Idli Chaat: ప్రతి తెలుగు ఇళ్లల్లో వారంలో నాలుగు రోజులు ఇడ్లీయే తింటారు. ముఖ్యంగా ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఇడ్లీ తినే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవారైనా కూడా ఇడ్డీని తినవచ్చు. అయితే అప్పుడప్పుడు ఇడ్లీ మిగిలిపోవడం జరుగుతుంది. అప్పుడు వాటిని ఏం చేయాలో తెలియక మధ్యాహ్న భోజనంలో లేదా రాత్రి భోజనంలో తింటూ ఉంటారు. ఇడ్లీ మిగిలిపోయినప్పుడు తనతో ఎంచక్కా సాయంత్రానికి ఇడ్లీ చాట్ చేసేయండి. స్నాక్ గా ఉపయోగపడుతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. పిల్లలు దీన్ని ఇష్టంగా తింటారు.
ఇడ్లీ చాట్ చేయడానికి కావలసిన పదార్థాలు
ఇడ్లీలు – నాలుగు
అల్లం తరుగు – అర స్పూను
టమోటో కెచప్ – ఒక స్పూను
జీలకర్ర పొడి – అర స్పూను
చాట్ మసాలా – అర స్పూన్
నిమ్మరసం – ఒక స్పూన్
కొత్తిమీర తరుగు – ఒక స్పూను
పచ్చిమిర్చి – నాలుగు
టమోటో తరుగు – మూడు స్పూన్లు
పల్లీలు – గుప్పెడు
ఉప్పు – రుచికి సరిపడా
ఆయిల్ – ఒక స్పూను
మైదాపిండి – ఒక స్పూను
పెరుగు – అర కప్పు
ఇడ్లీ చాట్ రెసిపీ
1. ఇడ్లీలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కలను ఒక గిన్నెలో వేసి ఒక స్పూన్ మైదాపిండిని చల్లి వాటిని కలుపుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేయాలి. ఆ నూనె వేడెక్కాక అందులో ఇడ్లీ మొక్కలను వేసి లేత గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద మరో కళాయిని పెట్టి అందులో ఒక స్పూను ఆయిల్ వేయాలి. అందులో వేరుశెనగ పలుకులు వేసి వేయించాలి. అవి రెండుగా విడిపోయే వరకు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
4. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులో అరకప్పు చల్లటి పెరుగును వేయండి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి కలపండి. అది క్రీమ్ లాగా కలుపుకోవాలి.
5. ఇప్పుడు ఒక ప్లేట్లో వేయించిన ఇడ్లీ ముక్కలను వేసి వాటిపై కలుపుకున్న పెరుగును వేసుకోవాలి.
6. ఆ పెరుగు మీద వేయించిన పల్లీలు, టమోటో తరుగు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, అల్లం తరుగు, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. అంతే టేస్టీ ఇడ్లీ చాట్ రెడీ అయినట్టే.
సాయంత్రం స్కూల్ నుంచి వచ్చే పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఉదయం మిగిలిపోయిన ఇడ్లీలను భద్రంగా దాచి వాటితో సాయంత్రం పూట ఇలా ఇడ్లీ చాట్ చేసి పెట్టండి. వాళ్ళు ఇష్టంగా తింటారు. పైగా ఇది కొత్తగా ఉంటుంది. బయట దొరికే చాట్ లతో పోలిస్తే మీరు ఇంట్లోనే దీన్ని శుచిగా, శుభ్రంగా చేసి పిల్లలకు పెట్టవచ్చు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలను కూడా జోడించాము. కాబట్టి వారికి శక్తి కూడా అందుతుంది.