Sravana Masam 2025: శ్రావణ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి. శివుడికి, పార్వతీదేవికి, విష్ణువుకి, లక్ష్మీదేవికి ఈ మాసం చాలా ప్రీతికరమైంది. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు విశేష ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా పెళ్లికాని యువతులు మంచి భర్త కోసం, వివాహిత స్త్రీలు తమ కుటుంబ సౌభాగ్యం కోసం, పిల్లలు లేనివారు సంతానం కోసం, ఐశ్వర్యం కోరుకునేవారు ధన వృద్ధి కోసం శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
శ్రావణ సోమవారాలు- శివపూజ:
శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ఇంట్లో కూడా శివలింగాన్ని లేదా శివుడి ఫోటోను పూజించవచ్చు.
పూజా విధానం: ఉదయాన్నే స్నానం చేసి శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, విభూదితో అభిషేకం చేయాలి. బిల్వ పత్రాలు, జిల్లేడు పూలు, మారేడు దళాలు, అక్షింతలు, తెల్లటి పువ్వులతో శివుడిని అలంకరించాలి. శివనామాలను, శివ స్తోత్రాలను పఠించాలి. ధూపం, దీపం వెలిగించి నైవేద్యం సమర్పించాలి.
ఫలితాలు: శ్రావణ సోమవారం పూజలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరతాయి. ఆరోగ్యం, సంపద, సంతోషం లభిస్తాయి. అంతే కాకుండా అవివాహిత యువతులకు మంచి భర్త లభిస్తాడని ప్రతీతి.
శ్రావణ మంగళవారాలు – మంగళ గౌరీ వ్రతం:
శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు మంగళ గౌరీ వ్రతానికి అంకితం చేయబడ్డాయి. ఈ వ్రతాన్ని వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం, సౌభాగ్యం కోసం నిర్వహిస్తారు.
పూజా విధానం: ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. గౌరీదేవి ప్రతిమను లేదా ఫోటోను ప్రతిష్ఠించి పూజించాలి. పసుపు గణపతిని పూజించి, నవగ్రహాలకు పూజలు చేయాలి. 16 దారపు పోగులతో 16 ముడులు వేసి, వాటికి 16 పసుపు కొమ్ములు కట్టి పూజించాలి. శనగపిండితో దీపాలు వెలిగించి.. 16 రకాల పిండి వంటలు, పూలతో గౌరీదేవిని పూజించాలి.
ఫలితాలు: మంగళ గౌరీ వ్రతం చేయడం వల్ల దీర్ఘ సుమంగళి యోగం, భర్తకు సంపూర్ణ ఆరోగ్యం, పిల్లలకు మేలు జరుగుతుందని నమ్మకం.
శ్రావణ శుక్రవారాలు – వరలక్ష్మీ వ్రతం:
శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ వ్రతాన్ని వివాహిత స్త్రీలు సిరి సంపదలు, సౌభాగ్యం, ఐశ్వర్యం కోసం ఆచరిస్తారు.
పూజా విధానం: ఉదయాన్నే శుచిగా స్నానం చేసి ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోను అలంకరించి, పువ్వులు, పండ్లతో పూజించాలి. అష్టలక్ష్మి అష్టోత్తర శతనామావళిని, లక్ష్మీ స్తోత్రాలను పఠించాలి. రకరకాల నైవేద్యాలు సమర్పించాలి.
ఫలితాలు: వరలక్ష్మీ వ్రతం ఆచరించడం వల్ల ధన ధాన్య వృద్ధి, అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. కుటుంబంలో సుఖ శాంతులు వెల్లివిరుస్తాయి.
Also Read: అయస్కాంతంలా డబ్బును ఆకర్షించే మొక్కలు ఇవే !
శ్రావణ పూర్ణిమ – రాఖీ పౌర్ణమి / జంధ్యాల పౌర్ణమి:
శ్రావణ మాసం చివరి రోజున వచ్చే పూర్ణిమకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున రక్షా బంధన్ (రాఖీ పౌర్ణమి) పండుగను జరుపుకుంటారు. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య అనుబంధానికి ప్రతీక ఈ పండుగ. ఇదే రోజున బ్రాహ్మణులు జంధ్యాలు మార్చుకుంటారు.