Tirumala Naivedyam: తిరుమల శ్రీవారికి నైవేద్యం ఎలా పెడతారో తెలుసా..? ఎన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తారో తెలుసా..? ఏ సమయంలో నైవేద్యాలు సమర్పిస్తారో తెలుసా..? అసలు నైవేద్యంలో ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయో తెలుసా..? తిరుమలలో శ్రీనివాసుడి నైవేద్యాలలో ఉన్న వైవిధ్యాల గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి గురించి ఎన్ని రకాలుగా చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తిరుమల స్వామి సన్నిధిలోని ప్రతి విషయంలో ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. బ్రహ్మోత్సవాల నుంచి స్వామి వారికి రోజూ సమర్పించే నైవేద్యంలోనూ కనీవినీ ఎరుగని రీతిలో ప్రత్యేకతలు ఉంటాయి. అలాగే స్వామి వారి దర్శానికి భక్తలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు. అయితే శ్రీవారికి సమర్పించే నైవేద్యాల గురించి అందులోని ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమలలో స్వామివారికి రోజు మూడు పూటల నైవేద్యాన్ని సమర్పిస్తారు. వాటినే బాలభోగం, రాజభోగం మరియు శయనభోగం అని పిలుస్తారు. ఈ మూడు నైవేద్యాలతో ఏఏ పదార్థాలు ఉంటాయో తెలుసుకుందాం.
తిరుమల స్వామి వారికి ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఆరున్నర గంటల సమయంలో సమర్పించే నైవేద్యాన్నే బాలభోగం అంటారు. ఈ బాలభోగం నైవేద్యంలో నేతి పొంగలి, చక్కర పొంగలి, రవ్వ కేసరి, పులిహోర, దద్దోజనం, మాత్రాన్నం వంటి పలు రకాల పదార్థాలను స్వామివారికి సమర్పిస్తారు.
బాల భోగం తర్వాత స్వామి వారికి సమర్పించే నైవేద్యాన్ని రాజభోగ నైవేద్యం అంటారు. ఈ నైవేద్యం స్వామి వారికి ఉదయం పది లేదా పదకొండు గంటల సమయంలో సమర్పిస్తారు. ఈ నైవేద్యంలో భాగంగా స్వామి వారికి పులిహోర, దద్దోజనం, తెల్ల అన్నం, చక్కర అన్నం, గుడాన్నాం సమర్పిస్తారు.
ఏడుకొండల వాడికి రోజులో చివరగా సమర్పించే నైవేద్యాన్నే శయన భోగ నైవేద్యం అంటారు. ఈ నైవేద్యాన్ని స్వామివారికి రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల మధ్య సమర్పిస్తారు. ఈ నైవేద్యంలో భాగంగా స్వామి వారికి మిర్యాల అన్నం, వడ, లడ్డు, శాకాన్నం ( శాకాన్నం అంటే వివిధ రకాల కూరగాయలతో వండిన అన్నం) లాంటి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
ఇలా స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నంతవరకు కూడా ఆలయంలో గంటలు మోగుతూ ఉంటాయి. స్వామి వారికి నైవేద్యం సమర్పించే సమయంలో గర్భగుడి తలుపులు మూసివేసి, గర్బగుడి లోపల నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే ఉంటాడు. ఇక అర్చకుడు పవిత్ర మంత్రాలూ ఉచ్చరిస్తూ కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకి దానిని స్వామి వారి కుడి చేతికి తాకించి స్వామి వారి నోటి దగ్గర తాకుతారు. ఇలా రోజు స్వామి వారికి నైవేద్యాన్ని సమర్పించిన తరువాత భక్తులకు దీనిని పంచుతారు.
పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.