Alampur Jogulamba : ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా, అష్టాదశ శక్తిపీఠాల్లో అయిదవదిగా భాసిల్లుతున్న దివ్య క్షేత్రాల్లో ఆలంపూర్ ఒకటి. ఇక్కడ అమ్మవారు.. జోగులాంబ పేరుతో పూజలందుకుంటోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో తుంగభద్రా నదీ తీరాన.. కృష్ణా, తుంగభద్రల సంగమప్రాంతం సంగమేశ్వరం సమీపంలో ఈ ప్రాచీనక్షేత్రం ఉంది. బాదామి చాళుక్యుల కాలపు పాలకులు క్రీ.శ. 6, 7వ శతాబ్దాల సమయంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు శాసనాలను బట్టి తెలుస్తోంది. ఈ ఆలయ సముదాయం నవబ్రహ్మల క్షేత్రంగానూ ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు నగరంగా మారిన కర్నూలు పట్టణ ఏర్పాటుకు నాంది ఆలంపూర్ క్షేత్ర నిర్మాణమే.
దక్షయజ్ఞ సమయంలో అమ్మవారి దవడ భాగం ఇక్కడ రాలిపడిందని ప్రతీతి. జోగులాంబా దేవి.. తీక్షణమైన చూపులతో, రుద్రరూపిణిగా కనిపిస్తుంది. కానీ.. అమ్మవారు తనను ఆశ్రయించిన భక్తులను కన్నతల్లిలా ఆదరించి, కాపాడుతుంది. ఉగ్ర స్వరూపిణి అయిన అమ్మవారి శక్తికి అక్కడ పెరిగే ఉష్ణోగ్రతను, ఆలయ ప్రాంగణంలోని కోనేరు చల్లబరుస్తుందని చెబుతారు.
ఆలంపూర్ పట్టణపు ఆగ్నేయ మూలన అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ క్షేత్రంలో అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమైన దర్శనమిస్తుంది. అమ్మవారి వెంట్రుకలు గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తాయి. ఆ కేశాల్లో.. బల్లి, తేలు, గుడ్లగూబ, కపాలం కనిపిస్తాయి. వీటిలో బల్లి శకునాలకు, తేలు న్యాయధర్మాలకు, గుడ్లగూబ(లక్ష్మీదేవి వాహనం) సంపదకు, కపాలం తాంత్రిక ఉపాసనకు ప్రతీకలు. దేశం నలుమూలల నుంచి అనేక మంత్రి తాంత్రికులు ఇక్కడ సాధనకోసం వస్తుంటారు.
సంవత్సరానికొకసారి అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది.. అప్పుడు భక్తులు వేల సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారు నిజరూపంలో వృద్ధురాలిగా కనిపిస్తుంది. జోగులాంబ దర్శనంతో నరఘోష(దిష్టి), వాస్తు దోషాలు, కీడు తొలగిపోతాయి. ఈ అమ్మవారిని గృహచండిగానూ పిలుస్తారు. అమ్మవారు ఉగ్రస్వరూపిణీ.. వసంత పంచమినాడు అమ్మవారిని సహస్త్ర ఘటాభిషేకం చేస్తారు.
క్రీ.శ 1390 ప్రాంతంలో ఈ ఆలయాన్ని బహమనీ సుల్తానులు ధ్వంసం చేయగా, జోగులాంబ, చండి,ముండి విగ్రహాలను అక్కడి నుంచి ముందే.. తొలగించి, అదే ప్రాంగణంలో ఉన్న బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో భద్రపర్చారు. నాటి నుంచి దాదాపు 615 ఏళ్ల పాటు అమ్మవారు అక్కడే ఉన్నారు. అప్పట్లో అమ్మవారిని కిటికీ గుండా భక్తులు దర్శించుకునేవారు. 2008లో అమ్మవారికి ప్రత్యేకంగా గుడి కట్టి అందులో ప్రతిష్టించాకే అమ్మవారి ఆలయానికి ఇంత పేరు వచ్చింది. ఆలంపూర్ క్షేత్రంలో జోగుళాంబ అమ్మవారి గుడితో పాటు 9 శివాలయాలున్నాయి.
సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి మనదేశంలో ఉన్న రెండు మూడు ఆలయాల్లో ఒకటి ఆలంపూర్‌లోనే ఉంది. ఇక్కడే బ్రహ్మదేవుడు.. పరమశివుని గురించి తపస్సు చేసినట్లు స్థలపురాణాన్ని బట్టి తెలుస్తుంది. ఇక్కడ బ్రహ్మదేవుడు.. బాల బ్రహ్మేశ్వర, విశ్వబ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్థ బ్రహ్మ, తారక బ్రహ్మ, గరుడ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, వీర బ్రహ్మ అనే 9 రూపాల్లో దర్శనమిస్తాడు. శాసనాల ప్రకారం.. ఈ దేవాలయాలను క్రీ.శ 702 కాలంలో బాదామి చాళుక్యులు నిర్మించినట్లు తెలుస్తోంది.
ఈ బ్రహ్మదేవుడి ఆలయాలకు సమీపంలోనే 9 వ శతాబ్దానికి చెందిన సూర్యనారాయణస్వామి దేవాలయం, విజయనగర రాజు అయిన కృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన ఒక నరసింహస్వామి దేవాలయం కూడా కలదు. అలంపూర్ సమీపంలోని పాపనాశేశ్వర దేవాలయం ప్రధానమైనది. కర్నూల్ నుండి 27 కి.మీ దూరంలో ఉన్న క్షేత్రానికి వెళ్లేవారి కోసం హైదరాబాద్, కర్నూలు, జడ్చర్ల, మహబూబ్ నగర్ తదితర అనేక పట్ణణాల నుంచి బస్సు వసతి ఉంది.