Bengaluru Ganesha Temple: బెంగళూరులో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికైనా, సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడిన వారికైనా ఒక దేవాలయం అంటే అమితమైన నమ్మకం. అదే జయనగర్‌లోని “శ్రీ వినాయక దేవాలయం”. దీనినే స్థానికులు “కెరీర్ గణేశుడి” ఆలయంగా పిలుచుకుంటారు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనా.. ప్రమోషన్ రాకపోయినా.. లేదా వీసా ఇబ్బందులు ఉన్నా.. ఈ గణపయ్యను దర్శించుకుంటే పనులు చక్కబడతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయం విశిష్టత, భక్తుల నమ్మకాల గురించి పూర్తి వివరాలను గురించి తెలుసుకుందాం.
ఆలయ నేపథ్యం, ప్రత్యేకత:
బెంగళూరులోని జయనగర్ 4వ బ్లాక్‌లో ఉన్న ఈ ఆలయం చాలా ప్రశాంతంగా.. ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. ఇక్కడ కొలువైన వినాయకుడు అత్యంత శక్తివంతుడని, భక్తుల కోర్కెలను వెంటనే తీరుస్తాడని ప్రతీతి. ముఖ్యంగా యువత, ఐటీ ఉద్యోగులు ఈ ఆలయానికి పోటెత్తుతుంటారు.
“ఉద్యోగ గణపతి”గా ఎందుకు పేరు వచ్చింది ?
ఈ వినాయకుడికి “కార్యసిద్ధి గణపతి” తరహాలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కెరీర్ పరంగా ఇబ్బందులు పడేవారు ఇక్కడకు వచ్చి మొక్కుకుంటే ఫలితం ఉంటుందని నమ్ముతారు.
ఉద్యోగం: కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారు ఇంటర్వ్యూలకు వెళ్లే ముందు ఇక్కడ పూజలు చేయించుకుంటారు.
పదోన్నతులు: ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ప్రమోషన్లు లేదా జీతం పెరుగుదల, ఆగిపోయిన వారు ఇక్కడ స్వామికి ప్రదక్షిణలు చేస్తారు.
వీసా సమస్యలు: విదేశాలకు వెళ్లాలనుకునే వారికి వీసా ఇంటర్వ్యూలలో ఆటంకాలు ఎదురైతే.. ఈ గణపతిని దర్శించుకున్నాక పనులు సాఫీగా సాగుతాయని భక్తులు చెబుతుంటారు.
ఇక్కడ చేయాల్సిన ముఖ్యమైన పూజలు:
ఈ ఆలయంలో భక్తులు తమ కోర్కెలు తీరడానికి కొన్ని ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తారు.
సంకల్ప పూజ: తమ కోరికను మనసులో తలచుకుని స్వామికి అర్చన చేయించడం.
బెల్లం నైవేద్యం: వినాయకుడికి ప్రీతిపాత్రమైన బెల్లం లేదా మోదకాలను సమర్పించడం.
ప్రదక్షిణలు: సమస్య తీవ్రతను బట్టి.. భక్తులు 11, 21 లేదా 108 ప్రదక్షిణలు చేస్తుంటారు.
భక్తుల అనుభవాలు:
ఈ ఆలయానికి వచ్చే వారిలో ఎక్కువ మంది విద్యావంతులే ఉంటారు. చాలా మంది ఐటీ నిపుణులు తాము నిరుద్యోగులుగా ఉన్నప్పుడు ఇక్కడకు వచ్చి మొక్కుకున్నామని, ఆ తర్వాత అనతి కాలంలోనే పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు వచ్చాయని సాక్ష్యాలు చెబుతుంటారు. మరి కొందరు తమకు అమెరికా, యూరప్ వంటి దేశాలకు వెళ్లే అవకాశం ఈ స్వామి కృప వల్లే కలిగిందని నమ్ముతారు.
ఆలయ దర్శన సమయం:
ఉదయం: 6:30 నుంచి 11:30 వరకు
సాయంత్రం: 5:30 నుంచి రాత్రి 8:30 వరకుజజ పండుగ రోజుల్లో, సంకటహర చతుర్థి రోజుల్లో సమయాలు మారుతుంటాయి.