Philippines: ఫిలిప్పీన్స్‌లో కల్మెగి తుఫాను బీభత్సం సృష్టించింది. సెబు, ఈస్టర్న్ సమర్, సదరన్ లేయ్టే, బోహూల్, సగే, గుయిమరస్, పలవాన్ ప్రాంతాలపై ఈ తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. సుమారు 40 మందికి పైగా చనిపోయినట్లు అధికారులు తెలిపారు. సెబు ప్రావిన్స్‌లో ప్రభావం అధికంగా ఉందన్నారు. భారీ వరదల కారణంగా జనం ఇళ్లపైకి చేరి.. రక్షించాలంటూ అధికారులను వేడుకుంటున్నారు.
ఇళ్ల పైకి చేరి రక్షించాలంటూ వేడుకుంటున్న జనం..
వరదల కారణంగా రోడ్లపైకి చెత్తాచెదారం భారీగా చేరడంతో ముందుకు కదలడానికి వీల్లేని పరిస్థితులున్నాయని అధికారులు అంటున్నారు. వరద ఉధృతి తగ్గేదాకా రెస్క్యూ ఆపరేషన్లు అసాధ్యమంటున్నారు. వరద నీళ్లలో కార్లు, కంటైనర్లు తేలియాడుతున్నాయి. భారీ ఈదురు గాలులతో వందలాదిగా ఇళ్లపై కప్పులు లేచిపోయాయని స్థానికులు తెలిపారు. మరోవైపు.. సహాయక చర్యల కోసం వెళ్లిన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది చనిపోయినట్లు తెలిపారు.
Also Read: నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు
186 డొమెస్టిక్ విమాన సర్వీసులను రద్దు చేసిన అధికారులు..
కల్మెగి నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సుమారు 4 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సముద్రంలో అలలు భారీగా ఎగిసిపడుతుండడంతో.. బోట్లు, ఫెర్రీలను నిలిపివేసింది. దీంతో.. ఐల్యాండ్స్ మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో 3 వేల 500 మంది ప్రయాణికులు పోర్టుల్లో ఎక్కడివారు అక్కడే నిలిచిపోయారు. దాదాపు 186 డొమెస్టిక్ విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు.