Minister Lokesh: అప్పుడప్పుడు ఏపీకి వచ్చే వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు నిత్యం జనం మధ్య ఉండే టీడీపీ వైపు ఒక వేలెత్తి చూపిస్తున్నారని మంత్రి లోకేశ్ అన్నారు. అయితే వైఎస్ జగన్ పై 4 వేళ్లు చూపుతున్నాయని మర్చిపోతున్నారన్నారు. తుపాను హెచ్చరికలు వచ్చినప్పటి నుంచి సాధారణ పరిస్థితి నెలకొనే వరకు సీఎం నుంచి ఎమ్మెల్యే వరకు.. చీఫ్ సెక్రటరీ నుంచి విలేజ్ సెక్రటరీ వరకు అంతా ప్రజల చెంతే ఉండి, ఆదుకున్నామన్నారు. ఇవన్నీ తెలియడానికి జగన్ ఏపీలో లేరన్నారు. ఆయనది వేరే భ్రమాలోకమని ఎద్దేవా చేశారు.
“నాకు మహిళలంటే గౌరవం, దేశమంటే భక్తి. అందుకే మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి ముంబై వెళ్లాను. కోట్లాది భారతీయులు తలెత్తుకునేలా మహిళా మణులు వరల్డ్ కప్ గెలిస్తే, నేనే గెలిచినంత ఆనందించాను. సొంత తల్లి, చెల్లిని తరిమేసిన జగన్ కు దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుందిలే” అని మంత్రి లోకేశ్ అన్నారు.
రైతుల పేరు మీద వైసీపీ నాటకాలు ఆపాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కడప జిల్లాలో ఏం జరుగుతోందో చూడని అవినాష్ రెడ్డికి ఇప్పుడు రైతుల కోసం ఆకస్మిక ప్రేమ ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఉల్లి రైతులు నష్టపోకూడదని సీఎం చంద్రబాబు ఆలోచించి హెక్టార్ కి 50,000 చొప్పున అందచేయాలని నిర్ణయించారన్నారు. 104 కోట్ల 57లక్షల రూపాయలు ఉల్లి రైతులకు లబ్ధి చేకూర్చనున్నామన్నారు. ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టినప్పుడు క్వింటాకు రూ.1200 వెచ్చించి మార్కెటింగ్, మార్క్-ఫెడ్ ద్వారా కర్నూలు మార్కెట్ నందు సుమారు 17 కోట్ల 22 లక్షల రూపాయల విలువ గల ఉల్లి పంటను కొనుగోలు చేసామన్నారు. పంట పాడవ్వకుండా రైతులకు మేలు చేశామన్నారు.
‘2020లో వైసీపీ హయాంలో ఉల్లి ధర పడిపోతే మద్దతు ధర 770 రూపాయలు ప్రకటించడం తప్ప చేసిందేమి లేదు. జగన్ ప్రభుత్వంలో మార్క్‌ఫెడ్ ద్వారా కేవలం 129 మంది రైతుల నుంచి 970 మెట్రిక్ టన్నుల ఉల్లిని మాత్రమే సేకరించి, రైతులకు కేవలం రూ.75 లక్షలు మాత్రమే చెల్లించిన విషయం అవినాష్ రెడ్డి గుర్తించుకోవాలి. గత ప్రభుత్వం క్వింటాకు ఉల్లి ధర రూ.770 నిర్ణయించినప్పటికీ, రైతుల శ్రేయస్సు కోసం సీఎం చంద్రబాబు నిర్ణయంతో క్వింటాకు రూ.1200 పెట్టి మార్కుఫెడ్ ద్వారా కొనుగోలు చేశాం. గత ఐదేళ్లు రైతుల సమస్యలు కనిపించలేదా? ఎన్నికలు వచ్చినప్పుడు, విపత్తులు సమయంలో మాత్రమే వైసీపీ నేతలు రైతులు గురించి మాట్లాడటం హాస్యాస్పదం, గత ఐదేళ్లు అవినాష్ రెడ్డి కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్నారా?’ – మంత్రి అచ్చెన్నాయుడు
నష్టపరిహారం ఫైళ్లు పెండింగులో పెట్టింది కూటమి ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వ గందరగోళ విధానాలే అని మంత్రి అచ్చెన్నాయుడ అన్నారు. రైతుల పేరు చెప్పుకుంటూ రాజకీయ లాభం చూడటం అవినాష్ రెడ్డి స్వభావం, సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది… రైతుల కోసం పని చేస్తోంది, రైతులకు అందచేస్తున్న పథకాలు, ధరలు తగ్గినపుడు ఇస్తున్న పరిహారాలు వైసీపీ నేతల కళ్లకు కనపడటం లేదా? అని ప్రశ్నించారు.