YS Jagan Mohan Reddy: తమ ప్రభుత్వ హయాంలో వివిధ రంగాలలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరిగిందని చెబుతూ వైసీపీ అధినేత జగన్, ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ రంగంలోనే దాదాపు 6.31 లక్షల ఉద్యోగాలు సృష్టించినట్లు పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతను అధిగమిస్తూ 17,000 మందిని, పాఠశాల విద్యలో 1998, 2008 డీఎస్సీల సమస్యలను పరిష్కరిస్తూ కొత్తగా 10,300 పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. వీటికి అదనంగా, 2.66 లక్షల మంది వాలంటీర్లు, ఆప్కాస్‌లో లక్ష మంది, బ్రేవరేజెస్ కార్పొరేషన్‌లో 18,000, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లలో 20,000 మందిని కలిపి ఈ గణాంకాలను జగన్ ప్రస్తావించారు.
ఉద్యోగాలకు మూలమైన ఎంఎస్ఎంఈ రంగానికి చంద్రబాబు నాయుడు హయాంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలు, ఇన్సెంటివ్‌లను తమ ప్రభుత్వం విడుదల చేసిందని, ఆ నమ్మకంతో 4.78 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు గ్రౌండ్ అయ్యాయని, వాటి ద్వారా 33 లక్షల ఉద్యోగాలు వచ్చాయని జగన్పేర్కొన్నారు. పెద్ద కంపెనీలతో పోలిస్తే ఎంఎస్ఎంఈలే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తాయని అభిప్రాయపడ్డారు. లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్‌లో మరో లక్ష ఉద్యోగాలు కలిపి, మొత్తం 40.13 లక్షల ఉద్యోగాలు సృష్టించినట్లు సోషియో-ఎకనామిక్ సర్వే రిపోర్టులే వెల్లడించాయన్నారు జగన్.
వ్యవసాయాన్ని దండగ అన్నవారికి భిన్నంగా, తమ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగగా మార్చిందని, 62% జనాభాకు ఉపాధినిచ్చే రంగానికి విత్తనం నుంచి విపత్తు సహాయం వరకు అండగా నిలిచినట్లు తెలిపారు. కోవిడ్ ఉన్నా ఐదేళ్లలో రామయ్యపట్నం, మచిలీపట్నం, మూలపేట సహా నాలుగు కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టినట్లు జగన్ వివరించారు.
డేటా సెంటర్ విషయంలో, సింగపూర్ నుండి విశాఖపట్నంకు కేబుల్ తెచ్చి, 300 మెగావాట్ల డేటా సెంటర్‌కు YSRCP ప్రభుత్వమే శంకుస్థాపన చేసిందని, దీనిపై చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘‘గూగుల్ విషయంలో చంద్రబాబు మన క్రెడిట్ చోరీ చేశాడు. చంద్రబాబు చేసిందేం లేదు. ఆ రోజు మనం ప్రయత్నం చేశాం కాబట్టి, గూగుల్ ఇప్పుడు ఏపీకి వచ్చింది. బాబు హాయంలో ఒక్క మెడికల్ కాలేజీ రాలేదు. స్కామ్ లకు పాల్పడుతూ మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు. వైసీపీ 17 మెడికల్ కాలేజీలు తెచ్చాం.’’ అని జగన్ అన్నారు.