస్ట్ హెరిటేజ్ టూరిజం అవార్డు, బెస్ట్ ఇండిజినస్ క్యులినరీ డెస్టినేషన్ అవార్డు లభించాయని చెప్పారు.
TG-iPASS ద్వారా ఆన్‌లైన్ అనుమతులు, ఈ-ఆఫీస్, జీపీఎస్ ట్రాకింగ్, డిజిటల్ టికెటింగ్, డిజిటల్ ప్రచార కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. పర్యాటకుల భద్రత కోసం టూరిస్ట్ పోలీసులను నియమించామని చెప్పారు.
1,690 మంది వృద్ధ కళాకారులకు నెలకు రూ.3,016 చొప్పున పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. పలువురు ప్రముఖ కళాకారులకు ప్రత్యేక పెన్షన్లు మంజూరు చేశామని చెప్పారు.
రవీంద్రభారతిలో ప్రారంభించిన 99 రోజుల ‘తెలంగాణ ప్రజా కళ’ కార్యక్రమం ద్వారా జానపద, గిరిజన, సంప్రదాయ కళారూపాలకు కొత్త ఊపిరి పోశామని మంత్రి తెలిపారు.
ఫణిగిరి, మాడుముల ప్రాంతాల్లో పురావస్తు తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఫణిగిరిలో బౌద్ధ మ్యూజియం ఏర్పాటు చేయడంతో పాటు పలు చారిత్రక కట్టడాల సంరక్షణ పనులు చేపట్టామని తెలిపారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ‘పునాస’ పత్రిక పునరుద్ధరణ, సాహిత్య వారం, దాశరథి శతజయంతి ఉత్సవాలు, రచయితల శిక్షణా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు.
పర్యాటకం, సంస్కృతి, వారసత్వ రంగాల్లో చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా తెలంగాణ దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు పొందుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పెట్టుబడులు, ఉపాధి, పర్యాటకాభివృద్ధి, వారసత్వ పరిరక్షణ, కళాకారుల సంక్షేమం అనే ఐదు ప్రధాన లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. తెలంగాణను ప్రపంచస్థాయి పర్యాటక, సాంస్కృతిక గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా మరింత వేగంగా పనిచేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
Also read: ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. చిన్నారితోపాటు ముగ్గురి మృతి, సిద్ధిపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం