Food: ఉదయం నిద్రలేవగానే మనం తీసుకునే ఆహారం లేదా డ్రింక్స్ మన రోజు మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రాత్రంతా కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి.. ఉదయం పూట సరైన ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహార పదార్థాలను ఖాళీ కడుపుతో తీసుకుంటే.. అవి జీర్ణ వ్యవస్థను దెబ్బతీసి, అసిడిటీ, గ్యాస్, ఇతర అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇంతకీ పరగడుపున ఏ ఆహారాలను తినకూడదో , ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
1. టీ, కాఫీ :
చాలా మంది తమ రోజును టీ లేదా కాఫీతోనే ప్రారంభిస్తారు. కానీ ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిలో ఉండే కెఫీన్, ఇతర పదార్థాలు కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఉదయం లేవగానే ముందుగా ఒక గ్లాసు గోరు వెచ్చని నీళ్లు తాగడం ఉత్తమం.
2. సిట్రస్ పండ్లు, పుల్లని పండ్లు:
నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినా, వాటిలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో వీటిని తింటే లేదా జ్యూస్ రూపంలో తాగితే కడుపులో యాసిడ్ ఉత్పత్తి మరింత పెరిగి, గుండెల్లో మంట, గ్యాస్ట్రిక్ సమస్యలు, అల్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే, వీటిలో అధికంగా ఉండే ఫైబర్, ఫ్రక్టోజ్ ఖాళీ కడుపుపై ఒత్తిడిని పెంచుతాయి.
3. కారంగా ఉండే, వేయించిన ఆహారాలు :
ఉదయం పూట ఖాళీ కడుపుతో కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు (ఉదా: సమోసా, కచోరీ, వేయించిన చిరుతిళ్లు) తినడం అస్సలు మంచిది కాదు. ఇవి కడుపు పొరను చికాకు పెట్టి, యాసిడ్ రిఫ్లెక్స్, కడుపులో మంట, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తాయి.
4. కూల్ డ్రింక్స్ , డ్రింక్స్ :
ఖాళీ కడుపుతో కూల్ డ్రింక్స్ లేదా కార్బోనేటేడ్ పానీయాలు తాగితే.. వాటిలోని కార్బన్ డయాక్సైడ్ కారణంగా కడుపులో ఒత్తిడి పెరిగి గ్యాస్, ఉబ్బరం, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఇవి శ్లేష్మ పొరను కూడా దెబ్బతీసే అవకాశం ఉంది.
5. అరటిపండ్లు :
అరటిపండులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో అరటిపండు తింటే, రక్తంలో మెగ్నీషియం స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి, గుండెపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని కొందరు నిపుణులు చెబుతారు.
6. పెరుగు :
పెరుగు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ.. ఖాళీ కడుపుతో తింటే, దానిలోని లాక్టిక్ యాసిడ్ కారణంగా కడుపులోని ఆమ్లత్వం పెరిగి.. అందులోని మంచి బ్యాక్టీరియాకూడా నాశనం అవుతుంది.
7. పచ్చి కూరగాయలు :
పచ్చి కూరగాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఖాళీ కడుపుతో తింటే జీర్ణం కావడం కష్టమై, కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఖాళీ కడుపుతో ఆరోగ్యానికి మంచిది కదా అని పచ్చి కూరగాయలు తినడం మానండి.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఉదయం పూట ఖాళీ కడుపుతో కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. బదులుగా.. గోరు వెచ్చని నీళ్లు, నానబెట్టిన బాదం లేదా వోట్ మీల్, గుడ్లు, పుచ్చకాయ (కొన్ని రకాల పండ్లు తినవచ్చు) వంటి తేలిక పాటి, పోషకాలు సమృద్ధిగా ఉండే అల్పాహారాన్ని ఎంచుకోవడం మంచిది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా రోజంతా చురుకుగా ఉంచడానికి సహాయపడుతుంది. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.