Karthika Masam 2025: కార్తీక మాసం హిందూ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఈ పవిత్ర మాసంలో చేసే స్నానాలు, దీపారాధనలు, పూజలు ఎంత ముఖ్యమో, దానధర్మాలు చేయడం కూడా అంతే విశేషమైన ఫలితాలను ఇస్తుంది. పురాణాల ప్రకారం.. కార్తీక మాసంలో చేసిన దానాలు అనంతమైన పుణ్యాన్ని, సకల శుభాలను చేకూరుస్తాయి.
కార్తీక మాసంలో దానం చేయడం వల్ల కలిగే ప్రాముఖ్యత:
కార్తీక మాసం ధార్మిక కార్యక్రమాలకు, దాన ధర్మాలకు అనుకూలమైన కాలం. ఈ మాసంలో చేసే దానాలు ఇతర మాసాల్లో చేసే దానాల కంటే.. వేల రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దానం అనేది మనలోని అజ్ఞానాన్ని తొలగించి.. జ్ఞానాన్ని ప్రసాదించడానికి, పాపాలను నశింపజేయడానికి ఒక గొప్ప మార్గంగా భావిస్తారు. ఈ మానంలో శక్తి కొద్ది, మనస్ఫూర్తిగా చేసిన ఏ చిన్న సహాయమైనా గొప్ప పుణ్యఫలాన్ని ఇస్తుంది.
ఏ దానాలు చేస్తే మంచిది ?
కార్తీక మాసంలో అనేక రకాల దానాలు చేయవచ్చు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి..
1. దీప దానం:
కార్తీక మాసంలో దీప దానం అత్యంత విశిష్టమైనది. దీనినే షోడశ దానాలలో ఒకటిగా చెబుతారు.
ఫలితం: దీప దానం చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. అంతే కాకుండా పాపాలు తొలగిపోతాయి. ఆరోగ్యం, సంపద, అదృష్టం లభిస్తాయి. శివాలయాలలో లేదా విష్ణు ఆలయాలలో నెయ్యి దీపాలను దానం చేయడం చాలా మంచిది.
కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు (ఐదు రోజులు) దీప దానం చేయడం మరింత శ్రేయస్కరం.
2. అన్న దానం (ఆహార దానం):
“అన్నదానం పరమదానం” అని హిందూ ధర్మంలో గొప్పగా చెబుతారు. ఈ మాసంలో అన్నదానం చేయడం వల్ల పేదరికం తొలగి, కుటుంబానికి నిత్యం ఆహార పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి
ఫలి తం: ముఖ్యంగా కార్తీక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) నాడు పెరుగన్నం దానం చేస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభిస్తుంది. ధాన్యాలు (ఏడు రకాల ధాన్యాలు) దానం చేయడం వల్ల ఏడు జన్మల పాటు ఆనందం, సంపద లభిస్తాయని నమ్మకం.
3. ఉసిరికాయ దానం:
ఉసిరికాయ శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైనది. ఉసిరితో పాటు దీపాన్ని దానం చేయడం చాలా మంచిది.
ఫలితం: ఉసిరికాయలు దానం చేయడం వల్ల మతిమరుపు పోయి.. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
4. వస్త్ర దానం:
చలికాలం ప్రారంభమయ్యే.. ఈ మాసంలో పేదలకు వస్త్రాలు (ముఖ్యంగా దుప్పట్లు, కంబళ్ళు) దానం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
5. స్వయం పాకం దానం:
ఒక మనిషి ఒక పూట భోజనం వండుకోవడానికి సరిపోయే బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు వంటి ఆహార పదార్థాలను దానం చేయడాన్ని స్వయం పాకం అంటారు.
ఫలితం: ఇది శుభాన్ని కలిగిస్తుంది.
6. పాలు, నెయ్యి, పెరుగు దానం:
పాలు దానం చేస్తే నిద్రలేమి సమస్యలు తొలగిపోతాయి.
నెయ్యి దానం చేస్తే రోగాలు నశించి, ఆరోగ్యం సిద్ధిస్తుంది.
పెరుగు దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.
7. పండ్ల దానం:
పండ్లను దానం చేయడం వల్ల బుద్ధి, సిద్ధి కలుగుతాయి.
Also Read: కార్తీక సోమవారం సాయంత్రం ఇలా పూజ చేస్తే.. విద్య, ఉద్యోగాల్లో తిరుగుండదు !
8. సుమంగళి దానం:
వివాహిత స్త్రీలు పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్లు, చీరలు వంటి వాటిని దానం చేయడం వల్ల భర్త ఆయుష్షు పెరుగుతుందని.. అంతే కాకుండా, వైవాహిక జీవితం సుఖంగా ఉంటుందని నమ్ముతారు.
దానం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
దానం చేసేటప్పుడు ముఖ్యంగా దానాన్ని పాత్రులైన వారికి ఇవ్వాలి. ఎవరికి దానం చేస్తున్నామో వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని, శ్రద్ధతో, మనస్ఫూర్తిగా దానం చేయాలి. దానం చేసిన తర్వాత ఎప్పుడూ ప్రచారం చేసుకోకూడదు. ఈ విధంగా కార్తీక మాసంలో మన శక్తికి అనుగుణంగా దానధర్మాలు చేయడం ద్వారా ఆ పరమేశ్వరుడి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొంది.. జీవితంలో సుఖసంతోషాలను, మోక్షాన్ని పొందవచ్చు.