ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీ నుంచి అరెస్ట్ లు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ సంఘటనలను వైసీపీ రెడ్ బుక్ రాజ్యాంగం అంటోంది. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేకదా అని కూటమి అంటోంది. మధ్యలో కాంగ్రెస్ కూడా కూటమి స్టాండ్ తీసుకోవడం ఇక్కడ విశేషం. తాజాగా రాజధాని అమరావతిపై జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో కాంగ్రెస్ కూడా వైసీపీని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసింది. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల.. సాక్షి మీడియాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో వైసీపీ నుంచి కూడా కౌంటర్లు మొదలయ్యాయి. మాజీ మంత్రి రోజా, షర్మిలను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఈ వ్యవహారంలో షర్మిల జోక్యం చేసుకోవడం.. జగన్, భారతిపై విమర్శలు చేయడం సిగ్గు చేటు అని అన్నారు రోజా.
అన్నీ మరచిపోయారా..?
గతంలో టీడీపీ నేతలు షర్మిలను టార్గెట్ చేసి అసభ్యకరంగా ట్రోల్ చేశారని గుర్తు చేశారు రోజా. అప్పట్లో బాలకృష్ణ ఇంటి నుంచే ఈ వ్యవహారం అంతా జరిగిందన్నారు. ఐటీడీపీ కార్యకర్తలు షర్మిలపై తప్పుడు ప్రచారం చేశారని, అవమానకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారని అన్నారు. అప్పట్లో షర్మిల ఏడుస్తూ కంప్లయింట్ చేసిందని, ఆ విషయం ఆమె మరచిపోవడం సిగ్గు చేటని అన్నారు రోజా. అప్పట్లో ఆమెపై టీడీపీ చేసిన ట్రోలింగ్ ని మరచిపోయి, ఇప్పుడు అదే పార్టీకి ఆమె సపోర్ట్ చేస్తూ మాట్లాడటం సరికాదని హితవు చెప్పారు రోజా. షర్మిల, టీడీపీకి మద్దతివ్వడం చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారని అన్నారామె. కాంగ్రెస్ నేతగా షర్మిల ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది పోయి, ప్రభుత్వానికి వంత పాడటం వింతగా ఉందన్నారు రోజా. టీడీపీతో కుమ్మక్కై, తప్పు లేకపోయినా సాక్షిపై నిందలు వేయడం సరికాదని షర్మిలకు హితవు పలికారు.
రక్తం మరిగిపోతోంది..
ప్రస్తుతం టీడీపీ నేతల వ్యవహారం చూస్తుంటే తన రక్తం మరిగిపోతోందని అన్నారు రోజా. చేయని తప్పుకి కొమ్మినేనిని అరెస్ట్ చేశారని అన్నారు. సాక్షి మీడియా ఆఫీస్ లపై దాడులు చేయడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాంటి చర్యలను ఖండించడం చేతగాని షర్మిల, రేణుకా చౌదరి.. జగన్, భారతి గురించి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. ఏపీలో ఆడపిల్లలకు భద్రత లేకుండా పోయిందని, ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. అలాంటి ఘటనలపై షర్మిల ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. ఒక మహిళ అయి ఉండి కూడా తోటి మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ఆమె ఎందుకు నిలదీయడం లేదన్నారు. మహిళలను గౌరవిస్తూ, ప్రతి మహిళలోనూ తన సోదరిని, తల్లిని చూసుకుంటున్న జగన్ ని, భారతిని అనడానికి మాత్రం వారంతా ఒంటికాలిపై వస్తున్నారని మండిపడ్డారు. సాక్షి మీడియా సంస్థలపై దాడులు చేస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, వీడియో సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు రోజా. గతంలో కూడా తమ పార్టీని ఇలాగే టార్గెట్ చేశారని, అధికారంలోకి వచ్చాక వారిని తాము పట్టించుకోలేదని, ఈసారి అలా ఉండదని, అధికారంలోకి వచ్చాక అందరి సంగతి తేలుస్తామని హెచ్చరించారు.