Vizag News: విశాఖలో మరోసారి అక్రమ కార్యకలాపాలు బయటపడ్డాయి. లావిష్ బ్యూటీ సెంటర్ పేరుతో నడిపిస్తున్న సెంటర్ పై.. సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. శనివారం ఉదయం దాడులు నిర్వహించారు. మొదట సాధారణంగా సెలూన్ లా కనిపించిన.. ఆ కేంద్రంలో వాస్తవానికి వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో ముగ్గురు యువతులను రక్షించగా.. ఇద్దరు మహిళలతో పాటు నులుగురు నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న లావిష్ బ్యూటీ సెంటర్‌పై.. కొద్ది రోజులుగా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సెంటర్‌లో రాత్రి వేళల్లో కొందరు అనుమానాస్పదంగా తిరుగుతున్నారనే ఫిర్యాదులపై టాస్క్ ఫోర్స్ దృష్టి సారించింది. అధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, సెంటర్‌పై పహారా ఏర్పాటు చేశారు. ఈ సమాచారంతో శనివారం ఉదయం సడెన్‌గా దాడి చేయగా, లోపల ముగ్గురు యువతులు చిక్కుకున్నారు.
పోలీసులు రక్షించిన ముగ్గురు యువతులు ఏపీకి చెందినవారేనని, ఉద్యోగాల కోసం నగరానికి వచ్చి ఈ సెంటర్‌లో చిక్కుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వారికి ఎక్కువ జీతాలు ఆశచూపించి, బ్యూటీ పార్లర్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పి.. ఆ సెంటర్ కు తీసుకువచ్చినట్లు పోలీసులు వివరించారు. ప్రస్తుతం ఈ యువతులను మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్న రక్షణ కేంద్రానికి తరలించారు.
దాడుల సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు మహిళలతో పాటు.. మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫీల్డ్ ఏజెంట్ ద్వారానే కస్టమర్లకు సంప్రదింపులు జరుగుతున్నట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. ఈ గ్యాంగ్ వ్యభిచార కార్యకలాపాలకు సంబంధించి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను కూడా.. వాడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు ఇటీవల సోషల్ మీడియాలో, డేటింగ్ యాప్‌ల ద్వారా జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. లావిష్ బ్యూటీ సెంటర్ నిర్వాహకులు కూడా ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా కస్టమర్లను సంప్రదించేవారని, వాటి ఆధారంగా సాక్ష్యాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సెంటర్‌లో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, రిజిస్టర్‌లు, కస్టమర్ల డేటా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై సిటీ టాస్క్ ఫోర్స్ అధికారులు తీవ్రంగా స్పందించారు. బ్యూటీ పార్లర్లు, మసాజ్ సెంటర్లు పేరుతో నడుస్తున్న అక్రమ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: పశ్చిమ బెంగాల్‌లో మరో ఘోరం.. మెడికల్ విద్యార్థినిపై అత్యాచారం
పోలీసులు ప్రస్తుతం నగరంలోని మరో నాలుగు బ్యూటీ పార్లర్‌లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సంబంధిత యజమానుల రికార్డులు, లైసెన్స్ వివరాలు పరిశీలనలో ఉన్నాయి.