Makar Sankranti 2025: భోగ భాగ్యాల భోగి! సంబరాల సంక్రాంతి! కనువిందు చేసే కనుమ! మొత్తంగా.. సంక్రాంతి పండుగ అంటేనే.. కొత్త ఏడాదిలో తెలుగు లోగిళ్లను.. నిత్య నూతనంగా మార్చే పెద్ద పండుగ! తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాల్లో.. సంక్రాంతిది విశిష్ట స్థానం. అందరినీ ఒక్కటి చేసే.. ఒకే ఒక్క సంబరం. ఎక్కడెక్కడో ఉన్నోళ్లని.. ఊళ్లకు ఆహ్వానించి.. మూలాల్ని గుర్తుచేసే పండగ. మనందరికీ.. సంక్రాంతి ఇచ్చే సందేశమేంటి?
సంక్రాంతి పండగంటే.. అదో ఆనందం. చదువులు, వృత్తులు, ఉద్యోగాలు, ఉపాధి అంటూ.. ఊరు విడిచిన వాళ్లందరినీ.. మళ్లీ ఒక చోటుకు చేర్చే పండుగ. కనుమరుగైన ఉమ్మడి కుటుంబాల బంధాలని.. మూడు, నాలుగు రోజుల పాటు జరుపుకునే గొప్ప పండుగ సంక్రాంతి. ఏ మూలన ఉన్నా.. పల్లెకి తీసుకొచ్చి మూలాల్ని గుర్తు చేసే సంబరం ఇది. పెద్ద పండుగ వచ్చిందంటే చాలు.. నగరాలు, పట్టణాల్లో ఉన్నోళ్లంతా.. పల్లె బాట పడతారు. తెలుగు ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకునే పండగల్లో.. సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
భోగి, సంక్రాంతి, కనుమ పేరిట మూడు రోజుల పాటు సాగే ముచ్చటైన ఈ పండుగ వైభవం, వైభోగం.. గ్రామాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఆ వైబ్.. పల్లెల్లో మాత్రమే తెలుస్తుంది. భోగి మంటలు, భోగి పళ్లు.. రంగవల్లులతో మెరిసే తెలుగు లోగిళ్లు, పిండి వంటలు, గాలి పటాలు, పశువుల పూజలు, కోళ్ల పందాలు.. కొత్త అల్లుళ్లకు మర్యాదలు. మనసు పులకరించిపోయే పలకరింపులు, కల్మశం లేని ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు.. బోనస్. ఇలా.. అన్నింటితో ఓ గిఫ్ట్ ప్యాక్‌లా ఉంటుంది సంక్రాంతి.
జనవరి వస్తే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఆటోమేటిక్‌గా సంక్రాంతి వైబ్ వచ్చేస్తుంది. ఏ టౌన్‌లో ఉన్నా.. అందరినీ హోమ్ టౌన్‌కి రప్పించే ఫెస్టివల్ పొంగల్ ఒక్కటే. పండక్కి.. సొంతూరికి వెళితే కలిగే సంతోషమే వేరు. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఊళ్లో గడిపిన పసితనపు ఆనవాళ్లని గుర్తుచేసే పండగ సంక్రాంతి మాత్రమే. తీయనైన జ్ఞాపకాల్ని తనలో దాచుకున్న ఎన్నో రుజువులు.. ఊళ్లోనే ఉంటాయి. ఏడాదికోసారి కనులకు కమ్మనైన దృశ్యాల్ని చూపే పండుగ ఇది. పల్లెల్లో కనిపించే చెట్టుకి.. పుట్టకి.. ప్రతి చోటుకి.. బాల్యంతో ముడిపడి ఉన్న ఓ జ్ఞాపకం ఉంటుంది. అవి.. సరదాగా స్నేహితులతో గుర్తు చేసుకొని.. సంతోషంగా గడిపినప్పుడు కలిగే అనుభూతి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఏడాది మొత్తం దూరమైన ఊరుని.. 3 రోజుల్లో మన దరికి చేర్చే పండగ సంక్రాంతి. ప్రతి ఒక్కరి పలకరింపులతో.. పులకరించిపోతాం. అరుదైన క్షణాల్ని మనసారా ఆస్వాదించేలా చేస్తుంది ఊరు.
సంక్రాంతి అంటేనే.. ప్రేమానురాగాల అనుభూతిని పంచే అందమైన పండగ. తెలుగువారంతా.. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపే అద్భుతమైన సమయం. భోగ భాగ్యాలు, సుఖ,సంతోషాలు పంచే సంక్రాంతి వేళ.. తెలుగు లోగిళ్లలో కనిపించే సందడే వేరు. ఇంటికి దూరంగా ఎక్కడో ఉండే పిల్లలు.. పండక్కి ఇంటికి వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులకు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేం. ఊరంతా ఆనందాన్ని పంచే పండగ సంక్రాంతి. అనురాగాలు విరిసే ఈ మూడు రోజులు.. అన్ని పర్వదినాల కంటే విశేష ప్రాముఖ్యతని కలిగి ఉన్నాయి. నిజానికి.. మనమంతా సంక్రాంతిని మూడు రోజుల పండగగా జరుపుకుంటున్నాం. కానీ.. దీనితో పాటు ముక్కనుమ కూడా ఏడాది పండుగ జరుపుకునే అరుదైన ఉత్సవం.
కొత్త బట్టలతో ముద్దులొలికే చిన్నారులు.. ఇళ్లంతా తిరుగుతుంటే ఆ సందడే వేరు. పెద్దల ముచ్చట్లు, కొత్త అల్లుళ్ల సరదాలు, కొంటె మరదళ్ల అల్లర్లతో ఉల్లాసం, ఉత్సాహం వెల్లివిరిస్తుంది. మిగిలిన రోజుల్లో కుటుంబ సభ్యులు ఎక్కడున్నా.. ఏ ప్రాంతంలో ఉన్నా.. ఏ దేశంలో ఉన్నా.. సంక్రాంతి రోజు మాత్రం సొంతూరిలో కలవాల్సిందే. పల్లెసీమల్లో జరిగే సంబరాల్లో ఉండాల్సిందే. మళ్లీ పండుగ వచ్చేదాకా.. ఆ జ్ఞాపకాల్ని మదిలో నిలుపుకోవాల్సిందే.
సంక్రాంతి అంటే ప్రేమానురాగాలే కాదు.. అరమరికలు లేని వ్యక్తిత్వాలు, అబ్బురపరిచే సంప్రదాయాలెన్నో ఉన్నాయి. అణువణువునా ఆప్యాయత, మాటల నిండా మమకారం, అతిథి మర్యాదలు.. మనసుకు ఎంతో ఉల్లాసాన్నిస్తాయి. ఎవరి ఇంట్లోనైనా కొత్తగా పెళ్లైన జంట ఉంటే.. ఆ సంబరం, సంతోషం రెట్టింపు అవుతుంది. సంక్రాంతికి తొలిసారి ఇంటికొచ్చే.. కొత్త అల్లుడికి అత్తింటివారు ఎప్పటికీ గుర్తుండిపోయే రకరకాల వంటకాలు, విందు భోజనాలు వడ్డించి.. కమ్మని జ్ఞాపకాలుగా మిగిలిపోయేలా చేస్తారు. పండగంటే.. సొంతూళ్లకు వెళ్లడమే కాదు.. ఎక్కడెక్కడో ఉన్న బంధువుల్ని ఇంటికి ఆహ్వానించడం, వాళ్లతో సంతోషంగా గడపడం కోసం.. అంతా ఊళ్లకు చేరతారు.
Also Read: ఏపీలో తొలిసారి పడవ పందాలు.. ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు..!!
సంక్రాంతి అంటే.. పండుగ సంబరాలు, కోడి పందాలు, పల్లె అందాలు.. ఇలా సరదా పడిన ప్రతి ఒక్కటి ఇచ్చే పండగ సంక్రాంతి. పిండి వంటల రుచులు, కుటుంబ సభ్యులంతా ఒకే చోట కలిసి చేసే విందు భోజనాలు.. మనసుకు ఎంతో ఉల్లాసాన్నిస్తాయి. ఇక.. కొత్త అల్లుడు మొదటిసారి పండక్కి ఇంటికొస్తే.. ఆ ఇంట్లో హడావుడి అంతా ఇంతా ఉండదు. లెక్కపెట్టలేనన్ని పిండి వంటలు సిద్ధం చేస్తారు. కొసరి.. కొసరి అల్లుడికి వడ్డించే దృశ్యాలు అనేకం.
పండక్కి ఇంటికొచ్చిన చుట్టాలకు బట్టలు పెట్టడం, కానుకలు ఇవ్వడం లాంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ రెండు కుటుంబాల మధ్య బంధం మరింత బలపడుతుందని నమ్ముతారు తెలుగువారు. పండుగ ముగిశాక.. తిరిగి సొంతూళ్లకు వెళ్లిపోయే బంధువులకు.. పిండి వంటల్ని ప్యాక్ చేసి ఇస్తారు. బరువెక్కిన గుండెలతో వీడ్కోలు పలుకుతారు. వచ్చే ఏడాది కూడా తమ ఇంటికే పండక్కి రావాలంటారు. అలా కాదు.. వచ్చే పండక్కి మీరే మా ఇంటికి రావాలని.. ఏడాది ముందే ఆహ్వానిస్తారు. ఇదే.. సంక్రాంతికున్న ఎమోషన్.
సంక్రాంతి వేడుకలు, సంబరాలు దేశమంతటా జరుగుతాయి. కానీ.. ప్రతి రాష్ట్రానికి ఓ సంప్రదాయం, సంస్కృతి ఉంటుంది. అయితే.. తెలుగువారి సంప్రదాయానికి ఉన్న ప్రాముఖ్యత.. మరే రాష్ట్రంలోనూ లేదు. ఈ మూడు రోజుల పండుగకు.. మూడు రకాల విశేషాలున్నాయి. తెలుగు లోగిళ్లను సంక్రాంతి సంబరాల్లోకి ఆహ్వానించే తొలి రోజు భోగి. పాత వస్తువుల్ని భోగి మంటల్లో ఆహుతి చేసి.. కొత్త దుస్తులు, వస్తువులతో నిత్యనూతనంగా సుఖ, సంతోషాలతో జీవించడమే కాదు.. ఆధ్యాత్మిక చింతనతో పాటు లౌకిక జీవన విధానాన్ని అనుసరించడమే భోగి పండుగ విశిష్టత.
సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది.. ఉత్తరాయణ పుణ్యకాలంలో జరుగుతుంది కాబట్టి.. ఈ సమయంలో స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయన్నది పురాణాల కథనం. అందుకోసమే.. సజీవ చైతన్య క్రాంతి.. మకర సంక్రాంతి అని అంటుంటారు. ఈ రోజున.. పూజలు, కొత్త ధాన్యంతో చేసిన పాయసం, పిండివంటల్ని దేవతలకు సమర్పించడం, పితృదేవతల్ని పూజించడం.. తెలుగింటి సాంప్రదాయం. పశువుల్ని గౌరవించడం, వాటిని అందంగా అలంకరించడంతో పాటు.. వారివారి ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తారు. దీంతో కనుమ ముగుస్తుంది.
మొత్తంగా సంక్రాంతి పండుగను ఆశ్వాదించాలంటే.. తల్లిలాంటి పల్లెలకు పోవాల్సిందే. ఆత్మీయతలూ, అనురాగాలకు నిలువెత్తు నిదర్శనం ఈ సంక్రాంతి.