Hyderabad Metro: పాతబస్తీలో మెట్రో నిర్మాణ పనులపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు.. గురువారం కీలక విచారణ జరిపింది. ఈ పిటిషన్‌ను ఆల్ పబ్లిక్ వెల్ఫేర్ ఫోరం (APWF) సంస్థ తరఫున దాఖలు చేశారు. పాతబస్తీ పరిధిలో జరుగుతున్న మెట్రో నిర్మాణం చారిత్రక కట్టడాలపై ప్రభావం చూపుతోందని, పురావస్తు శాఖ అనుమతులు లేకుండా పనులు కొనసాగుతున్నాయని పిటీషనర్ న్యాయవాది వాదించారు.
పిటీషనర్ న్యాయవాది కోర్టుకు సమర్పించిన వాదనలో, చారిత్రక కట్టడాలకు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి భారీ నిర్మాణాలు చేపట్టరాదనే కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్‌ను గుర్తుచేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ మెట్రో పనులు కొనసాగుతున్నాయని, ఫలితంగా చార్మినార్, మక్కా మసీదు, కాలి కట్టా, బాద్షాహీ ఆశూర్ ఖానా వంటి పాతబస్తీ వారసత్వ నిర్మాణాలు ప్రమాదంలో ఉన్నాయని పేర్కొన్నారు.
అయితే ప్రభుత్వం తరపున వాదించిన అదనపు అటార్నీ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్ ఖాన్ ఈ ఆరోపణలను ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. పాతబస్తీ మెట్రో నిర్మాణంలో చారిత్రక కట్టడాల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. పురావస్తు శాఖతో సమన్వయం చేసుకుంటూ అన్ని సాంకేతిక జాగ్రత్తలతోనే పనులు కొనసాగుతున్నాయి అన్నారు.
అలాగే, పాతబస్తీ అభివృద్ధి కోసం మెట్రో కీలక మౌలిక వసతిగా నిలుస్తుందని, ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి ఇది తప్పనిసరి ప్రాజెక్ట్ అని తెలిపారు.
విచారణ సందర్భంగా హైకోర్టు బెంచ్ ఏఏజీని ప్రశ్నిస్తూ.. రెండో దశ మెట్రో నిర్మాణం ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు అని చెప్పారు. ఈ రూట్‌లో ఎన్ని చారిత్రక కట్టడాలు వస్తాయి? వాటి భద్రత కోసం ప్రభుత్వం ఏ జాగ్రత్తలు తీసుకుంది? అని అడిగింది.
దీనిపై ఏఏజీ సమాధానంగా.. ప్రతీ కట్టడానికి సురక్షిత దూరం పాటిస్తూ డిజైన్ రూపొందించాం. సాంకేతిక నిపుణులు, పురావస్తు శాఖ ప్రతినిధుల సలహాలతో పని జరుగుతోంది అని తెలిపారు.
కోర్టు ప్రభుత్వం సమర్పించే నివేదిక, మ్యాప్‌లు, పురావస్తు శాఖ నుంచి వచ్చే అభిప్రాయాలను పరిశీలించాల్సి ఉందని పేర్కొంటూ, తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.
Also Read: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్.. సీఎం రేవంత్ కీలక సమావేశం
హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పూర్తి నివేదిక సమర్పించిన తర్వాతే పాతబస్తీ మెట్రో నిర్మాణం భవితవ్యంపై స్పష్టత రానుంది. అభివృద్ధి, వారసత్వ సంరక్షణ మధ్య సమతుల్యత సాధించడం ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.