OTT Movie : రియల్ స్టోరీలను ఆధారంగా చేసుకుని కొన్ని సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే వీటిలో కొన్ని కథలు డిఫరెంట్ స్టోరీలతో మైండ్ ని బెండ్ చేస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా, బుసాన్‌లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందింది. ఈ సినిమా కథ ఒక డిటెక్టివ్, సీరియల్ కిల్లర్ మధ్య నడుస్తుంది. మైండ్ గేమ్ లా సాగే ఈ గ్రిప్పింగ్ కథ విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘డార్క్ ఫిగర్ ఆఫ్ క్రైమ్’ 2018 లో వచ్చిన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. దీన్ని కిమ్ తే-గ్యున్ డైరెక్ట్ చేశారు. ఇందులో కిమ్ యూన్-సియోక్ మరియు జు జీ-హూన్ ప్రధాన పాత్రల్లో నటించారు.2018 అక్టోబర్ 3న విడుదలైన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలలో అందుబాటులో ఉంది. ఇది IMDbలో 6.7/10 రేటింగ్ ని కూడా పొందింది.
హ్యుంగ్-మిన్ అనే డిటెక్టివ్ బుసాన్‌లో నార్కోటిక్స్ ఆఫీసర్‌గా పని చేస్తుంటాడు. అతను పదోన్నతుల గురించి పట్టించుకోకుండా కేసులను పరిష్కరించడంపై ఎక్కువ దృష్టి పెడతాడు. ఒక రోజు అతను తన ఇన్ఫార్మర్ ద్వారా కాంగ్ టే-ఓ అనే వ్యక్తిని ఒక చిన్న రెస్టారెంట్‌లో కలుస్తాడు. టే-ఓ తాను ఒక శవాన్ని పాతిపెట్టడానికి డబ్బు తీసుకున్నట్లు చెబుతాడు. కానీ అతను మరిన్ని వివరాలు చెప్పే ముందే, పోలీసులు వచ్చి అతన్ని తన స్నేహితురాలి హత్య కేసులో అరెస్ట్ చేస్తారు. కొన్ని నెలల తర్వాత, టే-ఓ జైలు నుండి హ్యుంగ్-మిన్‌కు ఫోన్ చేసి, తాను మరో ఆరు హత్యలు చేసినట్లు ఒక షాకింగ్ ట్విస్ట్ ఇస్తాడు. అయితే ఈ హత్యల గురించి ఎటువంటి ఆధారాలు, కనీసం శవాలు కూడా దొరకవు. టే-ఓ తన హత్యల గురించి చెప్తూ, హ్యుంగ్-మిన్‌తో ఒక మైండ్ గేమ్ ఆడుతాడు. అతను చెప్పే విషయాలు నిజమా లేక తన శిక్షను తప్పించుకోవడానికి అబద్ధాలు చెబుతున్నాడా అని హ్యుంగ్-మిన్ ఆలోచనలో పడతాడు.
హ్యుంగ్-మిన్ తన సహచరుడు జో సహాయంతో ఈ కేసులను దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. వీళ్ళు రిపోర్ట్ చేయని కేసుల ఫైళ్లను పరిశీలిస్తారు. ఆతరువాత టే-ఓ తన సోదరుడిని బాల్యంలోనే హత్య చేసినట్లు, అతని సోదరి ద్వారా తెలుసుకుంటారు. ఈ సంఘటన టే-ఓను సీరియల్ కిల్లర్‌గా మార్చింది. ఒక కేసులో టే-ఓ, హ్వాంగ్ అనే వ్యక్తిని మెట్లపై నుండి తోసి హత్య చేసినట్లు చెబుతాడు. హ్యుంగ్-మిన్ ఈ కేసును దర్యాప్తు చేసి, సాక్ష్యాలను సేకరిస్తాడు. కానీ సాక్ష్యాలు సరిగ్గా లేని కారణంగా అది మరుగున పడుతుంది. ఈ మైండ్ గేమ్ లో హ్యుంగ్-మిన్‌ను తికమక పెట్టేందుకు, టే-ఓ అబద్ధాలతో ఒక ఆట ఆడుకుంటాడు. చివరికి హ్యుంగ్-మిన్ అతని నేరాలను బయట పెడతాడా ? అతని మైండ్ గేమ్ లో నలిగిపోతాడా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : అమ్మాయంటే పడి చచ్చే సోఫా… అబ్బాయిలు చెయ్యేస్తే చావే… ఇదెక్కడి దిక్కుమాలిన చేతబడి భయ్యా ?