Dhantrayodashi 2025: హిందూ సంస్కృతిలో దీపావళికి ముందు వచ్చే ధన త్రయోదశి (ధన్‌తేరాస్) పండుగకు అత్యంత విశేషమైన స్థానం ఉంది. ఇది సంపద, ఆరోగ్యం, శ్రేయస్సుకు సంబంధించిన పర్వదినం.
ధన త్రయోదశి పండగ దీపావళి వేడుకలకు నాంది పలుకుతుంది. ఇది హిందూ పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం త్రయోదశి తిథి నాడు ప్రారంభమవుతుంది. ‘ధన’ అంటే సంపద, ‘త్రయోదశి’ అంటే పదమూడవ రోజు. 2025 సంవత్సరంలో,, ధన త్రయోదశి అక్టోబర్ 18 శనివారం నాడు వస్తుంది. ఈ రోజు సాయంత్రం ప్రదోష కాలంలో లక్ష్మీ పూజ చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ తిథి ప్రారంభం నుంచే ప్రజలు దీపావళి వేడుకల కోసం ఇళ్లను శుభ్రం చేయడం, అందంగా అలంకరించడం ప్రారంభిస్తారు.
ధన త్రయోదశి ప్రాముఖ్యత:
ఈ పండుగకు ఉన్న ప్రాముఖ్యత అనేక పౌరాణిక కథలతో ముడిపడి ఉంది.
ధన్వంతరి ఆవిర్భావం: పురాణాల ప్రకారం.. పాల సముద్ర మథనం సమయంలో ధన త్రయోదశి రోజునే ధన్వంతరి దేవుడు అమృత కలశంతో ఉద్భవించాడు. ధన్వంతరిని దేవతల వైద్యుడిగా, ఆయుర్వేద దేవుడిగా కొలుస్తారు. అందుకే ఈ రోజున ధన్వంతరిని పూజించడం వలన మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు లభిస్తాయని నమ్ముతారు.
లక్ష్మీ, కుబేరుల పూజ: ఈ రోజు లక్ష్మీదేవి, సంపదకు అధిపతి అయిన కుబేరుడిని పూజిస్తారు. కొత్త వస్తువులు, ముఖ్యంగా బంగారం, వెండి, పాత్రలు కొనడం వలన ఆ ఇంట్లో సంపద పదమూడు రెట్లు పెరుగుతుందని, లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుందని విశ్వాసం.
యమ దీపం: అకాల మృత్యు భయం నుంచి రక్షణ పొందడానికి, ధన త్రయోదశి రోజున సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దక్షిణాభిముఖంగా ‘యమ దీపం’ వెలిగించే సంప్రదాయం కూడా ఉంది.
ధన త్రయోదశి నాడు ఉప్పు కొనడం ఎందుకు మంచిది ?
ధన త్రయోదశి రోజున బంగారం, వెండితో పాటు ఉప్పును కొనుగోలు చేయడం కూడా చాలా శుభప్రదం. దీని వెనక బలమైన ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి:
ప్రతికూల శక్తిని తొలగించడం (నెగటివిటీని దూరం చేయడం): ఉప్పుకు ప్రతికూల శక్తిని గ్రహించే శక్తి ఉంటుందని నమ్ముతారు. ధన త్రయోదశి రోజున కొత్త ఉప్పును ఇంటికి తీసుకురావడం ద్వారా.. ఆ సంవత్సరం ఇంట్లో పేరుకుపోయిన దురదృష్టం, ప్రతికూల శక్తులు తొలగిపోయి. అంతే కాకుండా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
Also Read: కార్తీక మాసంలో చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటి ?
శుద్ధి , శ్రేయస్సు: ఉప్పును శుద్ధికి చిహ్నంగా భావిస్తారు. ఈ రోజున ఉప్పు కొనడం అంటే.. ఇంట్లోకి ఐశ్వర్యాన్ని, సమృద్ధిని స్వాగతించడం అని అర్థం. కొందరు ఈ ఉప్పును దీపావళి వంటకాల్లో ఉపయోగించడం వల్ల అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉంటాయని విశ్వసిస్తారు.
రాహు దోష నివారణ: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఉప్పు రాహు దోషాన్ని తగ్గించడంలో సహాయ పడుతుంది. ఉప్పును కొని ఇంట్లో ఉంచుకోవడం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గి, శాంతి నెలకొంటుంది.
కాబట్టి.. ధన త్రయోదశి కేవలం సంపదను కొనుగోలు చేసే రోజు మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని, సానుకూలతను, శుద్ధిని ఆహ్వానించే ఒక పవిత్రమైన పండుగ.