Navratri 2025: దేవి నవరాత్రులను దేశవ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసం శుక్ల పక్షం పాడ్యమి నుంచి నవమి వరకు దేవి నవరాత్రులను జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని వివిధ రూపాలలో పూజిస్తారు. అయితే ఈ ఏడాది శరద్ నవరాత్రి వేడుకలు సెప్టెంబర్ 22న ప్రారంభమై.. అక్టోబర్ 2వ వరకు కొనసాగుతాయి. దేవి నవరాత్రుల ప్రాముఖ్యతతో పాటు మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నవరాత్రి ప్రాముఖ్యత:
నవరాత్రి పండుగకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం. ఈ విజయం అహంకారం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. రెండవది.. శ్రీరాముడు రావణుడిని సంహరించడానికి ముందు దుర్గాదేవిని పూజించి, ఆ తర్వాత విజయం సాధించినందుకు ప్రతీకగా కూడా ఈ పండుగను జరుపుకుంటారు. అందుకే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించి, పదవ రోజున రావణ దహనం చేస్తారు. ఈ పండుగ శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని పూజించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి, శుభాలను పొందడానికి సహాయపడుతుందని భక్తులు విశ్వసిస్తారు.
నవరాత్రి రోజువారీ పూజలు:
ఈ పండుగలో భాగంగా భక్తులు వివిధ రకాల పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
కలశ స్థాపన: మొదటి రోజున కలశ స్థాపన చేస్తారు. ఇది ఇంటిని శుద్ధి చేసి.. పవిత్రమైన వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది.
ఉపవాసం: చాలా మంది భక్తులు తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉంటారు. కేవలం పాలు, పండ్లు లేదా ప్రత్యేక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు.
దేవి పూజ: ప్రతి రోజు ఉదయం, సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహిస్తారు.
కన్యా పూజ: అష్టమి లేదా నవమి రోజున 9 మంది బాలికలను ఇంటికి ఆహ్వానించి.. వారిని దుర్గాదేవి రూపాలుగా భావించి పూజిస్తారు. వారికి కొత్త దుస్తులు, ప్రసాదాలు, కానుకలు సమర్పిస్తారు.
పూజ: ఆయుధ పూజ లేదా సరస్వతి పూజగా పిలువబడే ఈ రోజున పుస్తకాలు, ఆయుధాలు, సంగీత పరికరాలు, వృత్తికి సంబంధించిన వస్తువులను పూజిస్తారు.
దేవి నవరాత్రి అనేది భక్తి, శ్రద్ధ, సాంస్కృతిక ప్రాముఖ్యతతో కూడిన పండుగ. ఈ పండుగ ప్రజలలో ఆధ్యాత్మిక భావాన్ని, ఐక్యతను పెంచుతుంది. ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేస్తూ, భక్తులకు నమ్మకం, ధైర్యం, ఆనందాన్ని ఇస్తుంది.