Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆలయ దర్శనం ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా.. ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్న స్కూటీపై లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళా డ్యాన్సర్ అక్కడికక్కడే మృతిచెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలంలోని ములుగులూరు గ్రామం సమీపంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
సమాచారం ప్రకారం.. ఒడిశాకు చెందిన నిషా అనే యువతి గత కొంతకాలంగా నర్సరావుపేటలో.. ప్రైవేట్ సాంస్కృతిక బృందంలో డ్యాన్సర్‌గా పనిచేస్తోంది. ఆమెతో పాటు మరో మహిళా సహచరురాలు స్థానిక ఆలయానికి దర్శనానికి వెళ్లారు. ఆలయ దర్శనం పూర్తిచేసుకుని తిరిగి నర్సరావుపేట వైపు స్కూటీపై వస్తుండగా, ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ స్కూటీని ఢీకొట్టింది.
దీంతో నిషా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడినుంచి పారిపోయాడు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని లారీని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
మృతురాలు నిషా ఒడిశా రాష్ట్రానికి చెందిన యువతి అని పోలీసులు గుర్తించారు. ఆమె గత మూడు సంవత్సరాలుగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, వివిధ డ్యాన్స్ ఈవెంట్లలో ప్రదర్శనలు ఇస్తూ జీవనోపాధి పొందుతున్నట్లు సమాచారం. ఇటీవల నర్సరావుపేటలోని ఒక ప్రైవేట్ సంస్థలో డ్యాన్సర్‌గా చేరి అక్కడే నివాసముంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రమాదంలో గాయపడిన మరో మహిళను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే ములుగులూరు – నర్సరావుపేట ప్రధాన రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మృతురాలు నిషా కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ వార్త విని తల్లిదండ్రులు, బంధువులు షాక్‌కు గురయ్యారు.
నర్సరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను గుర్తించడానికి ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అతివేగమా లేక మరేదైనా కుట్రకోణం ఉందా అన్నా కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.