
Bali Padyami : దీపావళి పండుగ మరునాడు.. అంటే కార్తీక మాసంలోని తొలిరోజు వచ్చే పండుగే బలి పాడ్యమి. ఈ రోజున రాక్షసరాజు, మరణాన్ని జయించి చిరంజీవిగా నిలిచిన బలి చక్రవర్తిని పూజించటం సంప్రదాయం. మిగిలిన ప్రాంతాల కంటే ఈ పండుగ కేరళలో అత్యంత వేడుకగా జరుగుతుంది.
పురాణకథనాల ప్రకారం, ప్రహ్లాదుని మనుమడే బలి చక్రవర్తి. (ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుడి కుమారుడు). పరమ విష్ణుభక్తుడైన తాత ప్రహ్లాదుని ఒడిలో ఆటపాటలతో అతని బాల్యం గడవటంతో బలి చక్రవర్తికీ విష్ణుభక్తి అబ్బింది. రాక్షసులకు రాజైన కారణంగా వారినీ పాలిస్తూ ఉండేవాడు.
ఈయన మహాదాత. అత్యంత జనరంజకంగా పాలన చేసేవాడు. ఈయన కాలంలో జనం సుఖసంతోషాలతో జీవించటంతో ‘నేను గొప్ప రాజును’ అనే అహంకారం అతని మనసును ఆవరించింది. దీంతో ఒక మహాయాగం చేసి ఏకంగా ఇంద్రపదవిని చేపట్టాని భావించాడు.
ఈ యాగానికి ముల్లోకాలవారినీ ఆహ్వానించి, దానాలు చేసి సంతృప్తి పరుస్తాడు. అయితే.. ఇతని గర్వభంగం చేసేందుకు శ్రీ మహావిష్ణువు ఏడేళ్ల బ్రాహ్మణ బాలుడిగా, గుండు, చిన్న గొడుగు, కమండలం తీసుకుని ఆ యాగస్థలికి వస్తాడు.
ఆ బాలుడిని చూసిన బలి చక్రవర్తి.. అందరిలాగే ఇతనికీ దానం ఇస్తానని అంటాడు.
అయితే.. రాక్షసుల రాజైన శుక్రాచార్యుడు వచ్చినది శ్రీ మహావిష్ణువనీ, అతను రాక్షసులకు శత్రువనీ, కనుక ఈ బాలుడికి దానం ఇవ్వటం అంటే చావును కోరితెచ్చుకోవటమే అని తన శిష్యుడైన బలి చక్రవర్తిని హెచ్చరిస్తాడు. అయితే.. దానికి బలి జవాబిస్తూ.. ‘ మీరన్నది నిజమే అయితే.. అంతకంటే అదృష్టమేమున్నది గురుదేవా..! అందరికీ అన్నీ ఇచ్చే విష్ణువే.. నా వద్దకు వచ్చి నన్ను దానం అడగటం, అతనికి దానం చేయటం నాకెంత అదృష్టం’ అని జవాబిస్తాడు.
వద్దని గురువు పదేపదే చెప్పినా వినకుండా.. వామనుడిని ఏం కావాలో కోరుకోమని బలి అడుగుతాడు. ‘ అయితే.. మూడు అడుగులు నేల ఇప్పించండి’ అంటాడు వామనుడు. ‘సరే.. తీసుకో’ అంటూ వామనుడి చేయి మీద చేయి పెట్టి.. జలం సాక్షిగా మూడడుగుల నేలను ధారపోస్తాడు.
వెంటనే.. మూడు అడుగుల ఆ బాలుడు.. ఆకాశమంత పెరిగిపోతాడు. ఆ త్రివిక్రముడు ఒక పాదం భూమ్మీద, మరో పాదం ఆకాశం మీద నిలిపి.. ‘రెండు అడుగులు పూర్తయ్యాయి. మరి.. మూడో అడుగు ఎక్కడ పెట్టాలి?’ అనగా.. బలి చక్రవర్తి మోకాళ్లమీద కూర్చొని నమస్కరించి.. ‘స్వామీ నా తలపై పెట్టు’ అని అనగా.. వామనుడి రూపంలో ఉన్న విష్ణువు బలి తలపై పాదం మోపి అతడిని పాతాళానికి అణగదొక్కుతాడు.
అయితే బలి చక్రవర్తి పాలనాపరంగా పుణ్యాత్ముడు కావడంతో అతనినే పాతాళ చక్రవర్తిగా నియమించి, ఏదైనా వరం కోరుకోమని బలిని అడుగుతాడు. అప్పుడు బలిచక్రవర్తి ‘ నాకోసం ఏమీ వద్దు గానీ.. మానవుల కోసం నీ మూడు అడుగులకు గుర్తుగా.. ఏటా మూడు రోజులు ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక పాడ్యమి నాడు భూలోకానికి నేను రాజుగా ఉండేలా అనుగ్రహించు. ఆ మూడురోజుల్లో ఎవరు దీపాలను వెలిగించి, దానం చేస్తారో వారికి సంపదను అనుగ్రహించు’ అని కోరగా, దానికి విష్ణువు సరేనన్నాడు.
అలా.. తాను పాలించిన భూమిని చూసేందుకు ఈ మూడు రోజులు సాయంకాలం వేళ..బలి చక్రవర్తి, విష్ణువుతో కలసి కలసి వస్తాడట. అందుకే ఈ మూడు రోజులు ఆ వేళకి ఇంటిముందు శుభ్రం చేసి, ముగ్గులు వేసి, దీపాలు పెడతారు. ఈ వేడుక చూసి తన ప్రజలంతా సంతోషంగా ఉన్నారని సంతోషపడి తిరిగి బలి పాతాళానికి వెళ్లే ఈ రోజునే బలి పాడ్యమి పేరుతో జరుపుకుంటున్నాం.