జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా జనసేన నేతలు ప్రచారానికి ముందుకొచ్చారు. దీనివల్ల బీజేపీకి లాభం ఉంటుందా లేదా అనే విషయం పక్కనపెడితే ప్రచారానికి జనం పెరిగారని మాత్రం సంతోషించవచ్చు. అయితే ఇక్కడ టీడీపీ మద్దతు మాత్రం వారికి కీలకం. కానీ టీడీపీ నేరుగా స్పందించలేదు, పోటీకి దూరం అన్నారే కానీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతిస్తున్నట్టు కానీ, పోనీ ఇవ్వనట్టుకానీ చెప్పడం లేదు. ఈ మౌనం పరోక్షంగా కాంగ్రెస్ కి లాభం చేకూర్చే అవకాశముంది. మరి చివరి నిమిషంలో చంద్రబాబు నుంచి ఏదైనా ప్రకటన ఉంటుందేమో చూడాలి. ఒకవేళ టీడీపీ నేరుగా బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చినా కూడా ఆ పార్టీ గెలుస్తుందని అనుకోలేం. పరోక్షంగా అది బీఆర్ఎస్ కి మేలు చేకూర్చే నిర్ణయం అవుతుంది. అందుకే ఈ ఎన్నికలపై టీడీపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది.
టీడీపీ ఓటుబ్యాంక్..
2014 బీఆర్ఎస్ హవాలో కూడా జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ సైకిల్ గుర్తుపై గెలిచారంటే దాని అర్థం ఆ నియోజకవర్గంలో టీడీపీ కేడర్ బలంగా ఉందని. అయితే గోపీ వెంటనే సైకిల్ దిగి కారెక్కడంతో అక్కడ నాయకుడితోపాటు అనుచరులు, కార్యకర్తలు కూడా అనివార్యంగా బీఆర్ఎస్ లో చేరాల్సి వచ్చింది. ఇక 2018 ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ టికెట్ పైనే గెలిచారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ లో చేరిన టీడీపీ కేడరే ఆయనకు అండగా నిలబడింది. ఒక్కమాటలో చెప్పాలంటే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కి పట్టులేదు, అక్కడ మాగంటి గోపీనాథ్ అనే నాయకుడికి సపోర్ట్ గా ఉన్న టీడీపీ కేడర్.. ఆయనతో కలసి జర్నీ చేశారు కాబట్టి 2018, 2023 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలవగలిగింది. ఇప్పుడు గోపీనాథ్ లేరు, ఆయన అనుచరులకు, ఆయనతోపాటు బీఆర్ఎస్ లో చేరిన టీడీపీ కార్యకర్తలకు దిక్కెవరు. గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత తమకి అండగా నిలబడతారని వారు బలంగా నమ్మగలరా? ఈ క్రమంలో వారికి కాంగ్రెస్ ఆల్టర్నేట్ కావడం విశేషం.
సీఎం రేవంత్ రెడ్డి కీలకం..
ఇక్కడ టీడీపీ కేడర్ అంతా అన్యమనస్కంగానే బీఆర్ఎస్ తో కలసి వెళ్తున్నారు. కానీ ఇప్పుడు వారికి సీఎం రేవంత్ రెడ్డి రూపంలో కీలక ప్రత్యామ్నాయం దొరికింది. టీడీపీని అభిమానించే చాలామంది రేవంత్ రెడ్డిని అభిమానిస్తారు. ఆ అభిమానంతోనే వారంతా కాంగ్రెస్ వెంట నడిచే అవకాశం ఉంది. పైగా నవీన్ యాదవ్ కి అన్ని పార్టీల్లోనూ మద్దతుదారులు ఉన్నారు. దానికితోడు ఆయన సొంతగా తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ నాయకుడిగా ఎదిగారు. దీంతో అక్కడ కాంగ్రెస్ గెలుపు ఖాయమనిపించేలా ఉంది.
Also Read: మీడియాపై చిందులు తొక్కిన శ్యామల
మాగంటి ఉన్నంత వరకే..
మాగంటి గోపీనాథ్ ఉన్నంత వరకు ఆయన వర్గం బీఆర్ఎస్ లో ఉంది, ఆయన లేకపోవడంతో వారంతా బీఆర్ఎస్ ని శత్రువులానే చూస్తున్నారు. అవసరం ఉంటే తెలంగాణ వాదం, అవకాశం కోసం సెటిలర్లను మచ్చిక చేసుకోవడం బీఆర్ఎస్ కి వెన్నతో పెట్టిన విద్య. కానీ ఈసారి అది ఫలించేలా లేదు. జూబ్లీహిల్స్ లో ఉన్న టీడీపీ మద్దతుదారులంతా ఈసారి బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పనిచేయబోతున్నట్టు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా సైలెంట్ గా ఉన్నారు కాబట్టి.. పక్కాగా వారు కాంగ్రెస్ కి మద్దతిస్తారని అంటున్నారు. అదే జరిగితే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుని నిలబెట్టుకోవడం కష్టం.
Also Read: మంత్రి లోకేష్ సరికొత్త రికార్డ్.. 4వేలమందితో ప్రజా దర్బార్