ప్రతి ఒక్కరూ కెరీర్ లో ముందుకు సాగాలని భావిస్తారు. అందుకోసం తమ వంతు కష్టపడతారు. పదోన్నతి కోసం, జీతం పెంపు కోసం ఎంతో కృషి చేస్తారు. కానీ ఆ కోరిక కొంత మందిలో నెరవేరదు. జ్యోతిష శాస్త్రం ప్రకారం వారు చేసే కొన్ని తప్పులు వారి పురోగతికి అడ్డంకులుగా మారుతాయి. వాస్తు శాస్త్రం కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఆఫీసుకు తీసుకెళ్లే బ్యాగులో మీ కెరీర్ ను ఆపగలిగే మూడు వస్తువులు ఉంటే వాటిని వెంటనే తీసి పడేయండి. బ్యాగు నుండి తీసి పడేయవలసిన వస్తువుల గురించి ఇక్కడ ఇచ్చాము.
వ్యక్తిగత పరిశుభ్రతా ఉత్పత్తులు
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీ ఆఫీస్ బ్యాగ్ లో ఎలాంటి వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులు ఉండకూడదు. కొంతమంది దువ్వెన, టూత్ బ్రష్ వంటి ఎన్నో వస్తువులు పెట్టుకుంటారు. ముఖాన్ని కడుక్కునే సబ్బు వంటివి కూడా పెట్టుకొని తీసుకెళ్తారు. ఇలాంటివి ఆఫీస్ బ్యాగులో ఉంటే అవి మీకు సమస్యలను సృష్టిస్తాయి. అటువంటి వాటి నుండి వెలువడే శక్తి నెగిటివ్ గా ఉంటుంది. ఇది మీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. తద్వారా మీ కెరీర్‌ను ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్తుంది.
నెయిల్ కట్టర్, చిన్న చాకు
చాలామంది నెయిల్ కట్టర్, పండ్లు కట్ చేసుకునేందుకు చిన్న చాకు వంటివన్నీ ఆఫీస్ బ్యాగ్ లో పెట్టుకుంటారు. వాస్తు నియమాల కోణం నుంచి చూస్తే ఇలా వాటిని బ్యాగులో మోయడం మంచిది కాదు. ఇవి ప్రతికూల పరిస్థితులను సృష్టిస్తాయి. అలాగే అనుబంధాలు ముగిసిపోయేలా చేస్తాయి. మీకు ఆఫీసులో సహోద్యోగులతో వివాదాలు ఏర్పడే అవకాశాల్ని పెంచుతాయి. దీనివల్ల మీ ఇమేజ్ నెగిటివ్ గా మారిపోతుంది. కాబట్టి కెరీర్ పరంగా ఎలాంటి పురోగతి ఉండదు.
మాసిపోయిన బట్టలు
ఆఫీస్ బ్యాగ్ లో కొంతమంది మాసిపోయిన బట్టలు కూడా పట్టుకెళ్తూ ఉంటారు. ఆఫీసులో డ్రెస్ మార్చుకొని విప్పిన బట్టలను ఆఫీస్ బ్యాగులో పెడుతూ ఉంటారు. ఇలాంటి అలవాట్లు మీకు ఎంతో హాని కలిగిస్తాయి. ఇలాంటి మురికి బట్టలు ప్రతికూల శక్తిని విడుదల చేస్తాయి. దీనివల్ల మీలో చిరాకు, కోపం, అలసట వంటివన్నీ పెరిగిపోతాయి. ఆఫీసులో పనిచేయాలనిపించదు. దీనివల్ల మీ కెరీర్ ఎన్నో ఇబ్బందుల్లో పడుతుంది. కాబట్టి ఇలాంటి పనులను వెంటనే మానేయండి.
ఆఫీస్ బ్యాగ్ లో కేవలం మీ ఉన్నతకి, మీ ఉద్యోగానికి పనికొచ్చే వస్తువులను మాత్రమే పెట్టుకోండి. అంటే పుస్తకం, పెన్ను, దేవుడి ఫోటోలాంటివి పెట్టుకోవచ్చు. కానీ పైన చెప్పిన వస్తువులను మాత్రం తీసుకెళ్లకండి. ఇది మీకు ఎంతో నెగిటివ్ ఎనర్జీని అందిస్తాయి. దీనివల్ల మీరు ముందుకు సాగలేరు.