ఇప్పుడు పుట్టినరోజును వైభవంగా చేసుకునే వారి సంఖ్య అధికంగా ఉంది. సాయంత్రం అయితే కేక్ పైన కొవ్వొత్తులను వెలిగించి.. ఆ కొవ్వొత్తులను ఆర్పడం ద్వారా పుట్టినరోజును సెలబ్రేషన్స్ మొదలుపెడతారు. అయితే ఇలా వెలుగుతున్న కొవ్వెత్తిని ఆర్పడం మంచిదో కాదో హిందూ శాస్త్రాలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి.
ఒక వ్యక్తి జీవితంలో పుట్టినరోజు అనేది గుర్తించుకునే సందర్భం. దాన్ని పూర్తిగా ఆస్వాదించాలనే ఇలా కేక్ కట్ చేయడం అనే పద్ధతి పుట్టుకొచ్చింది. ఆరోజు సాంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి కొవ్వొత్తిని ఆర్పి కేకును కత్తిరిస్తారు. ఇలా మండుతున్న కొవ్వొత్తులను ఆర్పడం అనేది హిందూ సంప్రదాయం ప్రకారం మంచి పద్ధతి కాదు.
అగ్నికున్న శక్తి ఎంతో…
అగ్ని అనేది మన పంచభూతాలలో శక్తివంతమైనది. అంతేకాదు ఎంతో పవిత్రమైనది. అగ్ని అనేది శక్తిని, కాంతిని కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది. జీవితాల్లో విజయానికి చిహ్నంగా నిలుస్తుంది. పూజ లేదా శుభకార్యాలలో మొదట దీపం వెలిగించడంతోనే ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. దీనివల్ల ఇంట్లో పాజిటివ్ శక్తి ప్రవహిస్తుందని నమ్ముతారు. అలాంటప్పుడు పుట్టినరోజు నాడు ఇలా వెలుగుతున్న కొవ్వెత్తిని ఆర్పడం అనేది ఆ ఇంటికి మంచిది కాదు. అంతే కాదు ఆ వ్యక్తి జీవితంలో కూడా ఆనందాన్ని నాశనం చేయడమేననే అర్థం వస్తుంది. కేవలం పుట్టినరోజే కాదు… ఏ శుభ సందర్భంలో కూడా అగ్నిని ఆర్పడం అనేది అశుభమని పురాతన గ్రంథాలు చెబుతున్నాయి.
పుట్టినరోజు కొవ్వొత్తిని ఇలా చేయండి
పుట్టినరోజు మండుతున్న కొవ్వొత్తులను ఏం చేయాలి? అనే ఆలోచన మీకు వచ్చి ఉంటుంది. మీరు కేకు పైన కొవ్వొత్తిని పెట్టి వెలిగించి దాని ఆర్పడం వంటివి చేయవద్దు. కేక్ ను కట్ చేసే ముందు ఆ కొవ్వొత్తిని తీసి ఇంటి గుమ్మం ముందు పెట్టండి. లేదా ఇంటి గుడిలో ఉంచండి. దానంతట అదే ఆరిపోయే వరకు వదిలేయండి. కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టండి. పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోండి. అంతేకానీ కొవ్వొత్తిని ఆర్పి ఇలా పుట్టినరోజును వేడుకను చేసుకోవడానికి ప్రయత్నించండి. అలా చేసినా హిందూ సంప్రదాయం ప్రకారం వేడుక అవ్వదు.
సూర్యాస్తమయం తరువాత వద్దు
సూర్యాస్తమయం తర్వాత మాత్రం కేక్ ను కట్ చేయకూడదని గుర్తుంచుకోవాలి. ఆ సమయంలో సానుకూల శక్తి చాలా వరకు తగ్గుతుంది. చీకటి పడే కొద్ది ప్రతికూల శక్తి బలపడడం ప్రారంభం అవుతుంది. కాబట్టి కేక్ కట్ చేయాలనుకునేవారు సూర్యాస్తమయానికి ముందే ప్రిపరేషన్ చేసుకోవడం మంచిది. లేదా ఉదయం పూట కేకును కత్తిరించిన శుభప్రదంగానే చెప్పుకుంటారు.
సానుకూల శక్తి ఇంట్లో బలంగా వ్యాపిస్తున్నప్పుడే ఇలా పిల్లల పుట్టినరోజును లేదా పెద్దవాళ్ల పుట్టినరోజులు చేస్తే ఎంతో మంచిది. అలాగే ఈ పుట్టినరోజున పేదరికంలో ఉన్నవారికి బట్టలు, గిన్నెలు, డబ్బులు వంటివి విరాళాలుగా ఇవ్వడం మర్చిపోకండి. ఇది ఆ పుట్టినరోజు చేసుకుంటున్న వ్యక్తికి మరింత ఆయుష్షును అందిస్తుంది.