Uttar Pradesh Tragedy: యూపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డిస్పోజబుల్ గ్లాసులో మందు తాగిన ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. కన్నౌజ్ లోని సక్రి ఖుర్ద్ గ్రామంలో గురువారం పురుగు మందు కోసం ఉపయోగించిన డిస్పోజబుల్ గ్లాసులో మందు తాగిన తర్వాత ఇద్దరు సోదరులు మరణించారు. ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. తన ఇద్దరు చిన్న కుమారుల మృతదేహాలను కలిసి తండ్రి గుండె పగిలేలా రోదించాడు.
సక్రి ఖుర్ద్ గ్రామానికి చెందిన రవీష్ కుమార్ శ్రీవాస్తవకు లీలాపూర్ గ్రామం సమీపంలో ఉన్న పొలంలో బంగాళాదుంప పంట వేశాడు. గురువారం ఉదయం 10 గంటల సమయంలో.. పంటను పురుగు పట్టిందని తన కుమారులు సత్యం(21), మయాంక్(19)తో కలిసి పురుగుమందు పిచికారీ చేశాడు. ఆ తర్వాత ముగ్గురూ పొలానికి నీళ్లు పెట్టారు. సాయంత్రం 5 గంటల సమయంలో.. సత్యం, మయాంక్.. తండ్రిని ఇంటికి పంపించి, పొలం వద్దే ఉండిపోయారు. ఇద్దరు సోదరులు మద్యం తాగాలని నిర్ణయించుకున్నారు. అయితే డిస్పోజబుల్ గ్లాసులు తీసుకురావడం మర్చిపోయారు. అక్కడికి సమీపంలో కనిపించిన రెండు ఖాళీ డిస్పోజబుల్ గ్లాసులను తీసుకొని అందులో మందు పోసుకుని తాగారు.
కాసేపటికే ఇద్దరూ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మయాంక్ అక్కడికక్కడే మరణించాడు. సత్యం తన తండ్రికి ఈ విషయం గురించి తెలియజేయడానికి ఫోన్ చేశాడు. కానీ తండ్రి పొలానికి చేరుకునేలోపే మయాంక్ అప్పటికే మరణించాడు. కుటుంబ సభ్యులు సత్యంను జిల్లా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని కాన్పూర్‌కు తరలించారు. అయితే, సత్యం కాన్పూర్‌కు వెళ్లే దారిలో మరణించాడు.
Also Read: నవరాత్రుల్లో 3 హత్యలు… సీను సీనుకో ట్విస్ట్ ఉన్న ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్
పురుగుమందు కలిపిన గ్లాసులో మందు తాగడం వల్ల ఇద్దరు సోదరులు మరణించారని మృతుడి అన్నయ్య శివం అనుమానం వ్యక్తం చేశాడు. ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టానికి పంపినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో.. పురుగుమందు కలిపిన గ్లాసులో మందు తాగడం మరణానికి కారణమని భావిస్తున్నామన్నారు.