Vastu Tips: మన నివాస స్థలంలోని శక్తి మన ఆర్థిక స్థితిగతులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ప్రతి దిశకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడం, అనవసర ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వాస్తు అనేది కేవలం ఇల్లు కట్టేటప్పుడు చూసేది మాత్రమే కాదు. ఇప్పటికే ఉన్న ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా కూడా సానుకూల ఫలితాలను పొందవచ్చు. ఆర్థిక స్థిరత్వం, సంపద ప్రవాహాన్ని పెంచే 5 శక్తివంతమైన వాస్తు చిట్కాలను గురించి తెలుసుకుందాం.
ఆర్థిక స్థిరత్వం కోసం 5 ముఖ్యమైన వాస్తు పరిష్కారాలు:
వాస్తు శాస్త్రంలో.. కుబేరుడు సంపదకు అధిపతి. ఆయన నివసించే ఉత్తర దిశను, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే ఈశాన్య దిశను సరిగ్గా ఉంచుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆ 5 మార్పులు ఇవే..
1. ఉత్తర దిశను ఖాళీగా, శుభ్రంగా ఉంచండి:
వాస్తు ప్రకారం.. ఉత్తర దిశ ‘కుబేర స్థానం’. ఈ దిశలో భారీ వస్తువులు, పాత సామాన్లు లేదా చెత్తను అస్సలు ఉంచకూడదు. ఈ ప్రదేశం ఎంత ఖాళీగా.. వెలుతురుతో ఉంటే అంతగా సంపద మీ ఇంటికి ఆకర్షించబడుతుంది. ఇక్కడ ఒక నీటి ఫౌంటెన్ లేదా నీటితో నిండిన గిన్నెలో పువ్వులు ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది.
2. ప్రధాన ద్వారం అలంకరణ :
ఇంటి ప్రధాన ద్వారం ద్వారానే లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని నమ్ముతారు. అందుకే సింహద్వారం ఎప్పుడూ శుభ్రంగా.. అందంగా ఉండాలి. గుమ్మానికి స్వస్తిక చిహ్నం లేదా ‘ఓం’ గుర్తును ఉంచండి. సాయంత్రం వేళ గుమ్మం వద్ద దీపం వెలిగించడం వల్ల ప్రతికూల శక్తులు తొలగి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తలుపులు తీసేటప్పుడు లేదా వేసేటప్పుడు శబ్దం రాకుండా చూసుకోవాలి.
3. ఉత్తర దిశలో కుబేర యంత్రం లేదా మనీ ప్లాంట్:
ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవారు ఇంటి ఉత్తర గోడకు ‘కుబేర యంత్రం’ తగిలించడం మంచిది. అలాగే.. నీలం రంగు కుండీలో ‘మనీ ప్లాంట్’ను ఉత్తర దిశలో పెంచడం వల్ల కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. అయితే.. ఎండిపోయిన మొక్కలను వెంటనే తీసివేయాలి. ఎందుకంటే అవి ఆర్థిక నష్టానికి సంకేతం.
4. లాకర్ లేదా బీరువా దిశ :
మీరు డబ్బు దాచుకునే బీరువా లేదా లాకర్ ఎప్పుడూ ఇంటికి ‘నైరుతి’ మూలలో ఉండాలి. అది తెరిచినప్పుడు దాని ముఖం ‘ఉత్తర’ దిశ వైపు ఉండాలి. ఉత్తరం కుబేరుడి దిశ కాబట్టి.. బీరువా అటువైపు తెరుచుకుంటే డబ్బు నిరంతరం వస్తూనే ఉంటుంది. బీరువా ముందు ఒక అద్దాన్ని అమర్చడం వల్ల (డబ్బు ప్రతిబింబించేలా) సంపద రెట్టింపు అవుతుందని వాస్తు చెబుతోంది.
Also Read: మీ పోరాటంలో.. శివుడు తోడున్నారని తెలిపే 5 సంకేతాలు ఇవే !
5. నీటి లీకేజీని అరికట్టండి:
చాలామంది గమనించని ముఖ్యమైన విషయం ‘నీటి వృధా’. ఇంట్లోని కుళాయిల నుంచి నీరు లీక్ అవుతూ ఉంటే.. అది ఆర్థిక వనరులు కరిగిపోవడానికి సంకేతం. నీరు ఎలాగైతే అనవసరంగా పోతుందో.. డబ్బు కూడా అలాగే వృధా ఖర్చుల రూపంలో పోతుంది. కాబట్టి.. వెంటనే లీకేజీలను అరికట్టాలి. అలాగే.. వంటగదిలో మంట (అగ్ని) , నీరు పక్కపక్కనే ఉండకుండా జాగ్రత్త పడాలి.