Hyderabad News: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వేల గణపతి విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో గణపతి బప్పా మోరియా అంటూ నిమజ్జనం చేశారు. గణపతి నిమజ్జనాలను చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు వచ్చారు. డప్పుల సౌండ్ తో.. నృత్యాలతో.. నగరమంతా భక్తిరసంతో మునిగిపోయింది. అయితే మహిళలు భద్రత కోసం, ఎలాంటి అనైతిక చర్యలు జరగకుండా చూడాలని షీ టీమ్స్ హుస్సేన్ సాగర్, బాలాపూర్, ఇతర ముఖ్యమైన ప్రాంతాలకు ప్రవేశించాయి. తెలంగాణ మహిళా సురక్షిత వింగ్ కింద పనిచేసే షీ టీమ్స్ గణేష్ నిమజ్జన ఉత్సవం సమయంలో నగరంలో మొత్తం 1612 మంది నేరస్థులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మహిళలకు పోకిరిల నుంచి ఎలాంటి అసౌకర్యం కలగకుండా షీ టీమ్స్ ఎంతో తోడ్పడ్డాయి.
గణేష్ ఉత్సవాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి షీ టీమ్స్ గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రాంతాలు, ఖైరతాబాద్ బడా గణేష్, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసులు యాక్టివ్ గా ఉన్నారు. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని తక్షణమే పట్టుకుని, చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ 1612 మందిలో 68 మంది నేరస్థులు 18 ఏళ్ల లోపు బాలురు ఉన్నారని అధికారులు తెలిపారు. 1544 మంది 18 ఏళ్ల వయస్సు పై బడిన వారని వెల్లడించారు. 18 నుంచి 20 ఏళ్ల మధ్యలో 290 మంది నేరస్థులు ఉండగా.. 21 నుంచి 30 ఏళ్ల మధ్య వారు 646 మంది నేరస్థులు, 31 నుంచి 40 ఏళ్ల మధ్య వారు 397 మంది నేరస్థులు, 41 నుంచి 50 మధ్య వారు 166 మంది నేరస్థులు, 50 ఏళ్ల పైబడిన వారు 45 మంది నేరస్థులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ నేరస్థులలో చాలామంది మహిళలను హింసాత్మకంగా, అసభ్యంగా ప్రవర్తించారని.. వెంటనే వారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు.
ఏ వయస్సు వారు ఎంత మంది..?
18-20 సంవత్సరాల వయస్సు వారు 290 మంది
21-30 సంవత్సరాల వయస్సు వారు 646 మంది
31-40 సంవత్సరాల వయస్సు వారు 397 మంది
41-50 సంవత్సరాల వయస్సు వారు 166 మంది
50 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు వారు 45 మంది..
ALSO READ: Group-D Job: గ్రూప్-డీ ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయ్.. ఇలా చదివితే ఉద్యోగం మీదే, ఇంకెందుకు ఆలస్యం
చట్టాని అనుసరించి మొత్తం 168 మందిపై కేసులు నమోదు చేసి నాంపల్లి కోర్టుకు 70 మందిని హాజరు పరిచారు. వీరిలో 10 మందికి రూ.50 జరిమానా, 59 మందికి రూ.1,050 చొప్పున జరిమానా విధించారు. ఒకరికి రెండు రోజుల జైలు శిక్షలు విధించారు. మిగిలిన 98 మంది కేసులు కోర్టు పరిశీలనకు ఉన్నాయని అధికారులు తెలిపారు. మిగిలిన 1,444 మందికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి తాత్కాలికంగా విడుదల చేశారు, కానీ వారిని మళ్లీ కౌన్సెలింగ్‌కు పిలుస్తామని చెప్పారు. పిల్లలకు ప్రత్యేకంగా అవగాహన సెషన్లు నిర్వహించి, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. 1,444 మంది నేరస్తులు, వారి తల్లిదండ్రులతో కలిసి, ప్రొఫెషనల్ సైకియాట్రిస్టులు, కౌన్సెలర్ల సహాయంతో కౌన్సెలింగ్ చేయించారు. ఇది కేవలం శిక్ష మాత్రమే కాదని.. ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి చేసిన పని అని అధికారులు వెల్లడించారు.
షీ టీమ్స్ ఈ ఉత్సవంలో మహిళలకు ధైర్యాన్ని, సమాజానికి సందేశాన్ని ఇచ్చాయి. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లావణ్య మాట్లాడుతూ.. నేరస్థులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. పిల్లలకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చినట్టు తెలిపారు. ఇక సోషల్ మీడియాలో మోసాలు గురించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఎవరైనా పోకిరీలు మహిళలను వేధిస్తే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. సహాయం కోసం డయల్ 100 లేదా వాట్సాప్ 9490616555కు సంప్రదించాలని కోరారు.