Heavy Rain: తెలంగాణలో గత మూడు, నాలుగు రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు రోజుల పాటు భారీ వర్షం కురిసింది. బేగంపేట, ఉప్పల్, సికింద్రాబాద్ పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీ వరదలు కూడా వచ్చాయి. అయితే.. అంతకు ముందు రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు మాత్రమే కురిశాయి. ఈ ఏడాది ఎండా కాలంలో వరుణుడు తన ప్రతాపం చూపించాడు. కానీ జూన్ నెలలో అడపదడపా వర్షాలు మాత్రమే నమోదయ్యాయి. మళ్లీ జులై మొదటి వారంలో మూడు, నాలుగు రోజులు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడగా.. గత మూడు, నాలుగు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఈసారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయని రైతులు కాస్త ముందస్తుగానే వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. జూన్ నెలలో వర్షాలు తక్కువ పడడంతో రైతులకు కాస్త ఆందోళనకు గురయ్యారు.
వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ..
గత నెల రోజుల నుంచి రాష్ట్రం వర్షాలు లేకపోవడంతో.. రైతులు కొంత నిరాశ చెందారు.. ఎప్పుడెప్పుడు వర్షాలు పడుతాయా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. గత మూడు రోజుల నుంచి హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నిన్న వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఉదయం నుంచి వర్షం పడుతోంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాట్లు వేసుకుంటూ రైతులు బిజీ అయిపోయారు.
ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరోసారి అలర్ట్ చేసింది. రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఈ రోజు నుంచి రేపు ఉదయం 8:30 గంటల వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వివరించింది. ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
పిడుగులు పడే అవకాశం.. జాగ్రత్త..!!
రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యంత భారీ వర్షాలు పడే జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని చెప్పారు. పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున చెట్ల కింద నిలబడొద్దని పేర్కొన్నారు. రైతులు సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని చెప్పారు.
ALSO READ: BHEL Recruitment: 65,000 జీతంతో బెల్‌లో ఉద్యోగాలు.. చివరి తేది ఎప్పుడంటే?
ALSO READ: Roja: గాల్లో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువయ్యారు.. రోజా సంచలన వ్యాఖ్యలు..