Karthika Masam 2025: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా కార్తీక మాసాన్ని పరిగణిస్తారు. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన ఈ మాసం దీపావళి మరుసటి రోజున ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం అక్టోబర్ 22, బుధవారం నుంచి కార్తీక మాసం మొదలై నవంబర్ 20 వరకు కొనసాగుతుంది. ఈ నెల రోజులు భక్తులు పాటించే నియమాలలో దీపారాధన అత్యంత ముఖ్యమైనది. అంతే కాకుండా మహిమాన్వితమైనది. కార్తీక దీపపు వెలుగు కేవలం చీకటిని తొలగించడమే కాదు.. జీవితంలోని అష్టకష్టాలు తొలగించి, సకల శుభాలు కలుగజేస్తుందని ప్రగాఢ విశ్వాసం.
దీపారాధన ప్రాముఖ్యత:
పురాణాల ప్రకారం.. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. దీపజ్యోతిలో త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు) కొలువై ఉంటారని నమ్మకం. ‘దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపం జ్యోతిః జనార్దనః, దీపో మే హరతు పాపం సంధ్యా దీపం నమోస్తుతే’ అనే శ్లోకం దీపారాధన గొప్పతనాన్ని వివరిస్తుంది. అంధకారం దారిద్రానికి చిహ్నం కాగా.. కాంతి జ్ఞానానికి, లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతీక. అందుకే కార్తీక మాసంలో దీపారాధన ద్వారా శివకేశవుల అనుగ్రహాన్ని పొందవచ్చు.
ఎక్కడ, ఎలా దీపారాధన చేయాలి ?
కార్తీక మాసంలో ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో దీపారాధన చేయడం శుభప్రదం.
తులసి కోట వద్ద: ప్రతి హిందూ గృహంలో ఉండే తులసి కోట వద్ద దీపం వెలిగించడం చాలా ముఖ్యం. తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి.. ఇక్కడ దీపం పెట్టడం వలన లక్ష్మీ కటాక్షం, సౌభాగ్యం కలుగుతాయి.
శివాలయం/విష్ణు ఆలయం: ఆలయాల్లో, ముఖ్యంగా ప్రదోష కాలంలో (సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య) శివాలయంలో దీపం వెలిగించడం వలన జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
ఉసిరి చెట్టు కింద: కార్తీక ద్వాదశి రోజున ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం అపారమైన పుణ్యాన్ని ఇస్తుంది.
పవిత్ర నదుల్లో దీపదానం: కార్తీక పౌర్ణమి నాడు పుణ్య నదులలో (లేదా పారే నీటిలో) దీపాలను వదిలే సంప్రదాయం ఉంది. దీనినే ‘దీపదానం’ అంటారు.
దీపారాధనతో అష్టకష్టాల తొలగింపు:
కార్తీక మాసంలో భక్తితో దీపారాధన చేసిన వారికి శివకేశవులు ప్రసన్నులవుతారు. ఈ ఆరాధన ఫలితంగా ఆరోగ్యం, సంపద, సంతానం, విద్య, విజయం, సుఖం, ధైర్యం మరియు దీర్ఘాయువు వంటి శుభ ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా, అష్టకష్టాలుగా భావించే దారిద్ర్యం, అనారోగ్యం, రుణ బాధలు, శత్రు భయం వంటి ప్రతికూలతలు తొలగిపోయి. అంతే కాకుండా జీవితంలో వెలుగు నిండుతుందని విశ్వాసం. దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వాడడం, కనీసం రెండు వత్తులు వేయడం (శివకేశవులకు ప్రతీకగా) శ్రేయస్కరం.
కార్తీక దీపపు వెలుగు కేవలం బాహ్య ప్రపంచాన్ని మాత్రమే కాదు, మన మనసులోని అజ్ఞానాంధకారాన్ని కూడా తొలగిస్తుంది. కాబట్టి.. ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర మాసంలో నిష్టతో దీపారాధన చేసి, శివకేశవుల అనుగ్రహం పొంది, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుందాం.