BigTV English

Lord Brahma : బుద్ధభూమిలో మన బ్రహ్మయ్య ఆలయం..!

Lord Brahma : బుద్ధభూమిలో మన బ్రహ్మయ్య ఆలయం..!
Lord Brahma

Lord Brahma : సనాతన ధర్మం ప్రభవించిన భారతదేశంలో త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మకు ఉన్న ఆలయాలను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఇక్కడ ఉన్న ఆ నాలుగైదు ఆలయాలూ పెద్ద పేరున్నవి కావు. అయితే.. ఎక్కడో ఉన్న థాయ్‌లాండ్‌లో మాత్రం బ్రహ్మదేవునికి బ్రహ్మాండమైన ఆలయం ఉంది. అంతేకాదు.. అది అక్కడి భక్తుల విశ్వాసాన్ని ఎంతగానో చూరగొంటోందంటే ఆశ్చర్యం కలుగకమానదు..! ఇంతకూ ఆలయం ఆ దేశంలో ఎక్కడ ఉంది? దాని విశేషాలేమిటో మనమూ తెలుసుకుందాం.


మన దేశంలో బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మగా పిలవబడే దైవం ఆలయం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఉంది. అయితే.. అక్కడి వారు ఈ దైవాన్ని ‘ప్రాం ప్రోం’ అని పిలుస్తారు. సంస్కృతంలో పరబ్రహ్మ అనే పదమే ఇలా మారిందని చెబుతారు. థాయ్‌లాండ్ పేరుకు బౌద్ధ దేశమే అయినా.. అక్కడి ప్రజలు భారతీయ సనాతన ధర్మంలో కనిపించే దేవతలనూ తరాలుగా ఆరాధిస్తూ ఉన్నారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న ప్రాం ఫ్రోంను పూజిస్తే.. తమ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోయి, సకల శుభాలు చేకూరతాయని వారి నమ్మకం.

ఈ ఆలయ నిర్మాణం వెనక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. 1950వ దశకంలో అక్కడి ప్రభుత్వం ‘ఎరావన్’ అనే ఒక హోటల్ నిర్మాణాన్ని చేపట్టింది. ఎరావన్ అంటే.. అర్థం.. ఐరావతం(ఇంద్రుని పట్టపుటేనుగు). పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పడు వెలువడిన జీవుల్లో ఐరావతమూ ఒకటి. దీనిని వైభవానికి గుర్తుగా భావిస్తారు.


అయితే.. ఈ హోటల్ నిర్మాణం చేపట్టిన తొలిరోజు నుంచే ఏదో ఒక అవరోధం అక్కడి పనివారికి ఎదురుకావటం మొదలైంది. కూలీలు గాయపడటం, సామాగ్రి తగలబడటంతో నిర్మాణం ఆలస్యం కావటమే గాకుండా.. ఖర్చు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయి.. ఒక దశలో పని ఆగిపోయింది. దీంతో అక్కడి ప్రభుత్వం జ్యోతిషులను సంప్రదించగా, వారు బ్రహ్మ ఆలయాన్ని నిర్మించమని చెప్పారట.

ఆ వెంటనే ఆలయ నిర్మాణం జరగటం, ఆ తర్వాత ఎలాంటి విఘ్నాలు లేకుండానే హోటల్ నిర్మాణం జరిగాయట. 1987లో అక్కడ కట్టిన హోటల్ స్థానంలో మరో బ్రహ్మాండమైన హోటల్ నిర్మించినా.. ఈ ఆలయాన్ని మాత్రం కదిలించలేదట.

తావ్ మహాప్రోమ్ టెంపుల్‌గా స్థానికులు పిలిచే ఈ మందిరంలోని బ్రహ్మదేవునికి రోజూ పూజలో భాగంగా ధూపం వేయటం, కొవ్వొత్తుల దీపాలు వెలిగించటం, కొబ్బరి పాలను నైవేద్యంగా అర్పించటం సంప్రదాయం. ఇక్కడి ఆలయంలో మూలమూర్తి ముందు ఏనుగు బొమ్మని పెట్టి.. మనసులో ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని అక్కడి వారి ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయ ప్రాంగణంలోనే గణపతి, త్రిమూర్తులు, లక్ష్మి, నారాయణుల ఆలయాలతో బాటు ఇంద్రుని ఉపాలయాలూ ఉన్నాయి.

అలాగే.. ఈ స్వామికి సంగీత నాట్యాలంటే ఎంతో ఇష్టమట. అందుకే ఆలయ ప్రాంగణంలో థాయ్ సంగీత వాయిద్యాలతో సందడి నడుమ సంప్రదాయ నృత్యాలు చేస్తుంటారు.

ఆలయానికి ఏటికేడు భక్తుల రద్దీ పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే కొన్ని విద్రోహ శక్తుల దాడులకూ ఈ ఆలయం గురైంది. 2006లో ఒక పిచ్చివాడు అక్కడి మూలమూర్తి విగ్రహాన్ని తునాతునకలు చేశాడు. దీంతో అక్కడి భక్తులు పెద్దపెట్టున నిరసనలు తెలియజేయగా, తర్వాత మరో విగ్రహాన్ని అదే స్థానంలో ప్రతిష్టించారు. అలాగే.. 2015లో ఆలయ ప్రాంగణం సమీపంలోనే ఓ బాంబు పేలుడు కూడా సంభవించింది. ఈసారి ఆలయానికి ఏమీ నష్టం జరగకున్నా.. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. నేటికీ ఈ దాడికి కారకులను ప్రభుత్వం పట్టుకోలేకపోవటం విచిత్రం.

అయితే.. కాలంతో బాటు వచ్చిన ఎన్నో సవాళ్లను, సమస్యలను ఎదుర్కొన్న ఈ దేవాలయం నేటికీ భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు కేంద్రంగా నిలుస్తోంది. ఎంత పెద్ద సమస్యనైనా ఇట్టే తీర్చే దైవంగా నేటికీ అక్కడి మన బ్రహ్మయ్య పూజలందుకుంటూనే ఉన్నాడు.

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×