Rain Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో ఏపీలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా ఏడు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి నదులకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం..
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి ప్రస్తుతం.. దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో, కళింగపట్నానికి 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండం దాదాపు పశ్చిమ దిశగా కదులుతూ ఇవాళ ఉదయం గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏపీలోని ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక..
వాయుగుండం ప్రభావంతో నేడు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని వివరించారు అధికారులు.
మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలు
అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం ప్రజలు విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070ను సంప్రదించాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..
తెలంగాణలో మరో 2 రోజులపాటు వర్షాలు కురుస్తాయని.. కొన్ని జిల్లాల్లో అతిభారీగా పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు..
ఈ క్రమంలో హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, జనగాం, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షం పడనుంది. గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచన..
భారీ వర్షాల వేళ పరిస్థితిని సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. పరిస్థితిని నిరంతరం మానిటర్ చేయాలని ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు అందుబాటులో ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.