Astrology: హిందూ సాంప్రదాయంలో శుక్రవారానికి ప్రత్యేక స్థానం ఉంది. మహాలక్ష్మీ దేవిని పూజించడానికి ప్రత్యేకమైన రోజుగా శుక్రవారాన్ని పరిగణిస్తారు. శాస్త్రం ప్రకారం శుక్రవారం రోజు కొన్ని పనులు అసలు చేయకూడదట. అలా చేయడం దురదృష్టానికి సంకేతంగా బావిస్తారు. అయితే శుక్రవారం ఏ పనులు చేయకూడదో అలాగే ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి పరుగెత్తుకుని వస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం.
శుక్రవారం అమ్మవారిని పూజించడం హిందువులు ఆచారంగా బావిస్తారు. మరీ ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రత్యేకమైన రోజంటు ఒకటుందంటే అది శుక్రవారమే. అలాంటి శుక్రవారం రోజు కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా లక్ష్మీదేవిని ఇంట్లోకి స్వాగతించొచ్చట. అలాగే కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీ దేవి రావడం అటుంచితే జేష్టాదేవి (దరిద్ర దేవత) మీ ఇంట్లో తిష్ట వేస్తుందట.
శుక్రవారం చేయకూడని పనులు:
శుక్రవారం ఎప్పుడూ ఇంట్లో ఉప్పు అయిపోయింది. పసుపు అయిపోయింది అనే మాటలు మాట్లాడకూడదట. వాటిని కొనాలి లేదా తీసుకురావాలి అని మాత్రమే చెప్పాలట. అలాగే ఉప్పు, పసుపు పూర్తిగా అయిపోయేంత వరకు ఉపయోగించకూడదట. అవి రెండు అయిపోయేలోపే ఇంటికి తెచ్చుకోవాలట. అలాగే ఇంట్లో అన్నం వండేందుకు ముందు బియ్యాన్ని కొలుస్తాం కదా ఆ కొలిచే పాత్రను ఎప్పటికీ బోర్లించకూడదట. ఇంట్లో సుఖ సంతోషాలు, సిరిసంపదలు వెల్లి విరియాలంటే.. విడిచిన బట్టలను తలుపులకు వేలాడదీయకూడదు. అలాగే ఒకసారి వేసుకుని విడిచిన బట్టలను రెండో రోజు లేదా మూడో రోజు లేదా కంటిన్యూగా కొన్ని రోజులు అస్సలు ధరించకూడదు. ప్రత్యేకించి శుక్రవారం నాడు విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్ర్యం చుట్టుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు.
శుక్రవారం చేయాల్సిన పనులు:
శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి, రంగ వల్లికలతో అలంకరించి.. దీపారాధన చేయాలి. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా..? ఆ ఇల్లు సిరి సంపదలతో తుల తూగాలన్నా ఎప్పుడూ ఆ ఇంట్లో మహాలక్ష్మీదేవిని ఉపాసన చేయాలి. అలాగే శుక్రవారం పూట సాత్త్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వీలైతే ఉపవాసం ఉండటం చాలా మంచిదట. అలా ఉండలేకపోతే ఆరోజు పాలను సేవించాలట. రోజూ లేదా శుక్రవారం రాత్రిపూట కొద్దిపాటి అన్నాన్ని ఓ చిన్నపాటి గిన్నెలో వుంచి వంటింట్లో వుంచడం సంప్రదాయం. ఇలా చేస్తే పితృదేవతలు, దేవతలు ఆ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉడుగాక అని దీవిస్తారట.
ఆచారం ప్రకారం కట్టు, బొట్టు ఉండాలి:
శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బొట్టు ధరించాలి. అయితే చాలా మంది స్టిక్కర్లు ధరిస్తుంటారు. దాని వల్ల ఉపయోగం లేకపోగా అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఒక ప్రత్యేకమైన బొట్టు ధరించడం వల్ల కూడా లక్ష్మీదేవి కరుణిస్తుందట. అందుకోసం తెల్ల వక్కలను, నేతిలో వేయించి చూర్ణం చేసి ఆ మిశ్రమానికి కస్తూరి పొడి, కుంకుమ పువ్వు కలిపి చూర్ణం చేసుకుంటే అది ఒక ప్రత్యేకమైన కుంకుమగా తయారవుతుంది. ఈ కుంకమను ధరించడం వల్ల సుగంధ భరితమైన సువాసనతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుందట. అలాగే ధనవృద్ధి కూడా కలుగుతుందట.
ఇక శుక్రవారం పూట తెల్లని వస్త్రాలను ధరించడం ఓ నియమం. తెల్లని వస్త్రాలంటే శుక్రునికి, మహాలక్ష్మీకి ప్రీతికరం. తెల్లని దుస్తులను శుక్రవారం ధరిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇంకా శుక్రవారం పూట కమలములతో, కలువలతో లక్ష్మీదేవికి అర్చన చేసినట్లైతే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా పుష్పాలను దానం చేసినా, అన్నదానం చేసినా, వస్త్ర దానం చేసినా శుభ ఫలితాలుంటాయి. కస్తూరిని మిత్రత్వం కోరి స్నేహితులకు అందించినా, శుక్రవారం వర్జ్యం వున్న సమయంలో మౌనవ్రతం పాటించినా ఆ ఇంట తప్పకుండా ధన సమృద్ధి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం
ALSO READ: నాగసాధువులు, అఘోరీలుఒక్కటి కాదా? కళ్ళుబైర్లుకమ్మేనిజాలు