
Jonnawada Kamakshi Temple : నెల్లూరు జిల్లాలో పెన్నా నది తీరాన ఉన్న జొన్నవాడ కామాక్షి మాతకి కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు దేవతగా పేరుంది. ఈ క్షేత్రాన్ని ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి. శక్తి క్షేత్రాల్లో ఒకటైన జొన్నవాడ క్షామాక్షి మాతను దర్శిస్తే చాలు కోరిన కోరికలు నెరవేరతాయని నమ్మకం. ఈ గుడి నెల్లూరు టౌన్ కు సమీపంలోనే ఉంది . ముఖ్యంగా సంతానం కోసం పూజలు చేసే భక్తులు ఈ ఆలయానికి వచ్చి అమ్మని దర్శిస్తే పుత్ర ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అమ్మవారి ఆలయంలో ఇచ్చే కొడిముద్దలు స్వీకరించడానికి సంతానం లేని జంటలు పోటీ పడుతుంటాయి. అమ్మవారి కొడి ముద్ద భుజిస్తే సంతాన భాగ్యం కలుగుతుందట.
పెన్నా నది ఒడ్డున్న కొలువైన ఆలయంలో కొలువైన పార్వతీ దేవిని కామాక్షితాయిగాను, శివుడ్ని మల్లిఖార్జునుడిగా పిలుచుకుంటారు. కామాక్షి మాతకి ఏటా ఘనంగా నిర్వహించే బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే ఈ కొడిముద్దను ప్రసాదంగా పంచిపెడతారు. ధ్వజారోహణ సమయంలో బియ్యం, పెసర పప్పుతో తయారు చేసిన కొడిముద్ద ప్రసాదాన్ని నివేదన తర్వాత భక్తులకు పంచిపెడతారు. ఈ ప్రసాదం కోసమే ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. అలాగే పిల్లల్ని వేడుకునే వారు వరపడటం అనే కార్యక్రమాన్ని భక్తితో నిర్వహిస్తారు. అమ్మవారిని సేవించే వారు ముందు పెన్నా నదిలో స్నానం ఆచరించి తడిబట్టలతో ఆలయంలోనికి ప్రవేశిస్తారు.
రాక్షసుల వేధింపులు తట్టుకోలేక ఇంద్రుడు పెన్నా నదిలో స్నానమాచరించి జొన్నవాడ కామాక్షి తాయిని సేవించాడి పునీతుడయ్యాడట. అమ్మవారి దర్శనంతో రాక్షసబాధల నుంచి కూడా విముక్తుడయ్యాడు. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఎంతో చక్కగా చెక్కిన రాతి స్తంభాలు మహోన్నతమైన గోపురాలతో ఆకట్టుకుంటుంది. ప్రధాన గర్భగుడిలో కామాక్షి దేవి విగ్రహ రూపంలో అమ్మవారు నాలుగు చేతులతో, విల్లు, బాణం, చెరకు, పువ్వులు పట్టుకొని భక్తులకి దర్శనమిస్తుంది. ఏటా ఫిబ్రవరి-మార్చిలో పది రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవం వైభవంగా జరుగుతుంది.