Sankranti 2026: సంక్రాంతి పండగ కేవలం వినోదాలకు మాత్రమే కాదు, భారతీయ సంస్కృతిలో ‘దాన ధర్మాలకు’ కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పుణ్యకాలంలో చేసే దానం అత్యంత ఫలప్రదమని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున ఏ వస్తువులు దానం చేస్తే పుణ్యం లభిస్తుందో, ఏ దోషాలు తొలగిపోతాయో వివరంగా తెలుసుకుందాం.
సంక్రాంతి దాన విశిష్టత:
దానం చేయడం వల్ల మనలోని అహంకారం తగ్గి, దైవచింతన పెరుగుతుంది. ముఖ్యంగా సంక్రాంతి నాడు చేసే దానం మరుసటి జన్మలో కూడా సత్ఫలితాలను ఇస్తుందని భక్తుల నమ్మకం. ఈ రోజున చేసే దానాన్ని ‘మకర సంక్రమణ దానం’ అని అంటారు.
ఏ వస్తువులు దానం చేయాలి ?
1. నువ్వుల దానం: సంక్రాంతికి నువ్వులకు విడదీయలేని సంబంధం ఉంది. శని దోష నివారణకు నువ్వుల దానం శ్రేష్ఠం. నువ్వులు ,బెల్లం కలిపి దానం చేయడం వల్ల జాతకంలోని గ్రహ దోషాలు తొలగిపోయి, కుటుంబంలో సుఖ శాంతులు చేకూరుతాయి. నువ్వులను దానం చేయడం అంటే మనలోని పాపాలను వదిలించుకోవడమేనని పెద్దల మాట.
2. వస్త్ర దానం : చలికాలంలో వచ్చే ఈ పండగ నాడు పేదలకు లేదా బ్రాహ్మణులకు బట్టలు దానం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా దుప్పట్లు, ఉన్ని వస్త్రాలు దానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆయుష్షు పెరుగుతుందని శాస్త్రం చెబుతోంది.
3. అన్నదానం లేదా ధాన్యం దానం: సంక్రాంతి పంటల పండగ కాబట్టి, కొత్త బియ్యం, కందిపప్పు, నెయ్యి, కూరగాయలు కలిపి ‘స్వయంపాకం’గా దానం చేయడం అత్యంత పుణ్యప్రదం. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం వల్ల అన్నపూర్ణా దేవి అనుగ్రహం లభిస్తుంది.
4. బెల్లం, చెరకు: మకర సంక్రాంతి నాడు బెల్లం దానం చేయడం వల్ల సూర్య భగవానుని అనుగ్రహం లభిస్తుంది. ఇది జాతకంలో సూర్యుని స్థానాన్ని బలపరుస్తుంది. అలాగే చెరకు గడలను దానం చేయడం వల్ల జీవితంలో తీపి (మధురమైన క్షణాలు) పెరుగుతుందని నమ్ముతారు.
5. భూమి లేదా గోదానం: శక్తి ఉన్నవారు ఈ పవిత్ర రోజున గోదానం (ఆవును దానం చేయడం) చేయడం వల్ల పితృదేవతలకు మోక్షం లభిస్తుందని నమ్మకం. గోవుకు గ్రాసం (గడ్డి) తినిపించినా కూడా కోటి పుణ్యాలతో సమానం.
6. పండ్లు, కూరగాయలు: కాలానుగుణంగా దొరికే గుమ్మడికాయ, చిలగడదుంపలు, రేగు పండ్లు దానం చేయడం వల్ల సంతాన ప్రాప్తి ,వంశాభివృద్ధి కలుగుతుందని చెబుతారు.
Also Read: మీకు తెలియని సంక్రాంతి రహస్యం.. హరిదాసులు, గంగిరెద్దుల వెనక ఉన్న అసలు కథ !
ఎవరికి దానం చేయాలి ?
దానం ఎప్పుడూ అర్హులైన వారికి చేయాలి. పేదవారు, అనాథలు, వృద్ధాశ్రమాలు లేదా ఆలయాల్లో ఉండే భక్తులకు మీ శక్తి మేరకు సహాయం చేయవచ్చు. సంక్రాంతి రోజున మన ఇంటి ముందుకు వచ్చే హరిదాసులు, గంగిరెద్దుల వారికి కూడా తోచిన దానం చేయడం మన సంప్రదాయం.
దానం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి:
దానం ఎప్పుడూ స్వచ్ఛమైన మనసుతో, ఎటువంటి గర్వం లేకుండా చేయాలి.
ఎదుటివారికి ఉపయోగపడే వస్తువులనే దానం చేయాలి.
దానం ఇచ్చేటప్పుడు సూర్య భగవానుని స్మరించుకోవడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుంది.