 
					బ్రహ్మ ముహూర్తం.. హిందూమత ఆచారాల ప్రకారం ఎంతో పవిత్రమైనది. ఆ సమయంలో మేల్కొంటే శరీరంలో సానుకూల శక్తి ప్రవహిస్తుందని చెబుతారు. ఆ రోజంతా మీరు ఆరోగ్యంగా ఉంటారని అంటారు. బ్రహ్మ ముహూర్తం అన్నది ఆధ్యాత్మికంగా ఎంతో గొప్ప విశిష్టతను కలిగి ఉంది. ఇది మనసును శుద్ధి చేస్తుందని అంటారు. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి బ్రహ్మ ముహూర్తమే ఉత్తమమైనదని అంటారు. అయితే బ్రహ్మ ముహూర్తంలో చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయడం నిషేధం. బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి 5 గంటల మధ్య సమయంగా చెప్పుకుంటారు.
అబద్ధం చెప్పకండి 
బ్రహ్మ ముహూర్తం పవిత్రమైన సమయం అని ముందే చెప్పుకున్నాం. కాబట్టి పొరపాటున కూడా ఆ సమయంలో ఎవరితోనూ అబద్ధం చెప్పకండి. అలా చేస్తే దేవతలు మీపై కోపగించుకుంటారు. మీ గ్రహాలు కూడా బలహీనంగా మారుతాయి. దీనివల్ల జీవితంలో కష్టాలు పెరుగుతాయి. మీ రోజున అబద్ధంతో ప్రారంభించడం అనేది చాలా పెద్ద తప్పుగా మారిపోతుంది.
చెడుగా మాట్లాడకండి
బ్రహ్మ ముహూర్త సమయంలో రోజును కొత్తగా ప్రారంభిస్తే విజయవంతం అవుతుంది. ఆ సమయంలో ఎవరి గురించి కూడా ప్రతికూల భావాలను పెట్టుకోకండి. ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. ఇది మీ జీవితానికి హానికరంగా మారుతుంది. ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు, మాటలు ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు.
లైంగిక సంబంధాలు వద్దు 
బ్రహ్మ ముహూర్త సమయంలోనే దేవతలు అందరూ మేల్కొంటారు. ప్రపంచమంతా సానుకూల వాతావరణం వ్యాపిస్తుంటుంది. ఇది ప్రార్థనా, పూజలకు అనువైన సమయం. కాబట్టి బ్రహ్మ ముహూర్త సమయంలో లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలి. బ్రహ్మ ముహూర్తంలో శారీరక సంబంధాలు కలిగి ఉండడం చాలా అశుభంగా పరిగణిస్తారు. దీనివల్ల ఇంట్లో వాస్తు లోపాలు వస్తాయి. ఆర్థిక నష్టాలు కూడా ఏర్పడవచ్చు. ముఖ్యంగా మీ జాతకంలో శుక్రుడు బలహీనపడతాడు. మీ ప్రేమ జీవితంలో ప్రేమ లోపిస్తుంది. ఆ జంటలు జీవితంలో ఆనందాన్ని కోల్పోతారు.
ఆ సమయంలో తినవద్దు 
ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచిన వెంటనే ఎంతో మందికి తినే అలవాటు ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రహ్మ ముహూర్త సమయంలో టీ కూడా తాగకూడదు. ఇది ఆరోగ్యానికి ఎంతో చెడు చేస్తుంది. బ్రహ్మ ముహూర్త సమయంలో తినడం అనేది మతపరంగా చూస్తే అశుభకరం. ఆ సమయంలో తింటే ఇంట్లో ప్రతికూలత వ్యాపించే అవకాశం ఉంది. అలాగే అనారోగ్యం పాలు కూడా కావచ్చు.
చెడుగా ప్రవర్తించకండి 
బ్రహ్మ ముహూర్తం అనేది ఎంతో శుభప్రదమైన సమయం. ఆ సమయంలో మీరు సానుకూలతతో ఉండాలి. ఆ ముహూర్తంలో ఎవరితోనూ మీరు చెడుగా ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తే ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. బ్రహ్మ ముహూర్తం లో ఎవరిని అగౌరపరచినట్టు మాట్లాడకూడదు. ఇది మీ పనిలో ఆటంకాలను కలిగిస్తుంది. మీ పని ముందుకు సాగనివ్వకుండా అడ్డుకుంటుంది.