Kartika Pournami 2025: హిందూ సంస్కృతిలో.. పండగలలో కార్తీక మాసానికీ.. అందులో వచ్చే కార్తీక పౌర్ణమికీ అత్యంత విశిష్ట స్థానం ఉంది. కార్తీక పౌర్ణమిని త్రిపురారి పౌర్ణమి లేదా దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ పర్వదినం నాడు భక్తులు భక్తిశ్రద్ధలతో దీపారాధన, నదీ స్నానాలు, ఉపవాసాలు, దానాలు ఆచరిస్తారు. ఈ రోజున దీపం వెలిగించడం వల్ల సకల పాపాలు హరించి, ఇహలోక సుఖాలతో పాటు ముక్తి లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం.
ఎన్ని దీపాలు వెలిగించాలి ?
కార్తీక పౌర్ణమి నాడు దీపారాధన చేయడం చాలా ముఖ్యం. మరి ఈ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి ? అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది.
పురాణాల ప్రకారం.. కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులతో కూడిన ఒకే దీపాన్ని వెలిగించడం అత్యంత శ్రేయస్కరం.
365 వత్తుల వెనక కారణం: సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. ఈ 365 వత్తులు సంవత్సరంలోని ప్రతి రోజును సూచిస్తాయి.
ఫలితం: ప్రతి రోజూ దీపాలు వెలిగించడం సాధ్యం కాని వారు, కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపారాధన చేస్తే.. సంవత్సరం పొడవునా దీపారాధన చేసిన పుణ్య ఫలం లభిస్తుందని పండితులు చెబుతారు.
దీపారాధన విధానం: ఈ 365 వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి.. ఒకే మట్టి ప్రమిదలో ఉంచి వెలిగిస్తారు.
అయితే.. 365 వత్తులు వెలిగించడం వీలుకాని వారు కనీసం 33 వత్తులు (ముప్పై మూడు కోట్ల దేవతలకు సంకేతంగా) లేదా 11 వత్తులు లేదా 5 వత్తులు లేదా కనీసం ఒక దీపాన్ని అయినా తప్పకుండా వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. దీపాల సంఖ్యతో సంబంధం లేకుండా.. నిష్టతో భక్తితో వెలిగించిన దీపం గొప్ప ఫలితాన్నిస్తుంది.
కార్తీక పౌర్ణమి విశిష్టత:
కార్తీక పౌర్ణమి రోజున శివుడు త్రిపురాసురులను సంహరించడం వల్ల.. దీనిని త్రిపురారి పౌర్ణమి అని కూడా అంటారు. దేవతలు సంతోషించి దీపాలను వెలిగించిన కారణంగా దీనికి దేవ దీపావళి అనే పేరు వచ్చింది.
పవిత్ర స్నానం: ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి, నదీ స్నానం (నదుల్లో కుదరని వారు ఇంట్లోనే తల స్నానం) ఆచరించడం ఉత్తమం. ఇది సకల పాపాలను పోగొట్టి.. శుభాలను కలిగిస్తుంది.
శివకేశవుల పూజ: కార్తీక పౌర్ణమి శివుడు, విష్ణువు ఇద్దరికీ ప్రీతికరమైన రోజు. శివాలయంలో రుద్రాభిషేకం, విష్ణు ఆలయంలో సత్యనారాయణ వ్రతం చేయడం విశేష ఫలాలను ఇస్తుంది.
దీపదానం: దేవాలయంలో కానీ.. తులసి చెట్టు వద్ద కానీ, రావి చెట్టు కింద కానీ, నదీ తీరంలో కానీ దీపాలను వెలిగించి, దీపదానం చేయడం వల్ల ముక్తి లభిస్తుంది. ఉసిరికాయపై దీపం వెలిగిస్తే దోషాలు తొలగిపోతాయని నమ్మకం.
Also Read: కార్తీక పౌర్ణమి ఈ ఒక్క పని చేస్తే చాలు.. మీ ఇంట ‘కాసుల వర్షం’ ఖాయం !
తులసి పూజ: కార్తీక మాసంలో తులసిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఈ రోజున తులసి దగ్గర దీపం వెలిగించి పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి.
దానధర్మాలు: ఉపవాసం ఉండి. పేదలకు ఆహారం, వస్త్రాలు, బెల్లం వంటివి దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
కార్తీక పౌర్ణమి కేవలం దీపాలు వెలిగించే రోజు మాత్రమే కాదు, ఇది మన మనసులోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి, జ్ఞానమనే వెలుగును నింపే ఒక పవిత్ర పర్వదినం. ఎన్ని వత్తులు వెలిగించామనే దాని కంటే.. ఎంత నిర్మలమైన మనస్సుతో ఆరాధించామన్నదే ముఖ్యం. భక్తి, శ్రద్ధలతో ఈ పండగను జరుపుకుంటే శివకేశవుల ఆశీస్సులు, సకల శుభాలు కలుగుతాయి.