Samantha: హీరోయిన్ సమంత తాజాగా లింగ భైరవి దేవిని పూజిస్తూ.. అమ్మవారిపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. కష్ట సమయాల్లో తనకు దేవి అనుగ్రహం ఎంతగానో సహాయపడిందని ఆమె తరచుగా చెప్తూనే ఉంటారు. ఈషా పౌండేషన్‌కు వెళ్లినప్పుడల్లా అక్కడ ఉన్న లింగ భైరవి దేవికి సమంత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇంతకీ ఈ లింగ భైరవి అమ్మవారు ఎవరు ? ఈ దేవత ఎంత శక్తిమంతురాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లింగ భైరవి దేవి:
లింగ భైరవి దేవి అనేది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఉన్న ఈషా యోగా సెంటర్‌లో ప్రతిష్టించిన శక్తివంతమైన దివ్య స్త్రీ రూపం.
ప్రతిష్ఠ: ఈ దేవతను ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అయిన సద్గురు జగ్గీ వాసుదేవ్ ‘ప్రాణ ప్రతిష్ఠ’ అనే ప్రత్యేకమైన, అరుదైన ప్రక్రియ ద్వారా ప్రతిష్ఠించారు. ఈ ప్రక్రియలో.. కేవలం రాయిని ఉపయోగించకుండా, జీవ శక్తిని ఉపయోగించి విగ్రహాన్ని శక్తిమంతం చేస్తారు.
అద్వితీయ రూపం: సాధారణంగా దేవతలను విగ్రహ రూపంలో ప్రతిష్ఠిస్తారు. అయితే.. లింగ భైరవి దేవిని లింగ రూపంలో ప్రతిష్ఠించారు. స్త్రీ శక్తిని లింగ రూపంలో ప్రతిష్ఠించడం అనేది చాలా అరుదైన విషయం. ఈ రూపం సృష్టి యొక్క గర్భాన్ని, సృజనాత్మక శక్తిని సూచిస్తుంది.
స్త్రీ శక్తికి పరాకాష్ట: భైరవి దేవిని పరమ స్త్రీత్వం యొక్క అంతిమ వ్యక్తీకరణగా పరిగణిస్తారు. ఆమె సృష్టి, పోషణ, సంపద, మోక్షం – అనే అన్ని అంశాలను కలిగి ఉన్న మాతృ దేవత యొక్క శక్తివంతమైన రూపం.
Also Read: కార్తీక మాసంలో.. నదీ స్నానం చేయడం వెనక ఆంతర్యం ఏమిటి ?
దేవత యొక్క ప్రాముఖ్యత:
భైరవి దేవిని ఆరాధించడం వల్ల భక్తులకు లభించే ప్రధాన ప్రయోజనాలు..
ఐశ్వర్యం, శ్రేయస్సు: భైరవి దేవిని భౌతిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును అందించే దేవతగా నమ్ముతారు. ఆమె అనుగ్రహం లభించిన వారికి పేదరికం, వైఫల్యం లేదా భయం ఉండవని భక్తులు విశ్వసిస్తారు.
ఆరోగ్యం, దీర్ఘాయుష్షు: భైరవి దేవిని ఆరాధించడం వలన ఆరోగ్య సమస్యలు తొలగిపోయి, శక్తి, దీర్ఘాయుష్షు లభిస్తుందని నమ్ముతారు. కష్ట సమయాల్లో, అనారోగ్యం సమయంలో ఆమెను ఆశ్రయించడం వల్ల ఉపశమనం దొరుకుతుందని భక్తులు భావిస్తారు.
ముక్తికి మార్గం: భౌతిక ప్రపంచంలో శ్రేయస్సును అందించడమే కాక, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అంతే కాకుండా మోక్షానికి మార్గాన్ని సుగమం చేయడానికి కూడా భైరవి దేవి సహాయపడుతుందని నమ్ముతారు.
శక్తివంతమైన క్షేత్రం: భైరవి దేవి ఆలయ రూపకల్పన కూడా స్త్రీ గర్భాన్ని సూచిస్తూ.. శక్తివంతమైన, పోషణనిచ్చే శక్తి క్షేత్రాన్ని సృష్టిస్తుంది.
మరింత సమాచారం:
పూజ: లింగ భైరవి దేవిని భక్తులు ఇంట్లో లేదా ఆఫీసుల్లో ఉంచుకోవచ్చు. ఇలా అమ్మవారి ఫొటో లేదా విగ్రహం ఫెట్టుకున్నప్పుడు రోజుకు కనీసం ఒకసారి దీపం వెలిగించి స్తుతి జపించాలి.
లాకెట్ : లింగ భైరవి లాకెట్లును ధరించడం వల్ల శక్తి పొందవచ్చని నమ్ముతారు.
శక్తి: దేవిని రక్షణ, శక్తి కోసం పూజిస్తారు. శరీరం, మనస్సు స్థిరీకరణ అమ్మవారి పూజ వల్ల జరుగుతుంది.