Krishna’s Dwarka: శ్రీకృష్ణుడి కర్మభూమిని అన్వేషించే ప్రయత్నాలు మళ్లీ మొదలయ్యాయి. సముద్రగర్భంలోని సుందరమైన ద్వారకపై భారత పురావస్తు శాఖ మళ్లీ రీసెర్చ్ మొదలుపెట్టింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత.. అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ అరేబియా సముద్రంలో పరిశోధనలు జరుపుతోంది. అసలు కృష్ణుడు నిర్మించిన ద్వారక ఎలా ఉండేది? సముద్రంలో ఎలా మునిగిపోయింది? ద్వారక అంతర్థానమే.. కలియుగానికి నాంది పలికిందా?
సముద్రంలో మునిగిన ద్వారక నగరంపై మళ్లీ అన్వేషణ
సముద్రపు కెరటాల అడుగున.. మానవుల కనుచూపు మరుగున.. అరేబియా అంచుల్లోని సముద్రగర్భంలో ద్వారక నగరం ప్రశాంతవదనంతో ఉంది. ఆ దేవదేవుడు నడిచిన నగరం.. ఆ శ్రీకృష్ణుడు ఏలిన ద్వారక.. సముద్రంలో కలిసిపోయి వేల ఏళ్లు దాటింది. హిందూ పురాణాల ప్రకారం.. సముద్రంలో మునిగిన ద్వారకా ఆనవాళ్ల కోసం.. భారత పురావస్తు శాఖ బృందం మళ్లీ అన్వేషణ మొదలుపెట్టింది. గుజరాత్‌లోని ద్వారక తీరంలో.. ఐదుగురు డైవర్లు అరేబియా సముద్ర గర్భంలో రీసెర్చ్ చేస్తున్నారు. ఈ దర్యాప్తును దశలవారీగా ముందుకు తీసుకెళ్లనున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత.. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా విభాగమైన అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్.. ఈ పరిశోధనని మొదలుపెట్టింది. శ్రీకృష్ణుడు నడయాడిన నేలకు సంబంధించి.. మరిన్ని విశేషాలను బయటి ప్రపంచానికి తెలిపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
సముద్రగర్భంలో ద్వారక ఇప్పుడెలా ఉంది?
ద్వారక నగరానికున్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతేంటి?
ద్వారక అంతమే.. కలియుగానికి నాంది పలికిందా?
ఇలా.. చాలా మందిలో అనేక ప్రశ్నలున్నాయి. వాటిన్నింటికి సమాధానాలు తెలియాలంటే.. ద్వారక గురించి తెలియాలి. శ్రీకృష్ణుడు అక్కడే ఉండి ఎందుకు పాలన సాగించాడో తెలుసుకోవాలి. హిందూ పురాణాల్లో ద్వారకా నగరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ద్వాపర యుగం నాటి ద్వారకా.. నేటికి సముద్రగర్భంలో నెలవై ఉంది. శ్రీకృష్ణపరమాత్ముడు నడయాడిన నేలగా.. అంతుచిక్కని రహస్యాల గనిగా.. ద్వారక కొలువై ఉంది. దేవశిల్పి విశ్వకర్మ సాయంతో శ్రీకృష్ణుడు నిర్మించిన సుందర నగరమే ద్వారక. ఎన్నో ఆధ్యాత్మిక భావనలతో ముడిపడిన పుణ్యస్థలం అది. ఇప్పుడు సముద్రగర్భంలో దాదాపు 300 అడుగుల లోతులో ఉంది ద్వారక నగరం.
కృష్ణుడు అవతారం చాలించడంతో మునిగిన ద్వారక
మునిగిపోయిన ద్వారక.. ఇప్పుడెలా ఉంది? ఆ నగరానికి సంబంధించిన ఆనవాళ్లు ఇంకా అలాగే ఉన్నాయా? శ్రీకృష్ణుని కాలంనాటి ద్వారక అవశేషాలు.. ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయా? ద్వారకపై జరిపే పరిశోధనలతో.. కీలక ఆధారాలు లభించనున్నాయా? ద్వాపర యుగంలో మునిగిపోయిన ద్వారక.. ఈ కలియుగంలోనూ ఎందుకు ఆసక్తి రేపుతోంది. ద్వారక నగర ఆనవాళ్లతో మనకు కీలక సమాచారం లభిస్తుందా? ఇలా.. చాలా ప్రశ్నలున్నాయి. అందుకే పురావస్తు శాఖ సముద్రగర్భంలో పరిశోధనలు మొదలుపెట్టింది. ద్వాపరయుగం నాటి ఆనవాళ్లని, ద్వారక అవశేషాల్ని వెలికితీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
పురాణాల ప్రకారం భారతదేశంలో 7 లక్షల నగరాలు
హిందూ పురాణాల ప్రకారం భారతదేశంలో ఏడు మోక్ష నగరాలున్నాయి. అవి అయోధ్య, హరిద్వార్, మధుర, కాశీ, కంచి, ఉజ్జయినీతో పాటు వాటిలో ద్వారక కూడా ఒకటి. కృష్ణుడు నడయాడిన నేలగా ద్వారక ప్రసిద్ధి చెందింది. అయితే.. శ్రీకృష్ణుడి జన్మస్థలం మాత్రం మధుర! తన అల్లుడు కంసుడిని చంపడంతో కృష్ణుడిపై పగబట్టిన జరాసంధుడు.. మధురపై వరుసదాడులు చేస్తాడు. తన ప్రజల్ని రక్షించుకునేందుకు.. కృష్ణుడు మధురని విడిచి.. గుజరాత్ తీరంలోని ద్వారకకు చేరుకుంటాడు. అక్కడే.. సుందరమైన నగరాన్ని నిర్మిస్తాడు.
మహాభారతంలో ద్వారావతిగా ద్వారక నగర ప్రస్తావన
మహాభారతంలో ఈ నగరాన్ని.. ద్వారావతిగా చెబుతారు. అనేక ద్వారాలు కలిగిన నగరం కాబట్టి.. దీనికి ఆ పేరు వచ్చింది. ప్రస్తుతం గుజరాత్‌లోని సౌరాష్ట్ర సముద్రతీరంలో.. ఈ ద్వారక ఉంది. మధురని విడిచిపెట్టిన తర్వాత.. శ్రీకృష్ణుడు గోమతీ నది, అరేబియా సంగమ స్థానానికి చేరుకున్నాడు. అక్కడ అందమైన నగరాన్ని నిర్మించాలని దేవశిల్పి విశ్వకర్మకు చెప్పాడు. ఇక్కడున్న కొన్ని దీవుల్ని కలుపుకొని.. సుందరమైన నగరాన్ని నిర్మించాడు విశ్వకర్మ.
నగరంలోని నిర్మాణాలకు బంగారం వాడకం
శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకా నగరం ఎంతో సుందరంగా ఉండేది. నివాసాలు, వ్యాపార ప్రదేశాలు, వాణిజ్య కూడళ్లు, రాజమార్గాలు, రాజభవనాలు.. ఇలా ప్రతిదీ చక్కని శిల్పకళతో తీర్చిదిద్దారు. ఇవే కాదు.. నందన, చైత్రరథ, మిశ్రక, వైబ్రాజ అనే నాలుగు అందమైన ఉద్యానవనాలుండేవి. ప్రకృతి సోయగాల మధ్య కళకళలాడే ద్వారక.. భువిపై వెలిసిన స్వర్గాన్ని తలపించేదంటారు. నగరంలోని నిర్మాణాలకు.. పూర్తిగా బంగారాన్నే వాడారని కూడా చెబుతారు. అందుకే.. దీనిని స్వర్ణద్వారక అని కూడా పిలిచేవారు. మహాభారతం, హరివంశం, వాయు పురాణం, భాగవతాల్లోనూ.. ద్వారక గురించి అనేక ప్రస్తావనలు, వర్ణనలు కనిపిస్తాయి.
36 ఏళ్ల తర్వాత ద్వారక మునిగిపోతుందని గాంధారి శాపం
కురుక్షేత్రంలో తన మొత్తం సంతానాన్ని కోల్పోవడానికి కారణం శ్రీకృష్ణుడేనని.. గాంధారి నిందిస్తుంది. సరిగ్గా.. 36 ఏళ్ల తర్వాత ద్వారక నగరం నీట మునిగిపోతుందని శపిస్తుంది. ఆ తర్వాత.. కృష్ణుడు అవతారం చాలించడం, ద్వారక సముద్రగర్భంలో కలిసిపోవడం జరుగుతాయి. కొంతకాలానికి శ్రీకృష్ణుని ముని మనవడు వజ్రుడు.. సముద్రతీరంలో ద్వారకని తిరిగి నిర్మించాడంటారు. అలా.. ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోవడమే కలియుగానికి నాంది పలికిందనే కథనాలున్నాయి.
ఇప్పటికే సముద్రగర్భంలోనే ద్వారక నగర ఆనవాళ్లు అవశేషాలు
కృష్ణుడు నడయాడిన ద్వారకా నగర ఆనవాళ్లు, అవశేషాలు.. ఇప్పటికీ సముద్రగర్భంలోనే ఉన్నాయనేది.. పురావస్తు శాస్త్రవేత్తల వాదన. ఇప్పటికే.. ప్రధాని మోదీ స్కూబా డైవింగ్ ద్వారా.. అరేబియా సముద్రంలోకి వెళ్లి.. పురాతన ద్వారకా నగర అవశేషాల్ని దర్శించుకొని.. పూజించారు. హిందూ పురాణాల్లో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ద్వారక అన్వేషణకు మళ్లీ ప్రయత్నాలు మొదలవడం.. శుభపరిణామంగా చెబుతున్నారు.
సముద్రగర్భంలోని నిర్మాణాలు ఏ కారం నాటివి?
ద్వారక నగరాన్వేషణ ప్రస్తావన ఎప్పుడొచ్చినా.. అందరిలోనూ తెలియని ఆసక్తి కనిపిస్తుంది. ముఖ్యంగా.. పురావస్తు శాస్త్రవేత్తల్లో ఓ కుతూహలం ఉంటుంది. సముద్రగర్భంలోని నిర్మాణాలు ఏ కాలం నాటివి? వాటి విశేషాలేంటి? అనేవి ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. పురాణాల ప్రకారం.. సముద్రంలో ఉన్న నగరం ద్వారకే అనేది చాలా మందిలో ఉన్న నమ్మకం. కానీ.. సముద్రగర్భంలో ఉన్న నగర ఆనవాళ్లు.. ద్వారకవేనా? అనేది కూడా ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది. అందువల్ల.. పురాణాలు, చరిత్రకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడమే.. అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ చేస్తున్న ప్రయత్నం.
1930లో తొలిసారి ద్వారక రహస్యాల అన్వేషణ
ద్వారక గురించి జరుగుతున్న అన్వేషణ తొలిసారేమీ కాదు. 1930లో.. తొలిసారి హిరానంద్ శాస్త్రి ద్వారక రహస్యాల్ని తెలుసుకునేందుకు అన్వేషించారు. 1963లో జేఎం నానావతి, హెచ్‌డీ సంకాలియా ఆధ్వర్యంలో తొలిసారి ద్వారకలో తవ్వకాలు జరిగాయి. 1969-70, 1983 నుంచి 1990 మధ్య సముద్రగర్భంలో ద్వారక అవశేషాలను, అప్పుడు వినియోగించిన కొన్ని వస్తువులను సముద్ర పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు.
2005 నుంచి 2007 మధ్య ద్వారక రహస్యాల అన్వేషణ
చివరగా 2005 నుంచి 2007లో ఈ తరహా అన్వేషణ జరిగింది. అప్పుడు.. సముద్రగర్భంలో ఓ నగర అవశేషాలు, అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయని తేల్చారు. మళ్లీ ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత.. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా.. మళ్లీ ద్వారకా తీరంలో అన్వేషణని తిరిగి ప్రారంభించింది. ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి నేతృత్వంలో ఐదుగురు పురావస్తు శాస్త్రవేత్తల బృందం.. ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తోంది. తొలిసారి.. ఈ రీసెర్చ్ టీమ్‌లో.. మహిళా పురావస్తు శాస్త్రవేత్తలు కూడా పాల్గొంటున్నారు.
ప్రాధమిక అధ్యయనానికి గోమతి నదీ సమీప ప్రాంతం ఎంపిక
ద్వారకా అన్వేషణ.. దశలవారీగా కొనసాగనుంది. తొలి దశలో.. పరిశోధనల కోసం స్థలాలను గుర్తిస్తారు. ఆ ఆంశాల ఆధారంగా మరిన్ని పరిశోధనలకు ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రాథమిక అధ్యయనం కోసం.. గోమతి నదీ సమీప ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఈ అన్వేషణలో.. శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరం నిజమని తేలితే మాత్రం.. నిజంగా అదో గొప్ప మలుపు అవుతుంది. అప్పుడు.. శ్రీకృష్ణపరమాత్ముడు ఈ భూమిపై ఉన్నది.. ద్వారకని నిర్మించింది.. ప్రజల్ని పాలించింది కూడా నిజమి తేలుతుంది. మన చరిత్ర, మన పురాణాలు, ఇతిహాసాలన్నీ నిజమవుతాయి.
4 వేల ఏళ్ల క్రితమే భారత్ సంపన్న దేశమని తెలుస్తుంది!
4 వేల ఏళ్ల క్రితమే.. భారతదేశం సంపన్న దేశమని ఈ ప్రపంచానికి తెలుస్తుంది. ఈ ప్రపంచానికి ఏమీ తెలియని రోజుల్లోనే.. కన్‌స్ట్రక్షన్‌లో, టెక్నాలజీలో.. ఇండియా ఎంత అడ్వాన్స్‌డ్ ఉందనేది అర్థమవుతుంది. ఇప్పటిదాకా.. హరప్పా, మొహంజోదారో గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ద్వారకపై జరుగుతున్న పరిశోధనలు సక్సెస్ అయితే.. అప్పుడు ద్వారక గొప్పతనమేంటో ఈ ప్రపంచానికి తెలుస్తుంది. అది.. ఎంత పురాతనమైన నగరమో అర్థమవుతుంది. ముఖ్యంగా.. ఈ ప్రపంచం కంటే భారత్ ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఉందనే విషయం ప్రూవ్ అవుతుంది.
లక్షద్వీప్, మహాబలిపురం, ద్వారక, లోక్తక్ సరస్సు
ప్రస్తుతం ద్వారక నగరాన్వేషణలో ఉన్న అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్.. 1980ల నుంచి నీటి అడుగున పురావస్తు పరిశోధనల్లో ముందంజలో ఉంది. 2001 నుంచి ఈ విభాగం.. లక్షద్వీప్, మహాబలిపురం, ద్వారక, లోక్తక్ సరస్సు, ఎలిఫెంటా ద్వీపం లాంటి ప్రదేశాల్లో.. పరిశోధనలు నిర్వహిస్తోంది. నీటి అడుగున సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన అధ్యయనం, వాటి రక్షణ కోసం.. పురావస్తు శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. రెండు దశాబ్దల క్రితం.. ద్వారకలోనూ.. ఆఫ్‌షోర్, ఆన్‌షోర్ తవ్వకాలు నిర్వహించారు.
సముద్రగర్భంలో భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వం
ఆ సమయంలో.. అక్కడ శిల్పాలు, రాతి లంగర్లు కనుగొన్నారు. వాటి ఆధారంగా.. నీటి అడుగున తవ్వకాలు జరిగాయి. సముద్రగర్భంలో దాగి ఉన్న భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాలనే లక్ష్యంతోనే.. ఇప్పుడు మళ్లీ నీటి అడుగున పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఆ శ్రీకృష్ణుడు నడయాడిన నేలకు సంబంధించిన ఎన్నో విశేషాల్ని.. త్వరలోనే ఈ ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు.