Coconut: వచ్చేవారంతో ఆషాడం పోయి శ్రావణమాసం రానుంది. అప్పుడే కొబ్బరి ధర మార్కెట్లో కొండెక్కింది. విజయవాడలోని మార్కెట్లో ఏకంగా కొబ్బరికాయ 48 రూపాయలు పలుకుతోంది. శ్రావణమాసం వస్తే రేటు అమాంతంగా పెరిగే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రేటు ఇంతలా పెరగడానికి కారణమేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
విజయవాడ సిటీలో ఓ మోస్తరు కొబ్బరికాయ ధర రూ.48లు పలుకుతోంది. కాస్త పెద్ద కాయ అయితే 60 రూపాయలు పైమాటే. ఉన్నట్లుండి బహిరంగ మార్కెట్‌లో కొబ్బరికి ఈ రేటుకు కారణమేంటి? వచ్చేవారం నుంచి శ్రావణమాసం మొదలుకానుంది. ఆ తర్వాత వినాయక చవితి రానుంది. ఆయా సమయాల్లో భక్తులు పెద్ద ఎత్తున కొబ్బరికాయలు వినియోగిస్తారు.
కొబ్బరి లేకుండా శుభకార్యాలు, పూజలు, హోమాలు పూర్తి కావు. ప్రస్తుత సామాన్యుడు కొబ్బరికాయను కొనలేని పరిస్థితి మొదలైంది. మార్కెట్లో వాటి ధరలు చూసి షాకవుతున్నారు. కొబ్బరికి ఈ ధర పలకడానికి కారణమేంటి? విజయవాడ మార్కెట్‌కు కొబ్బరికాయలు ఎక్కువగా
తమిళనాడులోని పొలాచ్చి, కోయంబత్తూరు ప్రాంతాల నుంచి వస్తుంటాయి. ఈ మధ్యకాలంలో అక్కడ చెట్లను చెద పురుగులు నాశనం చేశాయి. దీంతో దాదాపు 70 శాతం మేర పంట పాడైపోయింది. ఫలితంగా దిగుబడి అమాంతంగా తగ్గిపోయింది. చివరకు కర్ణాటక నుంచి కొబ్బరి ఇంకా మార్కెట్లోకి రాలేదు.
ALSO READ: యూజర్స్‌కి ఎయిర్ టెల్ తీసికబురు, ఏడాది పాటు ఉచితంగా
ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చే కాయలు పూర్తిస్థాయిలో రాకపోవటంతో ధరలు అమాంతం పెరిగాయి. గోదావరి జిల్లాల్లో కొబ్బరికి ధర లేకపోవడంతో రైతులు ఆయా చెట్లను నరికి పామాయిల్ పంట వేశారు. దీంతో కొబ్బరి ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది.
తమిళనాడులో టన్ను కొబ్బరికాయ రూ.67 వేలు పైమాటే. టన్నుకు సైజును బట్టి రెండు వేల వరకు వస్తాయి. ఇక రవాణా ఖర్చులు అన్నీ కలిపితే హోల్‌సేల్‌గా రూ.36 పలుకుతుంది. పెద్ద సైజు అయితే రూ.46 పైమాటే.
కేరళ: కొబ్బరి తోటలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. కొబ్బరి ధర పెరగడంతో ఆయా తోటలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కోజింజంపర, మీనాక్షిపురం, వడకరపతి ప్రాంతాలలో ఎకరం కొబ్బరి తోట ధర 6 నెలల కిందటి వరకు 25-35 లక్షలు ఉండేది. ఇప్పుడు 75 నుండి 80 లక్షలకు చేరింది. తమిళనాడు పొల్లాచ్చిలోని అనమల ప్రాంతం కొబ్బరి ఫేమస్.
ఎకరం కొబ్బరి తోట ఇటీవల 1 కోటి 7 లక్షలకు అమ్ముడైంది. ఈ తరహా ధర ఎప్పుడూ రాలేదని అంటున్నారు. కాలికోట్ జిల్లాలో కార్మికులు కొబ్బరికాయలను దొంగిలిస్తున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. గతంలో కొబ్బరికాయ ధర రూ. 30 ఉండేది. ఇప్పుడు ధర పెరగడంతో కార్మికులు దొంగతనానికి పాల్పడుతున్నారు.
దొంగతనాలు అధికం కావడంతో దుకాణాలు, తోటల యజమానులు తమ ప్రాంగణంలో సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి కాపలాకు డ్రోన్లను రంగంలోకి దించాలని ఆలోచన చేస్తున్నారు చాలామంది యజమానులు. ధరల పెరుగుదల ప్రధాన కారణం కొబ్బరి ఉత్పత్తి తగ్గిండమే కారణమని మార్కెట్ వర్గాల మాట.
దక్షిణ భారతదేశంలో కొబ్బరి ఉత్పత్తి 40 శాతం తగ్గింది. ఇండియాలో కేరళ, తమిళనాడు, ఫిలిప్పీన్స్ ప్రధాన కొబ్బరి పండించే ప్రాంతాలు. వాతావరణ మార్పుల కారణంగా దిగుబడి తగ్గింది. అకాల వర్షాలు, తుఫానుల కారణంగా చెట్లను దెబ్బతీశాయి. ఫలితంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో 60 ఏళ్ల తర్వాత మొదటిసారిగా కొబ్బరి ప్రాసెసింగ్‌కు అంతరాయం ఏర్పడింది.