Diwali 2025: దీపావళి పండుగ ధనం, సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని పూజించే పర్వదినం. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి తమ ఇంట్లోకి అడుగుపెడితే.. సంవత్సరం పొడవునా ధనంతో, సుఖసంతోషాలతో నిండి ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే.. లక్ష్మీదేవి తమ ఇంటికి రాబోతున్నదనే విషయాన్ని ముందుగానే కొన్ని శుభ సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చని జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శుభ సంకేతాలు:
గుడ్లగూబ దర్శనం: గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు. దీపావళికి ముందు లేదా దీపావళి రోజున గుడ్ల గూబ కనిపించడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ఆర్థిక సమస్యలు త్వరలో తొలగిపోయి, సంపద, వైభవం లభిస్తాయని సూచిస్తుంది. గుడ్లగూబ మీ ఇంటిపై కూర్చుని కనిపిస్తే.. మీకు శుభ ఫలితాలు కలగడం ఖాయంగా చెప్పవచ్చు.
నల్ల చీమలు గుంపు: మీ ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు గుంపులుగా ఏర్పడి ఆహారాన్ని ఒకే చోట తింటుంటే.. అది లక్ష్మీదేవి రాకకు సంకేతంగా భావిస్తారు. ఈ సంఘటన కూడా రాబోయే ఆర్థిక లాభాన్ని, శ్రేయస్సును సూచిస్తుంది.
పక్షి గూడు: ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం కూడా లక్ష్మీదేవి ఆగమనానికి సూచనగా.. శుభసూచకంగా భావిస్తారు. ఇది కూడా సానుకూలతను, అదృష్టాన్ని తెస్తుంది.
అరచేతిలో దురద: జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం.. పురుషులకు కుడిచేతిలో.. స్త్రీలకు ఎడమచేతిలో నిరంతరం దురద మొదలైతే.. త్వరలో ఊహించని ధనలాభం కలుగుతుందని నమ్ముతారు. ఇది సంపద వృద్ధికి సంకేతం.
తామర పువ్వు దర్శనం: లక్ష్మీదేవి తామర పువ్వుపై ఆసీనురాలై ఉంటుంది. దీపావళికి ముందు తామర పువ్వును చూడటం మీ సంపద పెరుగుదలను, బ్యాంకు బ్యాలెన్స్ పెరగడాన్ని సూచిస్తుంది.
శంఖం శబ్దం: ఉదయం నిద్ర లేవగానే శంఖం శబ్దం వినబడితే.. అది కూడా శుభ సంకేతంగా, లక్ష్మీదేవి అనుగ్రహానికి సూచనగా పరిగణిస్తారు.
కుక్క నోటిలో రొట్టె ముక్క: ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు, కుక్క నోటిలో రొట్టె లేదా ఏదైనా శాఖాహారం ఆహారం తీసుకురావడం కనిపిస్తే.. అది కూడా ధన లాభం పొందే అవకాశం ఉందనే శుభ సంకేతం.
ఈ సంకేతాలు కనిపించినప్పుడు.. మీ ఇంటిని శుభ్రంగా, పవిత్రంగా ఉంచుకుని, భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఆమె అనుగ్రహాన్ని, సిరిసంపదలను పొందవచ్చని నమ్మకం. ఇంట్లో సంతోషకరమైన, ప్రశాంతమైన వాతావరణం ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట తప్పక కొలువై ఉంటుంది.