హిందూ భక్తులలో కృష్ణునికి అభిమానులు ఎక్కువ. ఈ వెన్నదొంగను ప్రతిరోజు తలచుకోనిదే జీవించలేని కన్నయ్య ఆరాధకులు ఎంతోమంది ఉన్నారు. హృదయాలను గెలిచి, దుఃఖాలు అన్నింటినీ తొలగించే వ్యక్తిగా కృష్ణుడికి పేరు ఉంది. కృష్ణుడికి అనేక రకమైన పేర్లు ప్రచారంలో ఉన్నాయి. గోపాలుడు, ముకుంద, మురారి, వాసుదేవుడు, మాధవుడు, నంద గోపాలుడు, యదు నందనుడు, దేవకీ నందనుడు… ఇలా కృష్ణుడి పేర్లు ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే కృష్ణుడి మొదటి పేరు ఏమిటో మీకు తెలుసా?
ఇదే మొదటి పేరు
ఎన్నో ప్రసిద్ధ నమ్మకాలు, సంప్రదాయాలు ప్రకారం కృష్ణుడి మొదటి పేరు కన్నయ్య. ఆ యశోద మాత మొదటిసారిగా వస్త్రంలో చుట్టి చంద్రకాంతిలో నీలమణిలా మెరుస్తున్న శ్రీకృష్ణుడిని చూసిన మరుక్షణం ఆమె ఇదే పేరును తలచుకుంది. ప్రేమగా కన్నయ్య అని పిలిచింది. అందుకే కృష్ణుడికి కన్నయ్య అనే పేరు ఎంతో ఇష్టం. ఇప్పటికీ కూడా ఎంతోమంది కృష్ణుడుని కన్నయ్య అని పిలుస్తూనే ఉంటారు.
హిందూ ఆచారంలో కృష్ణుడికి 108 కంటే ఎక్కువ పేర్లు ఉన్నాయని చెబుతారు. ప్రతి ఒక్కటి అతని స్వభావాన్ని, అతని గుణాన్ని, అతని జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. కృష్ణుడు తెలివైనవాడు, ప్రేమైక జీవి. అలాగే కొంటె వ్యక్తి కూడా. ఈ మురళీధరుడుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది భక్తులు అనేక రకాలుగా పిలుచుకుంటారు. ఏది ఏమైనా యశోద తల్లి పెట్టిన కన్నయ్య పేరు మాత్రం అన్నిటికంటే అతి ముఖ్యమైనది.
వాసుదేవుడు అంటే
అన్ని పేర్లలో కొన్ని మాత్రం ఇప్పటికీ భక్తుల నోటిలో నానుతూనే ఉంటాయి. అందులో ముఖ్యమైనది వాసుదేవుడు. నిజానికి వాసుదేవుడు అనేది కృష్ణుడి తండ్రి పేరు. కానీ కృష్ణుడిని కూడా వాసుదేవుడు అనే పిలుచుకుంటారు. ఇక గోవిందా అన్న పేరు గోవులను రక్షించేవాడు అన్న అర్థంతో వచ్చింది. అలాగే జ్ఞానాన్ని పొందినవాడు అని కూడా చెప్పుకుంటారు. ఇక గోపాలుడు అన్న పేరు పశువులను కాయడం వల్ల వచ్చిన పేరుగా చెప్పుకుంటారు.
ముకుందా, మురారి అంటే
ముకుందా మురారి పేర్లు కూడా మనం అధికంగానే వింటాము. ముకుందుడు అంటే మోక్షాన్ని ప్రసాదించేవాడు అని అర్థం. ఇక మురారి అనే పేరు ముర అనే రాక్షసుడిని చంపడం వల్ల వచ్చిన పేరు. ఇక కృష్ణుడిని మాధవుడు అని పిలుచుకున్న వారు కూడా అధికమే. లక్ష్మీదేవికి ప్రియమైన వాడు అని అర్థం వచ్చే పేరు. ఇది అలాగే నందగోపాలుడు అని కూడా కృష్ణుని ప్రేమతో పిలుస్తారు. నందుని ఇంట కొడుకుగా పెరిగాడు కృష్ణుడు. అందుకే ఇతడిని నందగోపాలుడు అని అంటారు. ఇక యదునందన అని కూడా ఎంతోమంది పిలుచుకుంటారు. దీనికి కారణం కృష్ణుడు యదు వంశంలో పుట్టిన వాడు అని చెప్పడమే. ఇక దేవకీ నందన పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కృష్ణుడు అసలు తల్లి దేవకి చెరసాలలోని కృష్ణుడికి జన్మనిచ్చింది. ఆమె తర్వాత యశోద మాత వద్దకు చేరాడు కృష్ణుడు. అందుకే శ్రీకృష్ణుడిని దేవకీ నందనుడు అని కూడా పిలుచుకుంటారు.
విష్ణు ఎనిమిదో అవతారం
శ్రీకృష్ణుడు విష్ణువు 10 అవతారాలలో ఎనిమిదవ అవతారంగా చెప్పుకుంటారు. హిందూ పురాణాలలో సాహిత్యంలో ఆచార, పూజా సాంప్రదాయాలలో కృష్ణుడి పేరు వినిపిస్తూనే ఉంటుంది. మహాభారతం, భాగవతం, విష్ణు పురాణం ఈ గ్రంథాలన్నీ కూడా కృష్ణుని జీవితాన్ని, తత్వాన్ని తెలియజేస్తాయి, అందుకే ఈ హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు.
కృష్ణుడికి అసలు కృష్ణ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేశారా? కృష్ణ అంటే నలుపు అని అర్థం. కృష్ణుడు నల్లని రంగు కలవాడు అని చెప్పడానికి ఆ పేరును వాడారని అంటారు. అలాగే మహాభారతంలోని ఉద్యోగపర్వం ప్రకారం కృష్ అంటే దున్నడం అని అర్థం. దున్నే సాధనం నాగలి. నాగలి మొన నల్లగా ఉంటుంది. నాగలితోనే భూమిని దున్ని సస్యశ్యామలం చేస్తారు. అందుకే ఆ నాగలి మొనతో భూమిని దున్ని సస్యశ్యామలం చేసేవాడిగా చెప్పుకుంటూ కృష్ణుడు అనే పేరును పెట్టారని అంటారు.
ఏది ఏమైనా కృష్ణుడి లీలా విలాసాలు, మహాభారతంలోని అతని చాతుర్యం, అన్నమయ్య వర్ణనలు హిందూ భక్తులకు ఎంతో ప్రియమైనవి.