
Madhukeswara Temple : మనదేశంలో ఎన్నో రకాల శైవక్షేత్రాలు ఉన్నాయి. స్వయంభువుగా వెలిసిన క్షేత్రాల్లో మధుకేశ్వరాలయం ముఖ్యమైంది. మధూక వృక్షంలో వెలిసిన ముఖలింగమే ఈ క్షేత్రంలో ప్రత్యేకత. ఈ ఆలయంలో శివయ్య చెట్టు మొదలులో స్వయంగా లింగావతారంలో కొలువై భక్తులకు దర్శనం ఇస్తున్నారు.దేశంలో కొలువైవున్న అత్యంత ప్రాచీనమైన దేవాలయాల్లో మధుకేశ్వరాలయం ఒకటి. శ్రీకాకుళం జిల్లాలో వంశధారా నదికి ఎడమ గట్టున ఉండే ముఖ లింగం అనే గ్రామంలో ఈ క్షేత్రం ఉంది. మధూక వృక్షం అంటే ఇప్పచెట్టు.
అందుకే ముఖలింగేశ్వరుని అవతారంలో వెలసిన పరమశివవుడు భక్తుల్ని కటాక్షిస్తుంటాడు. రాతిలో వెలిసిన శివలింగాన్ని మనం చూసే ఉంటాం. కాని ఇక్కడ అందుకు భిన్నంగా ఉంటుంది. రాతితో చెక్కిన విగ్రహానికి బదులు ఇప్పచెట్టు మొద్దుతో శివుడు కొలువుదీరాడు. గర్భాలయంలో శ్వేత వర్ణంలో ముఖలింగేశ్వరుడు తరింపజేస్తాడు. శివుడికి ఎదురుగా పెద్ద నంది దర్శనమిస్తుంది. సోమేశ్వర, భీమేశ్వరస్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. అద్భుతమైన శిల్పకళ చూపురులను కట్టిపడేస్తుంది.
మధు కేశ్వర ఆలయంలోని గర్భాలయం మాత్రమే కాకుండా అష్ట దిక్కులా ఎనిమిది లింగాలున్నాయి. ఇక్కడ అమ్మవారిని వరాహి దేవిగా కొలుస్తారు. సప్త మాతృకల్లో ఒకరుగా వరాహిదేవి అమ్మవారిని భక్తులు సేవిస్తారు. వరాహావతారం, సూర్యవిగ్రహం ఇక్కడ శిల్పాల్లో దర్శనమిస్తాయి. పరిశోధకుల లెక్కల ఈ ప్రకారం ఈ ఆలయం 8వ శతాబ్దంలో నిర్మితమైంది. పురావస్తుశాఖ పరిధిలో ఈ ఆలయం ఉంది. జిల్లాలో ఆముదాలవలసకి సుమారు 40 కిలోమీటర దూరంలో ఈ ఆలయం ఉంటుంది.
పాండవులు రాజ్యాన్ని కోల్పోయి వనవాసం చేసినప్పుడు మధుకేశ్వరుడ్ని దర్శించుకున్నట్టు పురాణాల్లో ఉంది. ఈ ఆలయంలో ముఖలింగేశ్వరుని దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదంటారు. అలాగే చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న రోగులు తగ్గి ఆరోగ్యం బాగుపడుతుందంటారు. మానసిక రోగాలు, పిచ్చి, రుణ బాధలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.