Sabarimala: అయ్యప్ప స్వామి కొలువుదీరిన శబరిమల ఆలయంలో బంగారం మిస్ అవ్వడం ఇప్పుడు కలకలం రేపుతోంది. శబరిమల గర్భగుడి ముందు ద్వారపాలక విగ్రహాలపై ఉన్న బంగారు తాపడాలకు సంబంధించి 4.5 కేజీల బంగారం తగ్గిపోయింది.
విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించిన కేరళ హైకోర్టు
ఈ అంశంపై ఫోకస్ చేసిన కేరళ హైకోర్టు.. సుమోటోగా విచారణ జరిపింది. బంగారం ఎందుకు తగ్గింది? ఎలా తగ్గింది? దీనికి గల కారణాలేంటి? దీని వెనకున్నదెవరు? అనే విషయాలపై సమగ్ర దర్యాప్తు జరిపి మూడు వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలంటూ విజిలెన్స్ కమిషన్‌ను ఆదేశించింది.
2019లో మరమ్మతుల కోసం తొలగించిన తాపడాలు
శబరిమల గర్భగుడి ముందు ఉన్న ద్వారపాలకుల విగ్రహాలకు 1999లో బంగారు తాపడాన్ని ఏర్పాటు చేశారు. దీనికి 40 ఏళ్ల వారంటీ ఉంది. కానీ ఆరేళ్ల తర్వాత ఇవి దెబ్బతినడం ప్రారంభమైంది. 2019లో ఉన్ని కృష్ణన్ అనే భక్తుడు వాటికి రిపేర్లు చేయించేందుకు ముందుకు వచ్చాడు. దీంతో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు స్పెషల్ కమిషన్, కోర్టు అనుమతి లేకుండానే వాటిని రిపేర్లు చేయించేందుకు అనుమతి ఇచ్చింది.
42.8 కేజీలున్న బంగారం.. మరమ్మతుల కోసం చేరే సరికి 38.2 కేజీలే..
కానీ అసలు మతలబు అక్కడే జరిగిందనే అనుమానాలు ఉన్నాయి. విగ్రహాలకు బంగారు తాపడాలను తొలగించే సమయంలో అవి 42.8 కేజీల బరువు తూగాయి. కానీ తిరిగి అమర్చే సమయంలో 38.65 కేజీలు మాత్రమే ఉన్నాయి. దీంతో మిగిలిన 4.5 కేజీల బంగారం ఎటు పోయింది? అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
చెన్నైలో బంగారు తాపడాలకు మరమ్మతులు
ఈ వ్యవహారంలో ట్రావెన్‌కోర్ బోర్డ్ అధికారుల తీరుపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఎలాంటి అనుమతి లేకుండా తాపడాలను ఎందుకు తొలగించారు? ఈ సమయంలో రికార్డులను ఎందుకు సరిగా మెయింటేన్ చేయలేదు? అనే దానిపై హైకోర్టు అనేక అనుమానాలను వ్యక్తం చేసింది. అంతేకాదు ఈ రిపేర్లను చేసేందుకు ఆ తాపడాలను చెన్నైలోని ఓ సంస్థకు తరలించారు. వారు ఈ రిపేర్లు చేసేందుకు ఒక నెల 9 రోజుల సమయం తీసుకున్నారు.
Also Read: విశాఖ HPCLలో అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు
దాత పాత్రపై కూడా దర్యాప్తు జరపాలన్న హైకోర్టు
ఇంత సమయం ఎందుకు పట్టిందనే దానిపై కూడా దర్యాప్తు జరపాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు ఈ రిపేర్లను చేసేందుకు ముందుకు వచ్చిన దాత పాత్రపై కూడా విచారణ జరపాలంది కోర్టు. అలాగే 3 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎస్పీ స్థాయి అధికారితో విజిలెన్స్ శాఖ విచారణ జరపాలని.. ఈ విచారణకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పూర్తిగా సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు ద్వారపాలకులకు ఉపయోగించే సెకండ్ సెట్ కూడా లాకర్ రూమ్‌లో భద్రంగా ఉందో లేదో చూడాలని కూడా ఆదేశించింది.