Ekadashi August 2025: ఏకాదశిని హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇది ప్రతి చంద్రమాసంలో రెండు సార్లు వచ్చే పవిత్రమైన రోజు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు, విష్ణుమూర్తిని ఆరాధిస్తారు, లక్ష్మీదేవిని పూజించి ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి కోసం ప్రార్థిస్తారు. ఉపవాసంతో కూడిన ఈ ఆధ్యాత్మిక పరంపర వందల ఏళ్లుగా కొనసాగుతోంది.
ఏకాదశి అంటే పదకొండవ తిథి. ప్రతి మాసంలో శుక్లపక్షంలో ఒకసారి, కృష్ణపక్షంలో ఒకసారి కలిపి రెండు సార్లు వస్తుంది. భక్తులు ఈ రోజున పిండపదార్థాలు, ధాన్యాలను మానేసి పాలు, పండ్లు మాత్రమే తీసుకుంటారు. ఏకాదశి ఉపవాసం మూడు రోజుల వ్యవధిలో నడుస్తుంది. ఉపవాసానికి ముందు రోజు (దశమి) ఒకే ఒక సాంప్రదాయ భోజనం తీసుకొని, ఏకాదశి రోజున ఉపవాసాన్ని పాటించి, ద్వాదశి రోజున సూర్యోదయానంతరం ఉపవాసాన్ని విరమిస్తారు.
ఆగస్టు 5 పుత్రదా ఏకాదశి వ్రతం
ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఏకాదశి ‘పుత్రదా ఏకాదశి’. ఇది శ్రావణ మాస శుక్లపక్షంలో వస్తుంది. ఈ సంవత్సరం, పుత్రదా ఏకాదశి వ్రతం ఆగస్టు 5వ తేదీన జరుగుతుంది. ఏకాదశి తిథి ఆగస్టు 4వ తేదీ మధ్యాహ్నం 11:41కి మొదలై, ఆగస్టు 5వ తేదీ మధ్యాహ్నం 1:12కి ముగుస్తుంది. ఈ రోజు సంతాన సంకల్పంతో ఉన్న దంపతులు ఉపవాసం ఉంటారు. ఈ ఏకాదశికి ‘పుత్ర ప్రాప్తి’ అనుగ్రహం కలుగుతుందనే విశ్వాసం ఉంది. ఈ రోజు రవి యోగం మరియు భద్ర వాస యోగం కలిసి వస్తుండటంతో ఇది మరింత పవిత్రతను సంతరించుకుంది. లక్ష్మీనారాయణుని పూజించడం వల్ల సంతానభాగ్యం తో పాటు, కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.
ఆగస్టు 19న అజా ఏకాదశి..
ఆగస్టు రెండో ఏకాదశి ‘అజా ఏకాదశి’. దీనిని ‘అన్నదా ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. ఇది భాద్రపద మాసం కృష్ణపక్షంలో వస్తుంది. ఈ ఏకాదశి ఈ సంవత్సరం ఆగస్టు 19వ తేదీన జరుపుకుంటారు. తిథి ఆగస్టు 18వ తేదీ సాయంత్రం 5:22కి మొదలై, ఆగస్టు 19వ తేదీ మధ్యాహ్నం 3:32కి ముగుస్తుంది. అజా ఏకాదశి ఉపవాసం ఆచరించడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగుతాయని పురాణ గాధలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రత కథను వివరించినట్లు పద్మ పురాణంలో చెప్పబడింది.
ఈ రోజున ఉపవాసం ఉండటం, విష్ణువు పేరు స్మరణ చేయడం, భగవతీ కథలు వినటం వల్ల ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యమవుతుంది. మనస్సు శాంతితో నిండుతుంది. భక్తులు ఈ రోజున పుణ్య నదుల్లో స్నానం చేసి, పూజలు నిర్వహిస్తారు. శ్రద్ధా భక్తులతో ఉపవాసం చేసిన వారు వారి జీవితం లో పవిత్రతను, ఆరోగ్యాన్ని, శ్రేయస్సును సాధిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రెండు ఏకాదశులు పుత్రదా, అజా భక్తులకు గొప్ప అవకాశాలు కలిగించే పవిత్ర దినాలు. ఈరోజుల్లో ఉపవాసంతో పాటు దానం, జపం, ధ్యానం చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ధర్మ మార్గంలో సాగడానికి ఈరోజులు మార్గదర్శకాలు కావడమే కాదు, మనలో ఆధ్యాత్మిక వికాసానికి బలమైన ప్రేరణ కూడా అవుతాయి.