Big Stories

Bhishma Ekadashi2024 : అగణిత పుణ్యశీలి.. భీష్మ పితామహుడు..

Bheeshma Ekadasi Importance

Bheeshma Ekadasi Importance : మన పురాణాల్లో కనిపించే అనేక పాత్రల్లో భీష్మాచార్యుడిది ప్రత్యేక పాత్ర. వందలాది యోధులున్న మహాభారత కథలో ఎవరికీ అందని గౌరవాన్ని, ఎవరూ జయించలేని వీరుడిగా గుర్తింపుని దక్కించుకుని, కురుపాండవులందరి చేతా.. ’తాతా’ అని పిలిపించుకున్న ఏకైక వీరుడు భీష్మాచార్యుడు. నేడు భీష్మఏకాదశి. ఈ సందర్భంగా ఆ ధర్మనిరతుడి జీవిత విశేషాలను స్మరించుకుందాం.

- Advertisement -

త్రేతాయుగంలో తండ్రి దశరథుని మాట మేరకు శ్రీరాముడు సింహాసనాన్ని వదులుకుని వనవాసానికి వెళ్లి పితృవాక్య పరిపాలకుడు అనిపించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ద్వాపర యుగంలో రాముడి బాటలో నడిచిన వీరుడు భీష్మాచార్యుడు. శంతనుడు, గంగాదేవికి జన్మించిన ఈయన అసలు పేరు దేవవ్రతుడు. దేవవ్రతుడు జన్మించిన కాసేపటికే తల్లి గంగాదేవి ఇతడిని వదిలేసి వెళ్లిపోతుంది. తండ్రి శంతనుడే ఈ బాలుడిని పెంచి తన రాజ్యానికి వారసుడిగా ప్రకటిస్తాడు. పరశురాముడి వద్ద సకల విద్యలూ నేర్చుకున్న దేవవ్రతుడు మహా వీరుడిగా పేరుపొందుతాడు.

- Advertisement -

Read more: ఆదిత్యుని దివ్యక్షేత్రం.. అరసవెల్లి..

ఈ కాలంలోనే తండ్రి శంతనుడు దాసరాజు కుమారుడైన సత్యవతిని పెళ్లాడతాడు. వారికి సంతానమూ కలుగుతుంది. అయితే.. పెద్ద కుమారుడైన దేవవ్రతుడు రాజవుతాడనే భావన సవతి తల్లిలో నెలకొంటుంది. దీంతో యువకుడైన దేవవ్రతుడు.. తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని, సింహాసనం ఎక్కకుండా, కేవలం రాజ్య రక్షకుడిగానే ఉంటానని నిండు సభలో ప్రతిజ్ఞ చేస్తాడు. నాటి ఆయన భీషణమైన ఆ ప్రతిజ్ఞ మూలంగా ఆయనకు భీష్ముడనే పేరువచ్చింది. కుమారుడి త్యాగానికి మెచ్చిన తండ్రి.. ఇచ్ఛా మరణాన్ని (ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మాత్రమే మరణించే వరం) వరంగా భీష్ముడికి ప్రసాదిస్తాడు. నాటి నుంచి కురువంశపు పెద్దగా గౌరవాన్ని ఉంటూ రాజ్యరక్షణా భారాన్ని వహించాడు.

తన సవతి తల్లి సంతానమైన చిత్రాంగదుడు, విచిత్రవీర్యులకు తగిన కన్యల కోసం అన్వేషిస్తూ భీష్ముడు కాశీకి చేరతాడు. ఇంతలో చిత్రాంగదుడు అహంకారంతో గంధర్వులతో యుద్ధానికి దిగి కన్నుమూస్తాడు. కాశీరాజు తన కుమార్తెలను ఇచ్చేందుకు సిద్ధపడకపోవటంతో ఆ రాజును ఓడించి, ఆయన కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికను తీసుకొస్తాడు. కానీ, పెద్దదైన అంబ తాను వేరొకరిని ప్రేమించానని చెప్పగా ఆమెను వదిలేస్తాడు. అంబిక, అంబాలికలను విచిత్య వీర్యుడికి ఇచ్చి భీష్ముడు వివాహం జరిపిస్తాడు. వారికి కలిగిన సంతానమే ధృతరాష్ట్రుడు, పాండురాజు.

ఇక.. కాదని వెళ్లిన అంబ తిరిగి వస్తుంది. ఆమెను ప్రేమించిన రాజు యుద్ధంలో సర్వం కోల్పోవటంతో అంబ తిరిగి భీష్ముడికి వచ్చి తనను పెళ్లాడమని కోరగా, తన ప్రతిజ్ఞ కారణంగా తిరస్కరిస్తాడు. దీంతో ఆమె భీష్ముడి గురువైన పరశురాముడి పాదాల మీద పడగా, పరశురాముడు ఆమెను పెళ్లాడమని ఆదేశించగా.. భీష్ముడు కాదనగా, వారిద్దరికీ భీకర యుద్ధం జరుగుతుంది. అందులో గురువునే ఓడించగా, గురువు శిష్యుడి ప్రతాపానికి పొంగిపోతాడు. అయితే.. ఈ పరిణామానికి దిగులుపడిన అంబ శివుడి గురించి తపస్సు చేసి, తన జీవితాన్ని నాశనం చేసిన భీష్ముడిని చంపే వరం కోరగా, వచ్చే జన్మలో శిఖండిగా జన్మించినప్పుడు నీ కోరిక తీరుతుందని శివుడు వరమిస్తాడు.

పరశురాముడు కూడా తనకు సహాయం చేయలేకపోయినందుకు అంబ విచారించి శివుని గురించి తపస్సు చేస్తుంది. శివుడు ఆమె తపస్సుకు మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. ఆమె తన జీవితాన్ని నాశనం చేసిన భీష్ముని చావుని కోరుకుంటుంది. అది ఆమె ఆ జన్మలో ఉండగా జరగదని చెబుతాడు శివుడు. ఆమె తర్వాతి జన్మలో శిఖండిగా జన్మిస్తుంది.

కురు పాండవుల మధ్య వైరం వల్ల కురుక్షేత్ర యుద్ధం వస్తుంది. దీంతో భీష్ముడు తన మాట ప్రకారం నాటి రాజైన దృతరాష్ట్రుడి పక్షానే నిలుస్తాడు. భీష్ముని రథం మీది జెండాపై ఉండే తాటి చెట్టు. తన గుర్తు మాదిరిగానే నిటారుగా నిలబడి ఎవరూ ఎదురు నిలవలేని తీరున సర్వసేనానిగా నిలిచి 10 రోజులు యుద్ధం చేస్తాడు భీష్ముడు. యుద్ధ కాలంలోనూ సంధ్యా సమయంలో ఆగి అర్ఘ్యం ఇచ్చేవాడు. నీరు లేకపోతే ఇసుకతోనే అర్ఘ్యం ఇచ్చిన ధర్మనిరతుడు.

భీష్ముడు ఉన్నంత వరకు తామెవరమూ యుద్ధంలో రాణించలేమని పాండవులకు అర్థమవుతుంది. అయితే.. భీష్ముడు మహిళ మీద యుద్ధం చేయడని తెలిసిన శ్రీ కృష్ణుడి సలహా మేరకు ఈ క్షణం కోసమే ఎదురుచూస్తు్న్న శిఖండిని తెచ్చి అడ్డుపెట్టి అర్జునుడి చేత బాణాలు వేయించి గాయపరచి యుద్ధం నుంచి తప్పుకునేలా చేస్తారు పాండవులు. అలా 10 రోజులు వీరోచితంగా పోరాడిన ఆ మహావీరుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు అంపశయ్యను ఆశ్రయిస్తాడు.

Read more: ఒకే రాశిలో సూర్యుడు, శని గ్రహాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే!

ఎంతో ప్రతిభ, ధర్మనిష్ట కలిగిన భీష్ముడు కురుసభలో ద్రౌపదీ వస్త్రాపహరణం వంటి సందర్భాల్లో మౌనంగా ఉన్నందుకు, కృష్ణుడు సైతం తన ముందు యుద్ధంలో నిలవలేడనే రవ్వంత అహంకారాన్ని పొందినందుకు ప్రాయశ్చిత్యం చేసుకునేందుకే అంపశయ్యపై పడుకున్నాడు. పైగా తనకు ‘స్వచ్ఛంద మరణం’ ఉన్నా.. తన పాపాన్ని నశింపజేసుకుని పరమాత్మలో లీనమయ్యేందుకే భీష్మాచార్యుడు 51 రాత్రులు అంపశయ్య మీద శయనించి ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘ శుద్ధ అష్టమి నాడు పరమాత్మలో లీనమై మోక్షసిద్ధిని అందుకున్నాడు. ఈ తిథికి తర్వాత వచ్చే ఏకాదశిని నాటి నుంచి భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాము.

ఆయన మరణించేందుకు ఒక రోజు ముందు.. కృష్ణుడు పాండవులతో కలిసి వెళ్లి.. ‘ నీ మనుమలకు ధర్మబోధ చేయి’ అని ప్రార్థించగా.. ‘పరంధామా.. నీవే ఆ పనిచేయవచ్చుగా’ అని భీష్ముడు అనగా ‘ధర్మాన్ని ఆచరించిన నీవే ఇందుకు అర్హుడివి’ అని బదులిస్తాడు కృష్ణుడు. ఆ సమయంలో భీష్ముడి నోట వెంట వచ్చిన విష్ణువు వెయ్యి నామాలనే మనం నేడు ‘విష్ణు సమస్రనామం’ గా పిలుస్తున్నాం. ఆ దివ్య ముహూర్తంలో ఆ పరమ భక్తుడైన భీష్మాచార్యుడి నోట వెంట జాలువారిన విష్ణు సహస్రనామం.. నేటికీ భక్తుల నాల్కల మీద ప్రవహిస్తూనే ఉంది. తరతరాల పాపాలను క్షయం చేస్తూనే ఉంది. కాలప్రమాణాలకు అందక నేటికీ వెలుగులు ప్రసరిస్తూనే ఉంది.

భీష్మఏకాదశినే భౌమి ఏకాదశి, జయ ఏకాదశి అనీ అంటారు. ఈరోజు కురుపితామహుని స్మరిస్తూ తర్పణ౦ ఇవ్వడ౦ స౦ప్రదాయ౦. శాస్త్రం ప్రకారం తండ్రి లేనివారే తర్పణాలు ఇవ్వాలి. కానీ.. ఈ రోజు భీష్మునికి ఎవరైనా తర్పణాలు ఇవ్వవచ్చు. అయితే.. తండ్రి ఉండగా తర్పణాలు ఇచ్చేవారు యజ్ఞోపవీతాన్ని అపసవ్యంగా వేసుకోకుండా కుడిచేతి బొటనవ్రేలికి చుట్టుకుని తర్పణాలు ఇవ్వాలి. ఈరోజు చేసే భీష్మ తర్పణం సకల పాపాలను నశింపజేయటమే గాక సంతానం లేని వారికి తప్పక సత్సంతానం కలిగేలా చేస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. నేడు విష్ణు సహస్రనామ పారాయణ చేసే వారికి అపారమైన పుణ్యం, విజయం సిద్ధిస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News