BigTV English
Advertisement

Devprayaga : సకల దేవతా నిలయం.. దేవ ప్రయాగ..!

Devprayaga : సకల దేవతా నిలయం.. దేవ ప్రయాగ..!
Importance of Deva Prayaga

Importance of Deva Prayaga : హిందువులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా చూడాల్సిన పుణ్యక్షేత్రాల్లో దేవ ప్రయాగ ఒకటి. దేవప్రయాగ అంటే దేవతలంతా కలిసే ప్రదేశమనీ, సకల దేవతాస్థానమనే అర్థాలున్నాయి. దేవశర్మ అనే పండితులు తపమాచరించటం వల్ల కూడా దీనికి దేవప్రయాగ అనే పేరొచ్చిందనే కథనమూ ఉంది. హిమాలయ సానువుల్లోని దేవప్రయాగ సముద్రమట్టానికి 2723 అడుగుల ఎత్తులో ఉంది. రుషికేశ్ నుంచి 80 కి.మీ, రుద్రప్రయాగ నుంచి 40 కి.మీ దూరంలో దేవప్రయాగ ఉంది.


ఈ క్షేత్రంలోనే వేర్వేరు దిశల నుంచి వచ్చిన మందాకిని, అలకనందా నదులు సంగమించి, గంగానదిగా మారతాయి. ఇక్కడ సరస్వతీ నది కూడా అంతర్వాహినిగా ఉంటుందనీ, కనుక ఇది త్రివేణీ సంగమం అంతటి పవిత్ర స్థలమని భక్తుల విశ్వాసం.

కేదార్‌నాథ్ నుంచి బదరీనాథ్ వెళ్లే మార్గంలో ఉండే ఈ దివ్యక్షేత్రం ఉత్తరాఖండ్‌లోని టేహ్రీగర్వాల్ జిల్లాలో ఉంది. మోక్ష సిద్ధినిచ్చేదిగా చెప్పే ఈ క్షేత్రం ప్రస్తావన విష్ణుపురాణంలోనూ ఉంది. త్రేతాయుగంలో దశరథుడు ఇక్కడ తపస్సు చేసినట్లు స్థల పురాణం చెబుతోంది. శ్రీమహా విష్ణువు కొలువైన 108 విశిష్ట వైష్ణవ క్షేత్రాల్లో దేవ ప్రయాగ కూడా ఉంది. ఇక్కడ 4 నెలల పాటు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రం జపిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని శివుడు నారదుడితో చెప్పినట్టు స్కంధ పురాణం చెబుతోంది.


దేవప్రయాగలో గిద్దాంచల్, దశరథాంచల్, నృసింహాంచల్‌ అనే 3 పర్వతాలున్నాయి. వీటిలో గిద్దాంచల్ పర్వతంపై రాతితో నిర్మించిన విశాలమైన పురాతన రఘునాథ మందిరంలో శ్రీరామచంద్రుడు నిలబడినట్లుగా, ఆయన పాదాలచెంత హనుమ దర్శనమిస్తారు. దేవప్రయాగలో ప్రధాన ఆలయం ఇదే. భాగీరథీ నదిమీది సన్నని వంతెన మీదగా భక్తులు ఈ గుడికి చేరాల్సి ఉంటుంది. రఘునాధుని ఆలయం పక్కనే సీతాదేవి, గరుత్మంతుడి గుళ్లు ఉంటాయి. ఆదిశంకరులచే ప్రతిష్ఠించబడిన ఈ కోవెలను తర్వాతి కాలంలో పలువురు అభివృద్ధి చేశారు.

హిమాలయ పర్వతాల్లోని గంగోత్రి హిమానీనదం కరిగి భగీరథిగా మారగా, దానిని చేరేందుకు ఆర్తిగా పరుగులెత్తుకుంటూ వచ్చి అలకనందను చేరి గంగగా మారే అద్భుత దృశ్యాన్ని చూసి తీరాల్సిందే తప్ప దానిని మాటల్లో వర్ణించలేము. ఈ సంగమ స్థానంలోని ‘తొండేశ్వర మహదేవ్’ మందిరంలో లింగరూపంలోని పరమేశ్వరుడిని భక్తులు దర్శించుకుంటారు.

రఘునాథ మందిర ప్రాంగణంలోనే మరో చిన్న ఆదిశంకరుల ఆలయం ఉంది. 2013 నాటి వరదల్లో సర్వం నాశనమైనా ఆ ఆలయం మాత్రం కొంచెం కూడా దెబ్బతినకుండా నిలవటం విశేషం. ఇవిగాక.. దేవప్రయాగకు వచ్చే భక్తులు రఘునాథ మందిరాన్ని దర్శించుకున్న తర్వాత ధనేశ్వర మహదేవ మందిరం, భువనేశ్వరీదేవి మందిరం, దండ నాగేశ్వర మందిరాలనూ దర్శించుకుంటారు.

ఈ దివ్య క్షేత్రం అనేక ప్రకృతి అందాలకు చిరునామాగా నిలుస్తుంది. ముఖ్యంగా కనుచూపుమేర కనిపించే ఎత్తైన పర్వతాలు, వాటి మీది నుంచి ఒడుపుగా దూకే జలపాతాలు, మలుపులు తిరిగే ఘాట్ రోడ్ భక్తులకు భయాన్ని, అంతులేని మానసిక ఆనందాన్నిస్తాయి. విశేషమైన ఆధ్యాత్మికమైన ఆనందాన్ని, అనిర్వచనీయమైన అనుభూతులను సొంతం చేసే మహత్తర క్షేత్రం దేవప్రయాగ. ఇక్కడ కొలువైన రఘునాథుడి దర్శనం పూర్వజన్మల పుణ్య ఫలం.

ఏటా ధనుర్మాసం ప్రారంభం నుంచి మొదలుకుని సంక్రాంతి వరకు దేవప్రయాగలో విశేషమైన ఉత్సవం జరుగుతుంది. దీనికి వేలాది భక్తులు హాజరువుతుంటారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇక్కడ విష్ణు సంక్రాంతి ఉత్సవాలను, ఇతర పర్వదినాల్లో రామ్‌లీలా వేడుకలను నిర్వహిస్తారు.

Tags

Related News

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Big Stories

×