Secret Temples in Srisailam: శ్రీశైలంలో ఎవ్వరికీ తెలియని ఎన్నో రహస్య ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల్లో ఇప్పటికీ మునులు, రుషులు గుప్త రూపంలో వచ్చి పూజలు, జపాలు, తపస్సులు చేస్తుంటారట. అయితే శ్రీశైలంలోని ఎవ్వరికీ తెలియని కొన్ని రహస్య ఆలయాల గురించి ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
శివశక్తుల సంగమం శ్రీశైలం. దేశంలో ఎక్కడా లేని శక్తిపీఠం, జ్యోతిర్లింగం కలిసి ఉన్న ఏకైక పుణ్యక్షేంత్రం శ్రీశైలం. అయితే శ్రీశైలం అంటే కేవలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవి ఆలయాలే కాదు, నల్లమల అడవుల మధ్య ఎన్నో రహస్యమైన మరియు అంతగా ప్రాచుర్యం లేని పురాతన ఆలయాలు, గుహలు ఉన్నాయి. భక్తులకు మరియు సాహస యాత్రికులకు ఆసక్తి కలిగించే కొన్ని ముఖ్యమైన ఆలయాలు.. ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇష్టకామేశ్వరి దేవి ఆలయం (Ishtakameswari Devi Temple): ఇది శ్రీశైలంలో అత్యంత రహస్యమైన మరియు శక్తివంతమైన ఆలయంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి విగ్రహం శిల (రాయి) అయినప్పటికీ, తాకితే మాత్రం మానవ శరీరంలా అనుభూతి వస్తుందట. ఈ ఆలయం శ్రీశైలం నుండి సుమారు 20 కి.మీ. దూరంలో దట్టమైన అడవిలో ఉంది. ఇక్కడికి వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం లేదు, కేవలం అటవీ శాఖ అనుమతితో ప్రత్యేక జీపుల్లో మాత్రమే వెళ్లాలి.
అక్కమహాదేవి గుహలు: కష్టానదిలో బోటు ప్రయాణం చేసి ఈ గుహలు చేరుకోవాలి. ఇక్కడ సహజ సిద్దంగా ఏర్పడిన శివలింగం ఉంటుంది. ఈ గుహలకు చేరుకోవడం అంత ఈజీ కాదు. 12వ శతాబ్దానికి చెందిన కన్నడ కవయిత్రి అక్కమహాదేవి ఇక్కడ తపస్సు చేశారని చరిత్ర చెబుతోంది. ఈ గుహలు చాలా లోతుగా, చీకటిగా ఉంటాయి.
కదళీవనం, దత్త పాదుకలు: ఇది దట్టమైన నల్లమల్ల అడవిలో ఉన్న ఒక పవిత్ర ప్రదేశం. అక్క మహాదేవి గుహల నుంచి ఇంకా అడవిలోకి వెళ్లాలి. ఇక్కడ దత్తాత్రేయ కలియుగ రెండో అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు తపస్సు చేసి అవతారం చాలించారని దత్త భక్తులు నమ్ముతుంటారు. ఇక్కడికి వెళ్లడం చాలా కష్టతరమైన ప్రయాణం..అక్కడ ఇప్పటికీ సిద్ధులు, యోగులు తపస్సు చేస్తారని స్థానికుల చెప్తుంటారు.
హటకేశ్వరం, పాలదార, పంచదార: శ్రీశైలంలోని ప్రధాన ఆలయానికి సమీపంలో ఉంటాయి ఈ హకేశ్వరం, పాలదార, పంచదార. అయితే వీటి వెనక ఒక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. శివుడు ఒక కుమ్మరి భక్తుడి కోసం కుండలో (అటికలో) ప్రత్యక్షమైన ప్రదేశమే హటకేశ్వరమని.. ఆదిశంకరాచార్యుల వారు తపస్సు చేసిన ప్రాంతమే పాలదార, పంచదార అంటారు. ఇక్కడే ఆదిశంకరాచార్యుల వారు శివానందలహరి రచించారని చెప్తారు. ఇక్కడి కొండపై నుంచి ఐదు దారలుగా నీరు పడుతుంది.
ఇతర ఆలయాలు: శ్రీశైలంలో ఇప్పటికీ ఎవ్వరికీ కనిపించకుండా గుప్తంగా మరికొన్ని ఆలయాలు ఉన్నాయి. వాటిలో రుద్రకోటి ఒకటి. నల్లమల్ల అడవిలో ఉన్న ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో శివలింగాలు ఉన్నాయని చెబుతారు. ఇక్కడికి చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని అంటారు. ఇక రెడోది గుప్త మల్లికార్జున గుడి. ఇది కూడా అడవి మార్గంలో ఉండే ఒక ప్రాచీన శివలింగం. ఇక్కడికి చేరుకోవడం కూడా చాలా కష్టమట. ఈ ప్రదేశాలు అన్ని చాలా వరకు దట్టమైన పులుల సంరక్షణ కేంద్రం (Tiger Reserve) పరిధిలో ఉన్నాయి. కాబట్టి అటవీ శాఖ అనుమతులు మరియు సమయాలను (సాధారణంగా ఉదయం 7 నుండి సాయంత్రం 4 వరకు) గమనించి వెళ్లాల్సి ఉంటుంది.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.