Say No to Drug: తెలుగు రాష్ట్రాల యువతను డ్రగ్స్ ఉచ్చు నుంచి తప్పించి.. క్రీడల వైపు ఆకర్షించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ నుంచి యువతను రక్షించేందుకు ‘తెలుగు ప్రీమియర్ లీగ్’ క్రికెట్ టోర్నమెంట్‌కు రంగం సిద్ధమైంది. ‘సే నో టు డ్రగ్స్’ (Say No to Drugs) నినాదంతో నిర్వహించనున్న ఈ మెగా ఈవెంట్ పోస్టర్‌ను క్రీడా శాఖా మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 600 క్రికెట్ టీమ్‌లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొననున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ.. ఈ టోర్నీ ముఖ్య ఉద్దేశం కేవలం క్రీడా పోటీలను నిర్వహించడం మాత్రమే కాదని.. యువత భవిష్యత్తును కాపాడటం అని చెప్పారు. ‘యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా, క్రీడల వైపు ఆకర్షితులయ్యేలా వారికి ఆశను చూపించాలి’ అని మంత్రి వ్యాఖ్యానించారు. దేశ భవిష్యత్తుకు వెన్నెముక వంటి యువశక్తి మాదక ద్రవ్యాల బారిన పడకుండా.. వారి శక్తిని నిర్మాణాత్మకమైన క్రీడా రంగంలో వినియోగించుకునేలా ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు.
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. క్రీడల్లో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ‘క్రీడల్లో ఉంటేనే ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవడుతుంది. ఆట అనేది కేవలం వినోదం కాదు. అది ఒక జీవన విధానం. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. లక్ష్యాలను నిర్దేశించుకోవడం, జట్టు స్ఫూర్తితో పనిచేయడం వంటి ముఖ్యమైన జీవిత పాఠాలను నేర్పుతుంది’ అని అన్నారు. ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రీడలు ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయని ఆయన తెలిపారు.
రూ.80 లక్షల భారీ ప్రైజ్ మనీ
ఈ టోర్నమెంట్ లో గెలిచిన టీంకు భారీ ప్రైజ్ మనీ కూడా దక్కించుకోవచ్చు. మొత్తం 80 లక్షల రూపాయల ప్రైజ్ మనీని ఈ టోర్నీ కోసం నిర్వాహకులు కేటాయించారు. ఇది తెలుగు రాష్ట్రాల్లోని ఔత్సాహిక క్రికెటర్లకు ఒక గొప్ప అవకాశం అని.. కేవలం డ్రగ్స్ వ్యతిరేక సందేశమే కాకుండా, క్రీడాకారులకు ఆర్థికంగా కూడా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ మొత్తాన్ని నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ టోర్నమెంట్ షెడ్యూల్ వేదికల గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. రెండు రాష్ట్రాల్లోని వివిధ పట్టణాలు, నగరాల నుండి సుమారు 600 టీమ్‌లు పోటీపడనున్న నేపథ్యంలో.. ఈ టోర్నీ తెలుగు క్రీడాభిమానుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని నింపనుంది.