Atla Taddi 2025: అట్లతద్ది అచ్చ తెలుగు ఆడపడుచుల పండుగ. పెళ్లైన వారు భర్త ఆయురారోగ్యాల కోసం, పెళ్లి కాని యువతులు మంచి జీవిత భాగస్వామి కోసం అట్లతద్ది నోము చేసుకుంటారు. అట్లతద్దె నాడు గౌరీ దేవిని, చంద్రుడిని పూజిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 9 గురువారం అట్లతద్ది పండుగ చేసుకోనున్నారు.
అట్లతద్ది నాడు మహిళలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. సాయంత్రం అట్లను ముత్తయిదువుకి ఇచ్చి, చంద్రుని చూశాక ఉపవాసం విరమిస్తారు. 11 అట్లు, బెల్లం ముక్క ముత్తైదువులకు వాయినం ఇస్తారు. అట్లతద్ది నాడు స్త్రీలు ఉయ్యాలలూగడం కూడా ఆనవాయితీ. ఈ నోములో ఓ రాకుమారి కథ చెప్తుంటారు.
‘ఒక ఊరిలో రాజు గారికి సుకుమారి అను పేరు గల ఎంతో అందమైన కుమార్తె ఉంది. ఆమెకు నలుగురు స్నేహితురాళ్లు ఉండేవారు. వారు వెలమ, బ్రాహ్మణుల, కోమట్ల, కాపు వారి అమ్మాయిలు. అట్లతద్ది నోము నోచుకుంటే అందగాడు, ఆరోగ్యవంతుడైన భర్త వస్తాడని రాకుమారి పెద్దలు చెప్తుండగా విన్నది. తన స్నేహితురాళ్లకు చెప్పి అట్లతద్ది నోము నోచింది.
అట్లతద్ది రోజున మంచి నీరు కూడా తాగకుండా ఉపవాసం చేసింది. అయితే సుకుమారి మూడు జాములు తర్వాత కళ్లు తిరిగి పడిపోయింది. ఆమె అన్నలు చెల్లెలు కళ్లు తిరిగి పడిపోవడానికి కారణం తెలుసుకున్నారు. చంద్రుడు వచ్చే వరకు తమ చెల్లెలు ఉపవాసంతో ఉండలేదని అనుకున్నారు. చెల్లిపై ప్రేమతో ఆరిక కుప్పకు నిప్పు పెట్టి ఆ మంటను చెల్లెలికి అద్దంలో చూపించారు. చంద్రుడు వచ్చాడని నమ్మించారు. చంద్రుడ్ని చూశానన్న భ్రమలో సుకుమారి భోజనం చేసింది. ఆమె స్నేహితురాళ్లు చంద్రుడిని చూశాకే ఉపవాసం విరమించారు.
కొంత కాలానికి రాకుమారికి పెళ్లి చేసేందుకు అన్నలు సంబంధాలు చూశారు. ఎంత వెదికినా ముసలి పెళ్లికొడుకులే దొరికేవారు. రాకుమారి స్నేహితురాళ్లకు పడుచు భర్తలు వచ్చారు. రాకుమార్తె అన్నలు చివరికి ఓ ముసలి వానికి తమ చెల్లెలను ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఆ విషయం తెలుసుకున్న సుకుమారి, అట్లతద్ది వ్రతం చేసుకున్న వారికి పడుచు భర్త వస్తాడని చెప్పారు. కానీ నాకు ఈ ముసలి భర్త దాపురించాడని, పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. అయితే అన్నలు బలవంతంగా చెల్లికి పెళ్లి జరించాలని నిర్ణయించారు.
దీంతో రాకుమారి ఒక రోజు రాత్రి ఊరి చివరలోని ఒక చెట్టు కింద తపస్సు చేసింది. అటుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరులు రాకుమార్తెను చూచి ఈ అడవిలో ఒంటరిగా తపస్సు చేస్తున్నావెందుకు అని ప్రశ్నించారు. అందుకు ఆమె మీరు ఆర్చేవారా? తీర్చేవారా? అని బదులిచ్చింది. ఓ అమాయకురాలా, మేము తీర్చేవారమే అంటూ తన కష్టం గురించి అడిగారు. రాకుమారి జరిగిన విషయం చెప్పింది.
Also Read : Karthika Masam 2025: కార్తీక మాసంలో.. తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఇవే !
అట్లతద్ది నోము నాడు అన్నలు చేసిన పని గురించి పార్వతీపరమేశ్వరులు రాకుమారికి చెప్పారు. నోము ఉల్లంఘన కారణం ఇదంతా జరిగిందని ఇంటికి వెళ్లి యథావిధిగా అట్లతద్ది నోచుకుంటే పడుచు భర్త వస్తాడని చెప్పి అదృశ్యమయ్యారు. దీంతో రాకుమారి ఇంటికి వెళ్లి జరిగిన సంగతిని అన్నలకు చెప్పింది. వారు చెల్లితో సక్రమంగా అట్లతద్ది నోము జరిపించారు. దాని ఫలితంగా ఆమెకు చక్కని భర్త వచ్చి సుఖంగా జీవించింది’
గమనిక : ఈ ఆర్టికల్ లోని సమాచారం కొందరు పండితులు, నిపుణుల అందించిన వివరాల మేరకు రాసినది. ఈ సమాచారం మతవిశ్వాసాలపై ఆధారపడింది. బిగ్ టీవీ దీనిని ధృవీకరించలేదు.