Chevella Road Accident: తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కర్నూలు, చేవెళ్లలో బస్సు ప్రమాదాల్లో 38 మంది మృతి చెందారు. తాజాగా చేవెళ్ల బీజాపూర్-హైదరాబాద్ జాతీయ రహదారిలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొయినాబాద్ మండల పరిధిలోని తాజ్ సర్కిల్ వద్ద హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న కారు మర్రి చెట్టును ఢీకొట్టింది. రోడ్డు ఇరుకుగా ఉన్న మార్గంలో వేగంగా వచ్చిన కారు మర్రిచెట్టును ఢీకొట్టింది. కారులోని ప్రయాణిస్తున్న ఐదుగురిలో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో-కారు ఢీ కొనడంతో నలుగురు తెలంగాణ వాసులు దుర్మరణం చెందారు. మృతులు నవీన్ (40), రాచప్ప (45), నాగరాజు (26), కాశీనాథ్ (60)గా గుర్తించారు. గణగాపూర్ నుంచి కారులో వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాదాన్ని చూసిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన రేకిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం నివారణ చర్యలపై దృష్టి పెట్టింది. రోడ్డు ప్రమాదాలపై అవగాహన ర్యాలీలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీఏ అధికారులను ఆదేశించారు. ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో యూనిసెఫ్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన చర్యలు, అవగాహన అంశాలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వచ్చే నెలలో నిర్వహించే రోడ్ సేఫ్టీ మాసంలో భాగంగా ప్రజలకు రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాల తీరును ఈ సమావేశంలో మంత్రి ప్రస్తావించారు. రోడ్డు ప్రమాదాలు, మరణాలు సంభవించకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకునేందుకు గ్రామాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించాలని, కరపత్రాలు పంచాలని సూచించారు. రోడ్డు భద్రతపై విద్యాసంస్థల్లో వ్యాస రచన పోటీలు నిర్వహించాలన్నారు.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.1. 50 లక్షలు వరకు అందిస్తూ, ఉచిత చికిత్స అందించే పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.